జయహో జగన్నాథా..

జయహో జగన్నాథా..

 

జయహో జగన్నాథా..

పసుపులేటి సత్య శ్రీనివాస్

 

                మేళ తాళాలు.. మంగళవాద్య నాదాలు.. కర్ణపేయంగా భక్త రస రంజితంగా హోరెత్తుతున్నాయి. భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం పూరీ పట్టణంలోని జగన్నాథుని ఆలయ ప్రాంగణం లక్షలాది భక్త జనావళితో నిండిపోయి ఉంది. విశ్వానికి నాథుడైన జగన్నాధుని దర్శించాలని, ఆ జగన్నాథుని రథయాత్రలో తరించాలని జనం ఎదురుచూస్తున్నారు. ఉదయాన్నే పండాలు (పూజారులు) గర్భగుడిలో జగన్నాథునికి శాస్త్రోక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

                శుభముహూర్త సమయం సమీపించగానే మనిమా.. మనిమా..’ (జగన్నాథా) అని పెద్దగా అంటూ జగన్నాథ, బలరామదేవ, సుభద్రాదేవిల విగ్రహలను కదిలించారు. మూల విరాట్టులను ఆలయంలోనుండి బయటికి తీసుకునివచ్చారు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

                దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుండి బయటికి తీసుకుగానే ఎదురు చూస్తున్న భక్తజనం జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేసారు.

                ఆ ఆషాఢ శుద్ధ విదియ పర్వదినాన పూరీ క్షేత్ర ప్రాంగణంలో జయహో.. జగన్నాథా, జై బలరామా.. జై జగన్నాథా.. అంటూ అన్ని వైపులనుండి జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. అంతరాలయం లోని రత్నపీఠిక పైనుండి బయటికి వచ్చిన స్వామి పసుపు, బంగారురంగు వస్త్రాలతో పీతాంబరధారియై జగన్మోహన రూపంతో దర్శనమిస్తోంటే భక్తులందరూ మైమరచిపోయారు.

                ఆలయ ప్రధాన ద్వారానికి సమీపంలో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన మూడు రథాలు నిలపబడి ఉన్నాయి. జగన్నాథస్వామి రథం నందిగోసా.. నలభై ఐదు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుతో పదహారు చక్రాలను కలిగి ఉంటుంది. రథచక్రాలు ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరించబడి ఉంటాయి. బలరామ రథం తలాద్వాజా.. నలభై ఐదు అడుగుల ఎత్తుతో ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించబడిన పదిహేను చక్రాలతో ఉంటుంది. సుభద్ర రథం దేవదాలన నలభై నాలుగు అడుగుల ఎత్తుతో పన్నెండు చక్రాలతో ఉంటుంది. ఎరుపు, నలుపు వస్త్రాలతో చక్రాలు అలంకరించబడి ఉంటాయి.

                జగన్నాథుని రథయాత్రకి ఏభై ఎనిమిది రోజులముందు వైశాఖ శుక్లపక్షం అక్షయ తృతీయ రోజు జగన్నాథుని భక్తి పూర్వకంగా దర్శించుకుని మనసా ఆ స్వామి రూపాన్ని నిలుపుకుని, వాచా జయహో జగన్నాథా అని నామ స్మరణం చేస్తూ కర్మణా ఆయనని ఊరేగించే అత్యంత మహిమాన్వితమైన రథనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఆలయ ప్రధాన పూజారి, వారి తొమ్మిదిమంది శిష్యులు, వారి నూట ఇరవైఐదుమంది సహయకులు.

                నారాయణ్ ఆ నూట ఇరవైఐదు మంది సహాయకులలో ఒకడు. నారాయణ్ వంశస్థులు తరతరాలనుండి జగన్నాథుని రథనిర్మాణ పనులలో పాల్గొంటున్నారు. ఆ వంశంలో పుట్టడం తన అదృష్టంగా భావించి నారాయణ్ అత్యంత భక్తి శ్తద్ధలతో రథ నిర్మాణ పనులు చేస్తాడు ప్రతీ సంవత్సరం. ఈ మూడు రథాలను ప్రతీ సంవత్సరం నూతనంగా నిర్మిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలు తయారవుతాయి. ప్రతీ రథానికి రెండు వందల ఏభై అంగుళాల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్ళని కట్టి ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఉత్తర ముఖంగా నిలబెడతారు.

                ఆ రథాలకి సమీపంలోనే నిలబడి ఉన్నాడు నారాయణ్. అతనికి కొంచెం దూరంలో ఉన్నారు అతని కొడుకు జగన్నాథ్, కోడలు బృంద, మనవడు నీల్ మాధవ్. నారాయణ్‍కి లక్ష్మి గుర్తు వచ్చింది. క్రిందటేడాది ఈ రోజు ఇద్దరం స్వామిని దర్శించుకున్నాం. ఇప్పుడు నేను ఒంటరిని.నారాయణ్ కళ్ళలో నీళ్ళు నిండాయి. స్వామి సన్నిధిలో ఒంటరినెలా అవుతాను.. ఎప్పటికీ కాను. నా స్వామి అనుక్షణం నాకు తోడుగా నీడగా ఉంటాడు.అత్యంత భక్తిగా స్వామిని తాకి పునీతుడయ్యాడు.

                 ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. జగన్నాథ స్వామిని, బలరామదేవుని, సుభద్రాదేవిని ముగ్గురు మూర్తులను రథారూఢులను చేసారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. రథయాత్రకు అంతా సిద్ధమయ్యింది. అప్పుడు పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకున్నాడు. జగన్నాథునికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేసాడు. ఈ వేడుకను చెరా పహారాఅంటారు. తరవాత స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి, రథం దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసాడు. కస్తూరి కళ్ళాపి చల్లి, హారతిచ్చారు. జగన్నాథ స్వామి జగన్మోహన రూపాన్ని కన్నులారా దర్శించుకుంటూ రథాలను లాగడానికి సంసిద్ధంగా ఉన్నారు వేలమంది భక్తులు. జై జగన్నాథా.. జై జై జగన్నాథా..అని జయ ధ్వానాలు చేస్తూ రథాన్ని నెమ్మదిగా లాగడం ప్రారంభించారు. అసంఖ్యాకమైన భక్త సందోహం మధ్య అంగుళం అంగుళం చొప్పున కదులుతూ బోడోదండ (ప్రధాన ద్వారం) దాటింది.

                దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్త జన సందోహం తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏవైనా అడ్డువచ్చినా రథం వెనకడుగు వెయ్యడం గాని, ఆగడం గాని ఉండదు. అడ్డంకులను తొలగించుకుని ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా దేవి మందిరానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచాదేవి. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. గుండీచా మందిరం జగన్నాథునికి అతిథి గృహం. ఆ అతిథి గృహంలో స్వామి వారం రోజులు అత్యంత వైభోగంగా అతిథి మర్యాదలు అందుకుంటారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఎంతో అందంగా జరిగే ఈ వేడుకను సునావేషఅంటారు. కన్నుల పండుగగా భక్తులు తిలకిస్తారు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో రథయాత్ర పూర్తవుతుంది. రథయాత్ర వల్ల జగన్నాథుడు అంతరాలయంలో లేని పది రోజులు ఆలయం సర్వ శక్తులు సమకూర్చుకుని అత్యంత శక్తివంతంగా సౌభాగ్యవంతంగా రూపొందుతుంది.

                రథ నిర్మాణంలో పాల్గొన్న నారాయణ్ కూడా ప్రతీ సంవత్సరం రథం లాగడంలోనూ పాలుపంచుకుంటాడు. ఈ సంవత్సరం జగన్నాథ్‍కి కూడా ఆ అదృష్టం దక్కింది, క్రితం సంవత్సరం రథయాత్ర సమయానికి రాలేకపోయాడు. భక్తి శ్రద్ధలతో రథం తాడు లాగుతూ తరించసాగాడు అతను కూడా.

                నారాయణ్ అతని భార్య లక్ష్మి జగన్నాథుని నామ స్మరణతోనే తమ రోజు ప్రారంభించేవారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని కొలిచేవారు. వారికి ఒక మగ సంతానం మాత్రం కలిగింది. జగన్నాథ్ అని పేరుపెట్టి ప్రాణప్రదంగా పెంచుకున్నారు. జగన్నాథ్ చదువులో ప్రతిభావంతుడు. ఉన్నత విద్య పూర్తిచేసి భుబనేశ్వర్‍లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగంలో జాయినయ్యాడు. బృందతో అతని వివాహం జరిగింది. కంపెనీలో ప్రమోషన్‍తో పాటూ ఫారిన్ వెళ్ళే అవకాశం వచ్చింది జగన్నాథ్‍కి.

                ’స్వామి సేవలో మాకు ఏ లోటూ ఎప్పుడూ ఉండదు బాబూ.. నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళాలనే నా కోరిక. ఎక్కడ ఉన్నా నీ భవిష్యత్తు బావుండాలని ఆ జగన్నాథుని ప్రార్థిస్తూనే ఉంటాంఅని నారాయణ్ జగన్నాథ్‍ని విదేశాలకి పంపించాడు. జగన్నాథ్, బృంద ఎంత దూరాన ఉన్నా నారాయణ్‍కీ లక్ష్మికీ మానసికంగా దగ్గరగానే ఉండేవారు. వాళ్లు విదేశానికి వెళ్ళిన రెండేళ్ళకి నారాయణ్‍కి ఒక కల వచ్చింది. ఇంటి లోగిలిలో ఒక బంగారపు ఊయల. ఊయలలో నీలి వర్ణంలో ఒక చిన్న బాలుడు. ఊయలకు ఒక పక్కన లక్ష్మి నిలబడి, మరొక పక్కన నారాయణ్ నిలబడి జోలపాటలు పాడుతూ ఊపుతున్నట్లు. కలలో జగన్నాథుని దర్శనం అయిందని చాలా ఆనందపడ్డాడు నారాయణ్.

                అలా కల వచ్చిన కొద్దిరోజులకి బృందకి ప్రసవం అయిందని, మగపిల్లవాడు పుట్టాడని జగన్నాథ్ నారాయణ్‍కి ఫోన్ చేసాడు. అంతా జగన్నాథుని కృపాకటాక్షమేనని అనుకున్నారు నారాయణ్ కుటుంబ సభ్యులు. ఆ పిల్లాడికి నీల్ మాధవ్అని పేరు పెట్టమన్నాడు నారాయణ్.

                రోజులలా గడుస్తూండగా లక్ష్మికి అనారోగ్యం చేసింది. వైద్యం చేయించుకున్నా ఆమె ఆరోగ్యం బాగుపడలేదు. జగన్నాథ్ భార్యాబిడ్డలతో ఇండియా వచ్చాడు. వాళ్ళని చూసి లక్ష్మి మొహం సంతోషంతో కళకళలాడింది. మరి కొద్ది రోజులకే అమె ప్రాణదీపం ఆరిపోయింది. కార్యక్రమాలన్నీ అయ్యాక నాన్నా.. మీరిక్కడ ఒంటరిగా ఉంటే మేమక్కడ సంతోషంగా ఉండలేం. మీరు కూడా మాతోపాటు వచ్చేయండి.అన్నాడు జగన్నాథ్ తండ్రితో.

                ఆరాత్రంతా నారాయణ్ చెవుల్లో జగన్నాథ్ మాటలు పదే పదే వినిపిస్తూనే ఉన్నాయి. ఏటూ పాలుపోలేదు నారాయణ్‍కి. నారాయణ్ పుట్టడం, పెరగడం అన్నీ పూరీలోనే. అతనికి ఊహ తెలిసినప్పటినుండీ జగన్నాథుని దివ్యమంగళస్వరూపం దర్శించుకుంటూనే ఉన్నాడు. లక్ష్మితో వివాహమైనప్పుడు చాలా సంతోషించాడు నారాయణ్. ఎందుకంటే లక్ష్మిది కూడా పూరీయే. అత్తవారిల్లు కూడా పూరీయే అవడంతో ఒక్కరోజు కూడా పూరీ దాటి వెళ్ళకుండా అనుగ్రహించావా స్వామీ!అనుకుని సంబరపడ్డాడు.

                ఇప్పుడు జగన్నాథ్ విదేశం తీసుకెళ్ళిపోతానంటే నారాయణ్ చాలా బెంగ పడిపోయాడు. స్వామి చరణాలకు దూరంగా వెళ్ళి మనలేడు. అలాగని తనిక్కడ ఒంటరిగా ఉంటే అక్కడ కొడుకుకి, కోడలికి మనశ్శాంతి ఉండదని మదనపడసాగాడు. అతని ఆలోచనలు ఎంతకూ తెగడం లేదు. పూరీ దాటి వెళ్ళలేడని మాత్రం అతనికి తెలుసు. మర్నాడు జగన్నాథ్‍తో నాయనా.. నువ్వు మళ్ళీ సారి వచ్చినప్పుడు తప్పకుండా మీతో వస్తాను. ఈ సారికి నేను ఇక్కడ పూరీలో ఉండిపోవాలనుకుంటున్నాను. ఆ జగన్నాథస్వామిని తనివితీరా సేవించుకుంటాను. నా జగన్నాథుని రథయాత్రకి ఈ చేతులతో రథనిర్మాణం చేసుకుంటాను. స్వామిని తాకి తరించి నీ దగ్గరికి బయలుదేరతానుఅన్నాడు.

                జగన్నాథ్ బృంద, నీల్‍మాధవ్‍లతో విదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సరం జగన్నాథ్ ఇండియా వచ్చాడు కుటుంబంతో. జగన్నాథుని రథయాత్ర దర్శించి అది అయ్యాక తండ్రిని కూడా తమతో పాటు తీసుకెళ్ళాలని. తండ్రి ప్రయాణానికి చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ దాదాపుగా అయిపోయాయి. రథయాత్ర అయిన రెండు రోజులకు ప్రయాణం పెట్టుకున్నారు. కొడుకు మనసు కష్టబెట్టడం నారాయణ్‍కి ఏమాత్రం ఇష్టం లేదు, అలా అని పుట్టినప్పటినుండి ఇప్పటివరకు స్వామి సన్నిథిలో జీవితమంతా గడిపి.. ఇప్పుడు స్వామిలో ఐక్యమయ్యే వయసులో పరాయి గడ్డమీద నివసించడం కూడా ఇష్టం లేదు. రెండు రకాల ఆలోచనలకు పొంతన కుదరక ద్వైధీభావంతో మానసికంగా నలిగిపోతున్నాడు నారాయణ్.

                తండ్రి పడుతున్న మానసిక వ్యథ తెలియని జగన్నాథ్, బృందలు సంతోషంగానే ఉన్నారు. నారాయణ్ మనస్పూర్తిగా జగన్నాథుని రథ నిర్మాణంలోను, రథయాత్ర లోను పాల్గొని సంతోషంగా ఉన్నాడని వాళ్ళు భావించారు. తల్లి దూరమయింది, కనీసం తండ్రినయినా కన్నుల ముందు ఉంచుకోవాలనుకున్నాడు జగన్నాథ్. ప్రయాణం ఏర్పాట్లన్నీ చేసుకుని సంసిద్ధంగా ఉన్నారు జగన్నాథ్ దంపతులు. కొంత షాపింగ్ పని మాత్రం ఉంది వాళ్ళకి. పొద్దున్నే బయలుదేరి భువనేశ్వర్ వెళ్ళి కొనుక్కోవలసినవన్నీ కొనుక్కుని వచ్చేయ్యచ్చని అనుకున్నాడు జగన్నాథ్.

                ఆ రోజు ఆషాఢ శుద్ధ దశమి. బహుదాయాత్రప్రారంభమయ్యింది. వారం రోజులపాటు గుండీచా మందిరంలో అతిథి మర్యాదలు అందుకున్న జగన్నాథస్వామి తిరుగుప్రయాణం అయ్యాడు. నారాయణ్ విచలిత మనస్కుడై రథం లాగుతున్నాడు. ఆ రోజు జగన్నాథ్ అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్ బయలుదేరాడు. పూరీనుండి అడుగు బయట పెట్టడం ఇష్టం లేక, ఆ విషయం కొడుక్కి చెప్పలేక లోలోన బాథపడుతున్నాడు. తనని అమితంగా ప్రేమిస్తూ తన బాగోగుల గురించి ఇంతగా తపిస్తున్న కొడుకుకి నీ వెంట రాలేను అని చెప్పలేనుఅనుకున్నాడు. కాని స్వామికి దూరమై బ్రతకలేనని కూడా నారాయణ్‍కి అర్థమైంది. ఆ స్వామి పాదాలచెంతనే తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. పరి పరి విధాల అలోచించాడు నారాయణ్. ఎన్ని ఆలోచనలు చేసినా చివరికి జగన్నాథుని సన్నిధిలో ప్రాణత్యాగమే సరైనదని అనుకున్నాడు. రథచక్రాల కింద పడడానికి మానసికంగా శక్తినంతా కూడగట్టుకున్నాడు.      

                జగన్నాథరథచక్రాల కింద పడితే అవి తన శరీరాన్ని తొక్కుకుంటూ వెళ్తాయి అన్న ఆలోచనకు అతని ఒళ్ళంతా జలదరించింది. బరువుగా ఉండే ఆ చక్రాలకు రహదారికి నడుమ తన శరీరం నలిగి, తన ఎముకులు ఫెటిళ్ళుమని విరిగి అవి తన శరీరంలోని సున్నితమైన గుండె, ఊపిరితిత్తులను చీల్చేస్తుంటే, నోట రక్తం కక్కుతూ తన ప్రాణాలను తను విడిచిపెట్టేస్తాడు అనుకున్నాడు నారాయణ్. కానీ ఆ బాధ కంటే జగన్నాథుడీని, ఈ పూరీని విడీచి ఎక్కడో పరాయిదేశాలకు వెళ్ళి జీవితం కడతేర్చుకోవడం అంతకు మించి బాధాకరంగా ఉంటుందని నిశ్చయించుకున్నాడు నారాయణ్. అతని సంకల్పం మరింత ధృఢంగా మారింది. ఈ క్షణాలు దాటితే తనకు లభించే ఈ సువర్ణావకాశం మళ్ళీ రాదు. తనను ఆపడానికి గాని రక్షించడానికి గాని ఎవరికీ వీలు పడదు.

                ఆఖరుక్షణంలో ఒకసారి కొడుకిని చూడాలనిపించింది నారాయణ్ కి. కానీ ఈ సందర్భంలో అతను లేకపోవడమే మంచిది అనుకున్నాడు. ఎందుకంటే జరగబోయే ఘటన అతను చూసి తట్టుకోలేడు. అయినా తనకు సర్వం జగన్నాథుడే! కొడుకైనా బంధువైనా, స్నేహితుడైనా, యజమానైనా ఆ జగన్నాథుడే అంతా. జయహో జగన్నాథా..! అంటూ ఊపిరిలోకి తన ప్రాణ శక్తిని మొత్తంగా తెచ్చుకుని దిక్కులు పిక్కటిళ్ళేలా అరిచాడు. కళ్ళెత్తి రథంలోని స్వామిని చూడాలని ప్రయత్నించాడు. రథానికి చేరువుగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. కనులు మూసుకున్నాడు. క్షణంలో చిరునవ్వులు రువ్వుతూ స్వామి రూపం సాక్షాత్కరించింది. స్వామీ నువ్వుండగా ఈ శారీరిక బాధలు నన్నేం చేస్తాయి. నా శరీరం చితికిపోయినా నా ఆత్మ నిన్ను చేరుతుందిఅనుకున్నాడు నారాయణ. లాగుతున్న తాడుని వదిలి నింపాదిగా కదులుతూ వస్తున్న రథ చక్రంకి అడ్డంగా వెళ్ళి పడ్డాడు.

                , ఓ అని అరిచారు అక్కడ ఉన్న జనాలు. తాళ్ళను లాగుతున్న భక్తులు తమ కళ్ళ ముందు జరుగుతున్న హఠాత్పరిణామానికి ఒక క్షణం నిర్ఘాంతపోయినా, ఏమీ చేయలేని అశక్తతతో అలాగే ముందుకి అడుగు వేసారు. ఆ రథ చక్రాలు ఆగవు! ఆ ముసలి భక్తుడి పవిత్ర దేహం పరమ పవిత్రమైన రథచక్రాలకు రుధిరాభిషేకం చేయడానికి సిద్ధపడిపోయింది!! మనం నిమిత్తమాత్రులం ఏమీ చేయలేము. నాహం కర్తా హరికర్తాఅనుకున్నారు ఎవరికి వారే!

                అంతలో రెండు చేతులు రథ చక్రం కింద నలిగిపోబోతున్న నారాయణ్ ని బలంగా ఒడిసి పటుకుని కనురెప్పపాటులో నారాయణ్ దేహాన్ని అవతలకి లాగేసాయి. కళ్ళు గట్టిగా మూసుకుని తన శరీరం పైనుంచి వెళ్ళబోతున్న బరువైన రథచక్రాల ఒత్తిడి కోసం వేచి చూస్తున్న నారాయణ్‍కి, హఠాత్తుగా ఏమయిందో అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు!

                 ఎదురుగా తన కొడుకు జగన్నాథ్ తన వైపు ఆదుర్దాగా చూస్తూ కనిపించాడు. చుట్టూ ఉన్న జనాలు నారాయణ్ రక్షింపబడటం చూసి మరింత ఉత్సాహంగా జై జగన్నాథ్.. జయహో జగన్నాథ్..అంటూ జయజయధ్వానాలు చేసారు.

                రెండు నిమిషాలకి తేరుకున్నాడు నారాయణ్. చక్రం కింద పడకుండా తనను ఆపడానికి అక్కడకు తన కొడుకు ఎలా రాగలిగాడు అన్నది అర్థం కాలేదు. ఒక పక్క తను చేయబోయిన పని కొడుక్కి తెలిసిపోయిందని బాధ, మరో పక్క తన ప్రయత్నం విఫలమయిందన్న బాధ అతన్ని మాట్లాడ నివ్వలేదు.

                తండ్రి చెయ్యబోయిన పని చూసి దిగ్బ్రమ చెందాడు జగన్నాథ్. తను రావడం ఒక క్షణం ఆలస్యమైనా ఏమవ్వబోయేదో తలుచుకుంటే అతని గుండె దడదడలాడింది. ఒక్కసారిగా తండ్రిని కౌగిలించుకున్నాడు. ఆశృనయనాలతో ఎందుకు నాన్నా ఇంత పని చెయ్యబోయావు? మేము ఏమవ్వాలనిఅడిగాడు జగన్నాథ్.

                ’నీకు చెప్పాలనుకున్నాను. కాని చెప్పలేకపోయాను. జగన్నాథుని సన్నిథికి దూరంగా నేను రాలేను. రానంటే నువ్వు బాధ పడతావని చెప్పలేకపోయాను.అన్నాడు నారాయణ్ అతి ప్రయత్నం మీద.

                ’నీ మనసులో ఇంత బాథ ఉంటే నాకు చెప్పాలి కదా నాన్నా.. నీ మనసుకి వ్యతిరేకంగా నిన్ను బాధ పెట్టేవిధంగా నేను ఎప్పటికీ చెయ్యలేను. నీకు ఇష్టం లేకుండా ఈ పూరీ నుండి విదేశాలకు నిన్ను తీసుకెళ్ళను. దానికి బదులుగా నేనే ఇక్కడికి వచ్చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ జగన్నాథుని సేవించుకో. కానీ ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయనని నీ మనమడి మీద ప్రమాణం చేసి చెప్పుఅన్నాడు జగన్నాథ్ గద్గదమైన కంఠంతో.

                ’అలాగే నాయనా. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయత్నం చేయను. అయినా నన్ను ఇక్కడే ఉంచి నువ్వు కూడా ఇక్కడకు వచ్చేస్తానంటే నాకు ఇంతకు మించిన ఆనందకర విషయం మరేముంటుంది, చెప్పుఅన్నాడు నారాయణ్ కొడుకు తల నిమురుతూ.

                ’అవును నాన్నా.. నీకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. మేము త్వరలోనే వస్తాము. నేను భువనేశ్వర్‍లో ఉద్యోగం చేసుకుంటాను. నువ్వు జగన్నాథస్వామిని సేవించుకో.. మేము నిన్ను సేవించుకుంటాము.అన్నాడు జగన్నాథ్ తండ్రితో.

                అప్పుడు తన సందేహం బయటపెట్టాడు నారాయణ్. అది సరే గానీ నువ్వు భువనేశ్వర్ బయలుదేరి వెళ్ళావు కదా.. మళ్ళీ వెనక్కి నా దగ్గరికి ఎలా వచ్చావు, అది కూడా నేను రథ చక్రం కింద పడాలి అనుకుంటున్నప్పుడు నన్ను కాపాడావు..అన్నాడు ఆశ్చర్యంగా.

                ’నేను దారిలో ఉండగా ఒక వ్యక్తి నేను ప్రయాణిస్తున్న కారు ఆపాడు. లిఫ్ట్ అడుగుతున్నాడేమో అనుకుని కారు ఆపాను. అతని పేరు పురుషోత్తం అని చెప్పాడు. మీ నాన్న అక్కడ కష్టంలో ఉన్నాడు. వెంటనే వెళ్ళు. మీ నాన్నని కాపాడుకోఅన్నాడు. వెనక్కి వెళ్ళమని అతను చెప్పడం వల్ల నేను వెంటనే వెనక్కి వచ్చేసానుఅన్నాడు జగన్నాథ్.

                చాలా ఆశ్చర్యపోయాడు నారాయణ్. నేను కష్టంలో ఉన్నానని అక్కడ ఉన్న ఎవరో వ్యక్తికి ఎలా తెలిసింది? స్వామి సన్నిథిలో ఆత్మార్పణం చేసుకుని స్వామిలో లీనమైపోవాలన్నది నా మనసులో కలిగిన ఆలోచనఅన్నాడు నారాయణ్.

                ’నిజమే నాన్నా.. అతనికి ఇక్కడి విషయం ఎలా తెలుస్తుంది, అది కూడా నువ్వు మనసులో అనుకున్న విషయం. నువ్వు కష్టంలో ఉన్నావనే మాట విన్నాక నాకు ఇంక వేరే ఆలోచన రాలేదు. వెనక్కి వచ్చేసి నిన్ను దక్కించుకోవాలనే తొందరలో నేను ఆ విషయం ఆలోచించలేదు.అన్నాడు జగన్నాథ్.

                ’ఇప్పుడర్థమైందా నాయనా.. అది జగన్నాథుని లీల. నన్ను ఆయన సేవలో ఇంకా తరించమని నాకు జీవితం ప్రసాదించారు. జయహో జగన్నాథా..అన్నాడు నారాయణ్ భక్తితో జగన్నాథ స్వామికి చేతులు జోడిస్తూ. జగన్నాథ్ కూడా జయహో జగన్నాథా..!అంటూ భక్తిపూర్వకంగా స్వామికి నమస్కరించాడు.