విప్రలబ్ధ

విప్రలబ్ధ

 

 

విప్రలబ్ధ

 

పుష్పించని మొక్క, సిద్ధించని ఆశయం, ఫలించని ప్రేమ, యదార్ధం కాని కలయిక ఆశాజ్యోతిని ఆరకుండా చూస్తాయి. - బుచ్చిబాబు

శీతాకాలపు వేకువ ఉదయం. మెలకువగా ఉండి వెచ్చటి రాజాయి కింద రాజుకుంటున్న వేడిని విడువ మనసు రాక ప్రియుని తలపుల ఒరిపిడిలో మత్తుగా జోగుతోంది లబ్ధ.

అలారం మోగింది. అందుకోసమే ఎదురుచూస్తున్న లబ్ధ బటన్ నొక్కి బజర్ నోరు మూయించింది. గోడ గడియారం ఐదు కొట్టి యధావిధి తన విధి నిర్వర్తిస్తోంది. దూరంగా ఫ్యాక్టరీ సైరన్ నిశ్శబ్దాన్ని నిద్రలేపుతోంది.

కప్పుకున్న కాశ్మీరు కంబళిని శరీరంపై నుండి తొలగించింది లబ్ధ. పొంచివున్న కటిక చల్లదనం ఒక్కసారి చుట్టుముట్టి శరీరాన్ని కట్టెలా బిగగట్టి వణికించింది. మళ్ళీ కంబళి కౌగిలిలో ఒదిగిపోయి ప్రియుని తలపుల పరిష్వంగనంలో వెచ్చటి కలలు కందామనే ఆలోచనను చాలా కష్టం పైన విరమించుకొని లేచింది లబ్ధ.

ఎదలో మెదిలే సొదలన్నీ కాగితాల మీదుగా కదల్చి విప్రవినోద్ కి ఎంతో దగ్గరయ్యింది లబ్ధ. మనసుతో మనసుని అనుక్షణం పలకరించే అతను మనిషిగా ఎక్కడైనా ఎదురుపడితే మాత్రం ఎక్కడలేని గాబరా. ఆ గాబరాతో ముఖంలో జబర్దస్తీగా చోటుచేసుకొనే అప్రసన్నత. అతడేమైనా దగ్గరకొచ్చి పలకరించ ప్రయత్నిస్తే బెదిరే కళ్ళల్లో తెరలు కట్టే కన్నీళ్లు. అది చూసి భయపడి బిత్తరపోయి నిరాశతో నీరసించి నిష్క్రమించే అతడు.

పరోక్షంలో ఎంతో ఉత్సాహం ఉల్లాసం కనపరచే తను ప్రత్యక్షంగా అతడిని చూసేసరికి ఇలా ప్రత్యేకంగా ఎందుకు ప్రవర్తిస్తుందనేదే ప్రశ్న.

అతడు తనని పిరికిదని అంచనా వేసెయ్యక ముందే ఏదైనా సంచలనాన్ని సృష్టించాలి. ఆలోచించింది. అనుకోకుండా అవకాశం చిక్కింది.

ఎదురొస్తున్న వాడిని నడిరోడ్డుపై అడ్డగించి సమయమిచ్చి సంకేతస్థలం చెప్పి రమ్మని కోరింది. అప్పుడతడు నలుదిక్కులా చూసి నిశ్చేష్టుడవ్వటం చూస్తే ఆ అమ్మాయికి అప్పుడు తెలిసింది. తనకంటే అతడికి ఎక్కువ భయం అని.

అప్పుడు నవ్వుకుంది. ఇప్పుడూ నవ్వుకుంటుంది, స్నానం చేసిన ఒంటిని తుడుచుకుంటూ..

స్నానాల గదిలోంచి బయటకి వచ్చి అద్దం ముందు అర్ధనగ్నంగా.. ఒక్క గాలికెరటం, సూర్యకిరణం చొరబడ వీలులేనంత పకడ్బందీగా మూసుకున్న ఒంటరి తన చిన్ని గది అనే పరిధిలో..

ముఖానికి పౌడర్ అద్దుకుంటుంటే..

'మీరు పౌడర్ పూసుకొని సరిగా అద్దుకోరులా ఉంది. ముఖానికి పట్టిన చిరు చెమట కారణంగా అనుకుంటా చెదరిన పూత అక్కడక్కడా తెల్లగా చారలు కట్టి లేత చర్మం పగిలినట్లు అనిపిస్తుంది' అతడు రాసిన ఒక ఉత్తరంలో వాక్యం జ్ఞాపకం వచ్చి సున్నితంగా పఫ్ తో సరిదిద్దుకుంది.

'కనుబొమల మధ్య కాస్తంత నిశితమైనట్టు ఎర్రటి చుక్క, కనీ కనిపించనట్టు కళ్ళకి కాటుక పూత. తడారిన కురులను ఒదులుగా ఒదిలేసి చెదిరిపోకుండా చుట్టిన రబ్బర్ బ్యాండ్. తలలో తురిమిన ఎర్రగులాబీ. బరువు పెరిగితే లేత చర్మం భరించలేదు అన్నట్టు చెవులకి పావలా కాసంత పరిమాణపు సన్నటి రింగులు. సుకుమారమైన మెడకి అసౌకర్యం కలుగజేయకుండా ప్రలంబాల మీదికి పయనించి ప్రాలంబంగా వన్నె తెచ్చుక్కున్న సన్నటి బంగారు గొలుసు..' అంతే, అంతకు మించి అలంకరణ ఏముంటుంది అంటాడు విప్ర. గుర్తు చేసుకొని 'అతి సహజమైన ప్రకృతిలో అంతులేని అందాలను వెతుక్కునే నిష్కల్మష హృదయుడు..నిరాడంబరుడు' అతడిని గూర్చి అలా అనుకోకుండా ఉండలేకపోయింది లబ్ధ.

ఆ అమ్మాయికి ఇప్పటికీ అర్ధం కాదు. అలాంటి వ్యక్తి తనని కదిలించాలని తనుగా ప్రయత్నించడంటే నమ్మశక్యం కాని విషయమే. అనుభవమైన తనే నమ్మలేకపోతుంది ఆ నిజాన్ని. అదో కమ్మని కలగా గుర్తుంది తప్పితే వాస్తవంలోనికి మళ్ళీ ఆన్వయించి చూడలేకపోతోంది. అతడలా తన వెనువెంట తిరగటం. ముందు భయపడింది. అలా భయపడినందుకు ఇప్పుడు సిగ్గుపడుతోంది.

వార్డ్ రోబ్ తెరచింది. దుస్తులు.. ఎన్నో ఫ్యాషన్లు.. జీన్స్,శారీస్, కుర్తాలు, మిడ్డీలు.. అవేవీ కాదు, చాలా అరుదుగా ధరించే పరికిణి, ఓణీ లొనే తనని చూడటానికి ఇష్టపడతాడట. సాంప్రదాయం సున్నితత్వం అందులో ప్రస్ఫుటించి ఆహ్లాదపరుస్తుందట. ఏమో, తనకేం తెలుసు? ఏ బట్టల్లో ఐనా తనకి తను నచ్చుతుంది. మన వీపు మనకి కనిపించనట్టు మన వేషంలో దోషం కూడానేమో..

ఆ అమ్మాయి పచ్చటి శరీరంపై ఒద్దికగా పరుచుకున్న లేతపచ్చటి దుస్తులు పవిత్రతని అపాదించుకొని ఖరీదు పెంచుకొన్నాయి.

'నిజం.. ఆ పరికిణీల్లో మీరేంత బావుంటారో.. వేకువ ఉదయాన మంచు నీటిముత్యాన్ని పొందుపరచుకొని అమాయకత్వాన్ని సంతరించుకునే గడ్డిపరక లోని లాలిత్యం కనిపిస్తుంది మీలో..' తనని అలా చూడటం అతడిని ఎంత భావుకత్వం లోనికి తీసుకెళ్తుంది. అలాంటి మృదుభావం మెదడుని ప్రశాంతపరచటం తప్పితే ప్రకంపనాలకి గురిచేసి ప్రలోభం చెందనియ్యదు. ఎదుటి మనిషిని వేషభాషలతో ఆవేశపెట్టటం కాకుండా ఆహ్లాదపరచటమే గొప్ప.

గొప్పతనం ఎక్కడుందో గ్రహించినా చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ఆధునికంగా తయారవ్వటం ఆ అమ్మాయికి తప్పటం లేదు. కానీ, ఇలా ఒకే ఒక వ్యక్తి కోసం ప్రత్యేకంగా.. పరిశుద్ధమైన పదహారణాల అడపిల్లలా.. అతి స్వల్ప అలంకరణలో ఆరాధనా పూర్వకంగా అలరింపజేస్తున్న ఆ అమ్మాయిలో అంతటి వశ్యతని సాధించిన ఆ ప్రియుడిది గొప్పతనం ఒక్కటే కాదు, అదృష్టం కూడా..

శుభోదయం..

బస్టాప్ లోని పాన్ షాపుల మీదుగా దూరంగా కనిపిస్తున్న చెట్లకొమ్మల మధ్యలోంచి దర్శనమిస్తున్న ఉదయ రవికిరణాలు. హైవే రోడ్డు రాత్రి కురిసిన మంచుకి తడిసి సూర్యుడి వెలుగు సోకటంతో త్రాచుపాములా నల్లగా మెరుస్తోంది.

రోడ్డు నిర్మానుష్యంగా.. పరిసరాలు నిశ్శబ్దంగా.. నిగూఢమైన నిర్మలత్వాన్ని ప్రదర్శిస్తూ.. మళ్ళీ మరో రోజు మొదలౌతోంది..

ఫస్ట్ బస్ వచ్చి ఆగింది. ఎదురుచూస్తున్న నలుగురు ప్రయాణీకులు బస్సు వద్దకి చేరారు. చేరిన ఆ నలుగురిలోనూ తనకి కావాల్సిన ముఖాన్ని వెతికే ప్రయత్నం చేసి ఫలితం దక్కక అంతవరకూ గుబులుతో బుగులు కొల్పిన హృదయం ఒక్కసారి దిగులు చెందటంతో ముఖం ముడుచుకొని కిందికి దిగింది లబ్ధ. ఆ నలుగురూ ఎక్కి సీట్లలో సర్దుకున్నాక బయలుదేరి వెళ్ళింది బస్సు.

చలిగాలి సన్నగా వీస్తోంది. పైట కొంగుని భుజాల చుట్టూ తిప్పి కప్పుకొని చేత పట్టుకున్న పుస్తకాలను గుండెలకు మరింత గట్టిగా అదుముకుంది లబ్ధ. ఆమె కళ్ళు ప్రియుడి కోసం పరిసరాలను నిశితంగా పరిశీలించాయి. ఆమె కాళ్ళు ఆమెకు తెలియకుండానే రోజూ తను వేచివుండే స్థలానికి తీసుకెళ్లి ఆపాయి. అక్కడ నిల్చుంది లబ్ధ.

నిశ్శబ్దం..

ఆమెతో నిమిత్తం లేనట్టు పరిసరాలు యాంత్రికంగా జీవం పోసుకుంటున్నాయి. అక్కడ ఆమె ఉనికిలో ఏ ప్రత్యేకతా లేకపోయి చాలాకాలం అయ్యింది.

"లబ్ధ"

ప్రక్కకి చూసింది. అతడు కాదు, స్నేహితురాలు.

"వెళదామా" అడిగింది స్నేహితురాలు.

"అతను.. అతను ఈ రోజు కూడా రాలేదు" అమాయకంగా ఫిర్యాదు చేసింది లబ్ధ.

స్నేహితురాలి కళ్ళలో సన్నటి నీటిజీర కదిలింది. ఆ అమ్మాయిలోని ఆ భావానికి భాష్యం చెప్తే సరిగ్గా ఇదే అర్ధం వస్తుంది..

"అతడు మనిషిగా తిరిగి రాలేనంత దూరం జరిగిపోయాడని.. పోతూ, తన ఉనికి ఈ లోకంలో మిగిల్చేందుకు తన అభిరుచి మేరకు నీలో నిండుదనాన్ని పొందుపరచి.. ఆ రకంగా గెలిచి, సంతృప్తి చెంది.. ఇది ఇదంతా నీకెలా చెప్పను నేస్తం..? చెప్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఉహించుకోలేక ఒక నిజాన్ని నాలోనే దాగుడుమూతలు ఆడిస్తూ నిన్ను ఆశావాదంలోకి తోసేస్తున్న నన్ను క్షమించు.."

                        *