నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి !

నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి !

 

 

శీతాకాలం పొద్దు .ఇంకా పూర్తిగా తెలవారలేదు .తన దుకాణం ముందు నించున్న చలమయ్య మనసునిండా దిగులు .దుకాణం తెరవగానే వరసగా పేర్చిన పప్పులు , ఉప్పులు , సబ్బులు చూసిన అతడిలో దుఃఖం పెరిగింది .ముందురోజు సంతలో కొని తెచ్చిన ఆకుకూరలు , కాయగూరలు వడలిపోయి కనిపించాయి .చలమయ్య ఎప్పుడూ తెల్లవారకముందే దుకాణం తెరుస్తాడు .వాహ్యాళి కొచ్చిన వాళ్లతో తన దుకాణం సందడిగా ఉండేది .ఏదో జానపదం పాడుతూ బేరాలు సాగించేవాడు .తుపాకీ దెబ్బకు ఆకాశంలో పక్షులన్నీ ఎగిరిపోయినట్టు , నెలక్రితం వెలిసిన ఆ అద్దాల ఎయిర్ కండిషనింగ్ దుకాణం తన దగ్గరకొచ్చే ఖాతాదారులను రెప్పపాటులో మాయం చేసేసింది .

పట్నానికి , నగరానికి మధ్యస్థంగా నిలిచిన ఆ ఊరు పొలిమేరలో జనపనార మిల్లు ఉంది .అందులో పని చేసే ఉద్యోగులు చిన్నా పెద్దా కలిస్తే వెయ్యిమంది .వారిలో చాలామంది ఉదయాన్నే సరుకుల కోసం అతని దుకాణానికి వస్తారు .చలమయ్య కిరాణా షాపు అంటే ఆ ప్రాంతంలో మంచి పేరు , ఇపుడా పేరు ఏమయ్యింది ?చలమయ్యలో ఏదో బాధ , ఉక్రోషం .దుకాణం ముందునుంచే సైకిల్ పై వెళ్తున్నాడు రామ్ ప్రసాద్ ." రామ్ ప్రసాద్ , సరుకులొద్దా ?!  ఈ మధ్య షాపుకి రావడం మానేసావేం ! అన్నాడు , " మా ఆవిడ ఆ షాపింగ్ మాల్లోనే సరుకులు తెస్తోంది .నెలలో ఒకసారి లాటరీ తీసి ఆడవాళ్ళకు పట్టుచీర ఇస్తున్నారంట !గబగబ చెప్పి వెళ్ళిపోయాడు .వాళ్ళు పట్టుచీర ఇస్తారట తనేం ఇవ్వగలడు ?శుభ్రమైన సరుకులు ఇవ్వడం తప్ప ...అనుకున్నాడు .చలమయ్యకు రామ్ ప్రసాద్ ను చూస్తూంటే గతం గుర్తుకొచ్చింది .రెండు సంవత్సరాల క్రితం తను అలా సైకిలు మీద ఆ జనపనార మిల్లులో ఉద్యో గానికి వెళ్ళేవాడు .భార్య వేడివేడిగా వండి క్యారేజ్ కట్టేది .తను ఆ మిల్లులో ఎకౌంట్స్ గుమస్తా , ఉద్యోగుల జీతాలు , ప్రయాణపు ఖర్చులు , మిల్లు రాబడి , నష్టం , ఖర్చులు చూసేవాడు .తన పని లెడ్జరు రాయడం తను రాసే లెడ్జరు చూసి , ఆఫీసరు ముచ్చట పడేవాడు .ముత్యాల్లాంటి అక్షరాలు , ఎక్కడా కొట్టివేతలు ఉండేవి కాదు .కాలిక్యులేటర్ ఉపయోగించేవాడు కాదు .అంతా నోటిలెక్కలే !ఎక్కడా తప్పు దొర్లేది కాదు !తనను పెద్ద గుమస్తాగా పదోన్నతి పొందడానికి పై అధికారులు సమ్మతించే దశలో , తన మీద దెబ్బపడింది .ఫ్యాక్టరీలో కంప్యూటరీకరణ .వేళ్ళమీద లెక్క పెట్టే గుమస్తాలను తీసెయ్యాలనీ ....యాభైమంది చేసే పని ఒక కంప్యూటరు చేస్తుందనీ తన వంటి వారిని గౌరవంగా బయటకు తరిమారు .తన బతుకు రోడ్డు మీద కొచ్చింది .కాలేజీ చదువుతున్న కూతురు , ముసలితల్లి .ఫ్యాక్టరీ వారిచ్చిన క్వార్టరు ఖాళీ చెయ్యాలి .వచ్చే జీతంలో మూడోవంతు పెన్షను ...పాతికేళ్ళ సర్వీసులో దాచుకున్న డబ్బులు ఐదు లక్షలు , ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీసుంది .పెద్దకొడుకు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు .వాడే ఆశాకిరణం అనుకున్నాడు .మరి ఏం జరిగింది ?తనకి తగిలిన దెబ్బే వాడికీ తగిలింది .కంప్యూటర్ రాని తనకు ఉద్యోగం పోతే , దాంట్లో మంచి ప్రావీణ్యం ఉన్న కొడుకును బయటకు తరిమారు .కారణం ఆర్థిక మాంద్యం , ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావటం అంటే ఇదేనేమో !తనకేమీ పాలుపోలేదు .ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు , తనూ , కొడుకూ !వాడు ఇంట్లో

ఒక మూల కూర్చుని బాధపడుతున్నాడు . తనేమో రోజూ ఇంట్లోంచి బయటపడి రోడ్డులంట తిరిగేవాడు . అలా తిరుగుతుంటే ఒక రోజు కూరగాయల బండి నడుపుతున్న ఒక అమ్మాయి , బహుశా పాతికేళ్ళుంటాయేమో . . . తనను పిలిచింది . అప్పుడప్పుడు ఆ అమ్మాయి దగ్గర కూరలు కొనేవాడు . అయ్యగారూ . . . ఏమీ అనుకోరుగా . . . ఒక పావుగంట బండి దగర కూర్చుంటారా ? పక్కవీధిలోనే నా ఇల్లు . . . ఇంటికెళ్ళి వచ్చేస్తాను ' అంటూ బండి పక్కనే వున్న చిన్నబల్లను చూపించింది . ఏదో అత్యవసర పరిస్థితి అయి వుంటుంది . ఆడకూతురు సహాయం కోరింది . అంతే తను ఆ పావు గంట సేపు ఆ కూరగాయలబండికి కాపలా ఉన్నాడు . పావుగంట తర్వాత ఆ అమ్మాయి వచ్చింది . రెండు చేతులూ జోడించింది . అలా రోజూటంఛనుగా అదే టైముకు ఆ అమ్మాయి నడుపుతున్న కూరగాయల బండి దగ్గరకు రావడం , ఆమె తనను అడగకముందే తనే , " నువ్వెళ్లి రామ్మా ఇంటికి , నేను వుంటానులే అనేవాడు . తనకు అదో కాలక్షేపం . ఆ అమ్మాయి అరగంటకు పైగా తన బండిని తనకు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయేది . ఏ కూరగాయలు ఎంత రేటో వచ్చినవాళ్ళకు చెప్పేవాడు . . . ఇక ఆ బేరం నచ్చితే కూరగాయలు అమ్మి డబ్బులు గల్లా పెట్టెలో వేసేవాడు . కొంత మంది తెలిసినవాళ్ళు . " ఏం చలమయ్యా ఫ్యాక్టరీలో ఉద్యోగం పోయిన తర్వాత ఈ కూరగాయల షాపు పెట్టావా ? ” అనేవారు . తను నవ్వే సేవాడు . ఆ అమ్మాయి వద్దన్నా చిన్న ప్లాస్టిక్ కవరులో కూరగాయలు వేసి తనకు ఇచ్చేది . డబ్బులు తీసుకునేది కాదు రోజూ నీ దుకాణం పావుగంట సేపు చూస్తున్నందుకు జీతమా తల్లీ . . అంటే , నవ్వేసేది ఆ అమ్మాయి . అలా కొన్ని రోజులు గడిచాయి . రోజూ ఆ అమ్మాయి ఇంటికి ఈ టైములోనే ఎందుకు వెళుతున్నట్టు ? ఆమె భర్త ఏమయ్యాడు . . . ? ఈ ప్రశ్నలన్నీ ఓ రోజు అడిగాడు . అప్పుడు ఆమె తన కథంతా చెప్పుకొచ్చింది .

 

బాబుగారూ , నాకు పెళ్ళయి మూడేళ్ళయింది నా మొగుడిది హెయిర్ కటింగ్ సెలూన్ .గిరాకీ బాగా ఉండేది .అయితే మా షాపు ఎదురుగా బ్యూటీ పార్లర్ పెట్టారు .దాంట్లో మేకప్ వెయ్యడంతో పాటు కట్టింగులు చేసేవారు .అంతే , అందరూ ఆ బ్యూటీ పార్లర్ కు ఎగబడ్డారు .మా ఆయన షాపు మూసెయ్యాల్సి వచ్చింది .సిటీలో ఏదో అపార్టుమెంట్ కడుతుంటే దాంట్లో పనికి కుదిరాడు .రోజూ వాళ్ళిచ్చే రెండు , మూడొందలు తాగుడికి , తిండికి సరిపోతుంది .వారానికోసారి ఇక్కడికి వచ్చి దారి ఖర్చులకి డబ్బులు కావాలని నన్నే అడుగుతాడు .ఆయనకు జ్ఞానం ఎప్పుడొస్తుందో తెలీదు .అంతవరకు బతకడం ఎలా ?అందుకే ఈ కూరగాయల బండితో వ్యాపారం మొదలు పెట్టాను.ఇంటి దగ్గర ముసలి అత్త , ఆరు నెలల కూతురు ఉన్నారు . వచ్చేటప్పడే చంటిదానికి పాలిస్తాను . మళ్ళీ ఆకలేసి ఏడుస్తుందని ఈ టైముకి ఇంటికి వెళ్తాను . " అంది .ఆ అమ్మాయి మాటలు చలమయ్యకు ఆనందం కలిగించాయి .ఒక పసికందు ఆకలి తీర్చడం కోసం ఆమె ఇంటికి వెల్తోంది .తను చేసిన సహాయం విలువైనదే అనుకున్నాడు .ఆ అమ్మాయి ద్వారా అతడికో జీవిత సత్యం తెలిసింది .ఉద్యోగం పోగానే తను రోడ్డు పట్టి తిరుగుతున్నాడు .కొడుకు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాడు .ఆ ఇల్లాలు ఉపాధి కోల్పోతే , తనే కుటుంబానికి ఆధారంగా నిలబడింది .ఆరు నెలల పసికందుతో తన బతుకు బండి నడిపిస్తోంది .ఆ అమ్మాయి చూపిన తోవలోనే తను నడవాలను కున్నాడు .కొంత బ్యాంకు లోను తీసుకున్నాడు , తన దగ్గరున్న డబ్బులో ఓ లక్ష రూపాయలు ఖర్చుతో ఫ్యాక్టరీకి దగ్గరలో ఒక కిరాణాషాపు పెట్టాడు .దూరంగా ఉన్న కొండ కింద జరిగే సంత నుంచి కూరగాయలు , ఆకుకూరలు తెచ్చి లాభానికి అమ్మేవాడు .కొడుకుని సాయంగా రమ్మన్నందుకు తనమీద మండిపడ్డాడు .సాఫ్టవేర్ ఇంజనీర్ గా చేసినవాడిని , కిరాణా కొట్లో పొట్లాలు కట్టమంటావా నేనంత లోకువైపోయానా ?ఎప్పుడూ ఇలాగే వుంటాననా నాకు మంచి రోజులు రావా ?" అన్నాడు . కొడుకు మాటలతో చలమయ్య సమాధానపడ్డాడు . తనకు సహాయంగా ఇంటర్ ఫెయిలయిన మేనల్లుడిని పెట్టుకున్నాడు . మెల్లగా కిరాణా షాపు పుంజుకుంది . నెలయ్యేసరికి రుణ వాయిదాలు చెల్లించ గలుగుతున్నాడు . చిన్న షాపు పెద్దదయ్యింది . ఎక్కువమంది వినియోగ దారులు రావడంతో తనకు తీరిక వుండేది కాదు . ఈ రెండేళ్ళలో తన దుకాణం అందరికీ అలవాటయ్యింది . అలా సాఫీగా సాగుతున్న జీవితంలోపెద్ద షాకు . తన దుకాణానికి కొంచెం దూరంలో వెలిసిన అల్పా షాపింగ్ మాల్ అతన్ని దెబ్బతీసింది . బహుమతుల స్కీము , మహిళలకు చీరల స్కీము పెట్టి వినియోగదారులను ఆకర్షించారు . రెండు సంవత్సరాలుగా ఇంట్లో ఖాళీగా కూర్చున్న కొడుకు టై కట్టుకుని టక్ చేసుకుని బయలుదేరాడు ఓరోజు , “ ఎక్కడికిరా ? ” అన్నాడు చలమయ్య ఆల్ఫా షాపింగ్ మాల్లో ఉద్యోగం . బిజినెస్ ఎగ్జిక్యూటివ్ . ప్రస్తుతం పదివేలుజీతం మెల్లగా పెంచుతారట . ? ” ఆ మాటకు చాలా కోపం వచ్చింది చలమయ్యకు . మరి నా దుకాణంలో పని చెయ్యడానికి నామోషీ పడ్డావేంరా . . అనేశాడు . ఛ . . . ఛ . . . నీ దుకాణానికి ఆ కార్పొరేట్ షాపింగ్ మాల్ తో పోలికా . . " కొడుకు తన గుండెలమీదుగా నడిచి వెళ్ళిన భావన .పోనీలెండి .రెండేళ్ళు ఖాళీగా వున్నాడు , ఇప్పుడు వాడికి ఏదో బతుకు తెరువు దొరికింది అంది భార్య  

అయిష్టంగా సమాధానపడ్డాడు చలమయ్య .ఈ చేదు అనుభవాలతో బాగా నీరసపడిపోయాడు .అసలు తను తిరిగి నిలదొక్కుకోగలనా అని భయ పడుతున్నాడు .ఈ పప్పులు , ఉప్పులు , సబ్బులు అమ్మేసి దుకాణం మూసేయ్యాలా ?మరి బ్యాంక్ లోను ఎలా తీర్చాలని మదనపడ్డాడు .ఇంతలో ఏదో వాహనం వస్తున్న శబ్దం .బాగా వేగంగా పరుగెడుతున్న కుక్కల గుంపు .కుక్కల్ని కార్పొరేషన్ వాళ్ళు తీసుకుపోతున్నారు .కారణం పట్నంలో కుక్కల బెడద .కుక్కలు కరిచి రేబిస్ వ్యాదితో చాలామంది చని పోయారు ..అందుకే యుద్ధ ప్రాతిపదిక మీద కుక్కలవేట .వాటిని చూసి గబగబా దుకాణం లోపలికి వెళ్ళిపోయాడు చలమయ్య .తనకి కుక్కలంటే చాలా భయం .ఆ భయం ఇప్పటిది కాదు , బాల్యంలోనే మొదలయ్యింది .ఏడో తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ మేట్ నానాజీని కుక్క కరిచింది .చావుకు ముందు వాడు పడే బాధని తను ప్రత్యక్షంగా చూశాడు .ఆ భయం కరమైన చావు తన మనసులో బలంగా నాటుకుంది .అందుకే ఇంత వయసొచ్చినా కుక్కను చూస్తే చాలా భయం .ఆ కుక్కల వ్యాన్ వెళ్ళే వరకూ భయం భయంగా గడిపాడు చలమయ్య .ఆ రోజు రాత్రి పది గంటల వరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాడు .ఎవరో ఒకళిద్దరు వచ్చారు దుకాణం దగ్గరికి , ఆదయినా అప్పు బేరం - బాధగా దుకాణం మూసి సైకిలెక్కుతుంటే , తన దగ్గర ఎప్పుడు అరువుకు సరుకులు పట్టుకెళ్ళే సాంబయ్య ఎదురుపడి ...బాబూ తమరి ఇల్లెక్కడ?” అన్నాడు .ఆ కొండ దాటి ముందుకెళ్తే , కాలనీలో అన్నాడు .జాగ్రత్తండీ బాబూ , ఒక చిరుత పులి , దాని పిల్లలతో తిరుగుతోంది .మొత్తం ఐదు పిల్లలు .మొన్న రెండు కుక్కల్ని తినేసింది .నిన్న పైడితల్లి గారి పాలేరు గేదెల్ని తోలుకెళుతుంటే మీద పడి జబ్బలు కొరికేసింది " అన్నాడు .

ఆ మాటలకు పై ప్రాణాలు పైనే పోయాయి చలమయ్యకు .మెల్లగా సైకిలు తొక్కుతున్నాడు .అసలే చలిగాలి , పైగా చిరుతపులి భయం కలిగించిన వణుకు , సైకిలు తొక్కుతుంటే రోడ్డుపక్క ప్రతి చెట్లు , పుట్ట చిరుతపులిలా కనిపించాయి చలమయ్యకు ఇదివరకు కుక్కలంటే భయపడేవాడు , అ కార్పొరేషన్ పుణ్యమా అని మాయమైపోయాయి అనుకుంటే , ఇపుడీ చిరుత పులి బెడదా అనుకుని బెంగపడ్డాడు .ఇంటికి చేరినా ఆ భయం తగ్గలేదు .రెండు రోజుల తర్వాత తెల్లవారకముందే సంతలో కూరగాయలు ఆకుకూరలు కొందామని సైకిలు పైన వెళ్తుంటే కొండ పక్కన లేబర్ కాలనీలో వుండే జంగయ్య ఎదురై " అయ్యగారూ కొండవైపు ఒక్కళ్ళే వెళ్ళకండి , తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి " అన్నాడు .మనసులో భయం నీడలు .' నిన్న రాత్రి సాంబయ్య భయపెట్టాడు అయినా తప్పదు , కనీసం ఆకుకూరలు , కూరగాయలైనా అమ్ముకుంటే మంచిదేమో ...అలా అమ్మాలంటే సంతలోనే చౌకగా దొరుకుతాయని కుంటూ సైకిలు పోనిస్తున్నాడు .తమ కాలనీ చివర కొండ దిగువున వుంచే కోనేరు దాటి సంతవైపు మలుపు తిరుగుతున్నాడు , ఎదురుగా మెరుస్తున్న కళ్ళతో చిరుతపులి .చలమయ్య ఇక చావే ఖాయం అనుకున్నాడు .తనకు నూకలు లేవనుకుని ముందుకు కదలలేక శిలలా వుండిపోయాడు .కళ్ళు విప్పార్చుకుని తనని చూస్తున్న చిరుత. చిరుతను చూడాలంటే భయం వేసి కళ్ళు మూసుకున్నాడు .ఇంతలో ఊళ్ళో ఏదో కలకలం , లేబర్ కాలనీలో కుర్రాళ్ళు కాగడాలతో , డప్పులతో జానపద గీతం పాడుతూ వస్తున్నారు .చెరుకు తోటలో కాపలా కాసేవాళ్లు .తీరిక ఉన్నప్పుడు పాటలు పాడుతూ డబ్బులు అడుగుతుంటారు .ఆ కుర్రాళ్ళు ఒక జానపద గీతం అందుకున్నారు .

" కొయ్యి కొయ్యింగానే కోడికూత మానేసి

కైలాసం నేను పోయిన నంటదే కోడిపిల్ల

దిబ్బమీద కుంచబోయి ఆహ , బొచ్చుగిచ్చు గీకుతుంటే

ఆ శిలకుర్ర సిన్నప్ప క్షవరం చేసినాడంటదే కోడిపిల్ల

ఆ పొయ్యికాడ కుంచబోయి తిప్పి తిప్పి కాలత్తంటే

ఆ సాకిరేవు పాయికాడ సలిమంట లంటదే కోడిపిల్ల , మిద్దపక్క కుంచబోయి రుద్దిరుద్ది కడగతంటే

 ఏమ్మా కాశీ గంగలోన జలకమాడినాన్నంటదే కోడిపిల్ల .

మొద్దు  మీదకు తీసుకోబోయి తుంటలు గింటలు

 నరుకుతుంటే , ఏమ్మా కోడిపందేం ఆటగాడు అరె చీరనన్నదే కోడిపిల్ల

 మిర్యాలు , కారాలు , మిరపకాయలు , మసాల నూరతంటే

ఏమ్మా పనుగు , జువ్వాది సెంటు పూసుకొంటినన్నదే కోడిపిల్ల

ఒక గంటెడు కూర కూటి

పైన పోసుకుంటే , బువ్వ

 పైన పోసుకుంటే , ఏమ్మామల్లెపరుపుపైన

నేను పండుకుంటినంటదే కోడిపిల్ల .

 

పాట వింటూ పూర్తిగా లోకాన్ని మర్చిపోయాడు చలమయ్య పాట అయిపోగానే చుట్టూ చూశాడు . చిరుత కనిపించలేదు . ఆ పాటంటే తనకి చాలా ఇష్టం . ఎంతో ఆశావాహ దృక్పథం వుంది అందులో తనను కోసి కూర వండుకుంటున్నా ఆనందంగా తన ఆత్మకథను వినిపిస్తున్న ఆ కోడిపిల్ల పాటను కుర్రాళ్ళు పాడుతున్నారు . దానికి తగ్గట్టుగా , లయబద్ధంగా , నాట్యం చేస్తుంటే మైమరచిపోయి చూస్తున్నాడు , ఎదురుగా వున్న చిరతపులి సంగతే మరిచిపోయాడు . అది ఎప్పుడు కొండ పైకి వెళ్ళిందో తెలీదు . బతుకుజీవుడా అనుకుంటూ సంత వైపు సైకిలు తిప్పాడు . వరుసగా రెండు రోజులు దుకాణానికి వెళ్ళలేదు . వెళ్ళినా ప్రయోజనం లేదు . రోజూ

దుకాణానికి వచ్చేది ఒకళ్ళో , ఇద్దరో . రోజురోజుకీ పెరుగుతున్న అప్పు , ఈలోగా పెళ్ళికి రమ్మని కబురొచ్చింది . ఒక బంధువు కూతురి పెళ్ళి, విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు . భార్యను తీసుకుని బయలుదేరాడు . రెండు రోజులు బయట తిరిగొస్తే కాస్త మనసు కుదుట పడుతుందనుకున్నాడు . షాపును మేనల్లుడికి అప్పచెప్పాడు . అలా వెళ్ళినవాడు వెంటనే రాలేకపోయాడు . పదిరోజుల తర్వాత ఇంటి కొచ్చాడు . అప్పటికే సాయంత్రం అయిపోయింది . భార్యతో కలిసి ఇంటి కొచ్చేసరికి తలుపులు తెరిచేఉన్నాయి. అమ్మాయి బహుశా కాలేజీ నుంచి ఇంటికి వచ్చి వుంటుంది . మరి అబ్బాయి డ్యూటీకి వెళ్ళలేదేం . . ' అను కున్నాడు . లోపల గదిలో మంచం మీద పడుకున్న కొడుకు తల్లి తండ్రిని చూసినా ఏమీ మాట్లాడకుండా అలాగే వుండిపోయాడు . ఏమయిందిరా ? షాపింగ్ మాల్ కి వెళ్ళలేదా ? ” అన్నాడు . కొడుకు మౌనంగా వున్నాడు తప్ప జవాబు చెప్పలేదు . మళ్ళీ రెట్టించి అడిగేసరికి , కొడుకు కళ్ళల్లో నీళ్ళు . ఏడుస్తున్న కొడుకును చూసి భార్య గొల్లుమంది . చలమయ్యకు అర్థంకాలేదు . అసలేం జరిగి వుంటుంది ? ! ఇంతలో కొడుకు స్నేహితుడు వచ్చాడు . ఏమయిందిరా నాయనా ? మా అబ్బాయి ఏడుస్తున్నాడు ! ? ” అన్నాడు . " మా ఉద్యోగాలు తీసేశారండి అన్నాడు మెల్లగా . . ఆ మాటతో హతాశుడయ్యాడు చలమయ్య క్షణం సేపు అతడి మెదడు మొద్దుబారినట్టనిపించింది . కొడుకు స్నేహితుడు చెప్పుకుపోతున్నాడు . ' ఆ షాపింగ్ మాల్ నష్టాల్లో నడుస్తోందండి . మీలాంటి చిన్న దుకాణ వారుల్ని దెబ్బతీస్తూ అంధ్రదేశంనిండా ఆల్ఫా షాపింగ్ మాళ్ళు పెట్టారు. తాజా కాయగూరలు , తాజా ఆకు కూరలు అన్నారు గానీ , అన్నీ కుళ్లిపోయి వాడి పోతున్నాయి . కారణం విద్యుత్ కోత ! ఎక్కువగా స్టాకు తెచ్చి పెట్టారు . ఇప్పుడు వాటి స్థానంలో మన ఊళ్ళో ' మెగాబజార్ ' ప్రారంభిస్తున్నారు . ఒక మల్టీ నేషనల్ కం పెనీవారు ఈ ఆల్ఫా షాపింగ్ మాల్స్ , మెగాబజారుతో కలిపేస్తారట . అందుకని మా ఉద్యోగాలు తీసేసి , ఎమ్ బి ఎ చదువుతున్న వాళ్ళను అతి తక్కువ జీతంతో అప్రంటీస్లుగా చేర్చుకుంటారట . వాళ్ళని ప్రాజెక్ట్ వర్క్ పేరుతో ఎక్స్ ప్లాయిట్ చేస్తారన్నమాట అన్నాడు . ఆ మాటలకు అంతకు ముందున్న దిగులు మాయమయ్యింది . తన కడుపు కొట్టిన ఆ షాపింగ్ మాల్స్ పడగొట్టే ఇంకో షాపింగ్ మాల్. అలా ఆలోచిస్తూనే బయటకు వచ్చాడు చలమయ్య . భార్యకు , కొడుకుకు ఏమీ చెప్పకుండానే సైకిలెక్కి వేగంగా నడుపుతున్నాడు . కాలనీ దాటి , కోనేటి ఒడ్డు ఎక్కాడు . అక్కడి నుంచి మెల్లగా కొండ మలుపు తిరిగాడు . పల్చటి చీకటి తెరలు మెల్లగా పరుచు కుంటున్నాయి . మిణుకుమిణుకుమంటున్న మున్సిపాలిటీ వీధి దీపాలు దారిలో రెండు కుక్కలు వెంటపడ్డాయి . చల మయ్యకు భయం వెయ్యలేదు . కొండ దాటేసరికి తన బండి మీద వెళుతున్న శివాలయం పూజారి . ఏంటి చలమయ్యగారూ ! ఒక్కరే సైకిలు మీద వెళుతున్నారు ? చీకటి పడింది కదా ! చిరుతపులి తిరుగుతోంది జాగ్రత్త అంటూ ముందుకు సాగాడు . ఆ మాటలూ చలమయ్యలో భయం కల్పించలేదు . షాపు దగ్గరకి చేరాడు . షాపుముందు క్యూ కట్టిన కస్టమర్లు . మేనల్లు డొక్కడే అవస్థ పడుతూ కనిపించాడు . తను గబగబా అతనికి సహాయం చేస్తూ వచ్చిన కస్టమర్లకి కావాల్సినవి ఇచ్చి పంపించేశాడు . అతడికి ఆనందంగా వుంది . ఆశ్చర్యంగా వుంది . తన దుకాణం మునుపటిలా సందడి సందడిగా వుంటుందని ఊహించలేకపోయాడు . తను కూర్చునే కూర్చీ పక్కన గల్లా పెట్టే మీదున్న

రేడియో తీసుకుని బయటకొచ్చాడు . బయట చల్లటి వాతావరణం. ఆకాశంలో సంపూర్ణంగా కనిపిస్తున్న చంద్రుడు . ఇంతలో కొడుకు , అటు మిత్రుడు బైక్ మీద వచ్చారు . నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వుంటావు . ఇంటికి వెళ్ళు నేను దుకాణం చూసుకుంటానులే " అన్నాడు కొడుకు . ఆ మాటలు చల మయ్యకు ఆనందం కలిగించాయి . రేడియో ఆన్ చేసాడు అప్పటికే ప్రత్యేక వార్తలు వస్తున్నాయి . రాష్ట్రంలో అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్మర్ట్ కనుక రంగ ప్రవేశం చేస్తే దేశీయ హోల్ సేల్ మార్కెట్ పూర్తిగా పడిపోయే అవకాశా లున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు . ఈ వాల్మర్ట్ ప్రభావంతో చిల్లర దుకాణదారులు , వీధి వ్యాపారులు నడిరోడ్డున పడే ప్రమాదముంది . వార్తలు సమాప్తం" 

అంకుల్ , ఈ వార్త విన్నారా వాల్మార్ట్ గురించి . . . . అన్నాడు కొడుకు స్నేహితుడు . విన్నాను , అయినా ఫరవాలేదు . ఆలా షాపింగ్ మాల్ వచ్చిందని నాలాంటి చిన్న వ్యాపారులు భయపడ్డారు . తర్వాత ఇప్పుడు మెగా బజార్ వచ్చిందని ఆల్ఫా షాపింగ్ మాల్ వారు భయపడవచ్చు . రేపు వాల్ మార్ట్ వస్తే మెగా బజారుకు దడ పుడుతుందేమో .. ! కప్పను . . పాము , పామును . ముంగీస . ఇలా చిన్న ప్రాణిని పెద్ద ప్రాణి , దాన్ని ఇంకా పెద్ద ప్రాణి మింగేస్తుంటాయి . ఇది సృష్టి చక్రం . తుఫానులకు , సునామీలకు మహా వృక్షాలు కూలిపోవచ్చు . కానీ . నాలాంటి చిన్ని మొక్కలు కనీసం బతికి బట్ట కడతాయి . ఇదే నా ఆశ . అయినా తప్పదు . బతుకు యుద్ధంలో ప్రాణాలున్నంతవరకు పోరాడలసిందే . నా పరిధిలో నా చిన్న సామ్రాజ్యంలో నేనే రాజును.అన్నాడు చలమయ్య దృఢంగా . అంతలో ఎఫ్ఎమ్ రేడియోలో పాట వినిపించింది .

"నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా ! సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా ! పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా ! గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా ! రగులుతున్న గుండెకూడ సూర్యగోళమంటిదేరా ! నిషా విలాసమెంత సేపురా ! ఉషోదయాన్ని ఎవ్వడాపురా !  ఆ పాటకు లయబద్ధంగా చిందులేస్తూ పదం కలుపుతున్నాడు చలమయ్య . అతడిని చూసి , అతడి కొడుకు , ఆ కొడుకు స్నేహితుడు , ఆ దుకాణానికి వచ్చిన వినియోగదారులు , ఆ కొండ , కోనేరు , శివాలయం గుడి , సమస్త ప్రకృతి ఆశ్చర్యంగా , స్తబ్దుగా చూస్తున్నా దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి  పాడుతూనే వున్నాడు . ( ఈ కథలో కోడిపిల్ల జానపద గీతం రాసింది వీర్రాజుగారని ఎవరో చెప్పగా విన్నాను . కథ ముగింపులో పేర్కొన్న గీతం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది . వారికి నా కృతజ్ఞతలు)