ఐ పిటీ యూ

ఐ పిటీ యూ

 

ఐ పిటీ యూ

 “ఐ పిటీ యూ...” ప్రతిధ్వనిస్తున్నట్టు పదే పదే ఆ మాటే గుర్తొస్తుంటే మయూరి మనసు మరింత వికలమైంది. వేరే ఎవరైనా ఆ మాట అని ఉంటే అంతగా బాధ పడి ఉండేది కాదేమో. కానీ శశిరేఖ నోటినుంచి ఆ మాట వచ్చేసరికి తట్టుకోలేకపోయింది.

 

అనుకోనిది జరిగి ఆశాభంగం ఎదురైనప్పుడు ఓదార్పు మాటలు ఎదురవడం అనేది సర్వసాధారణమే అయినా ఎందుకో శశిరేఖనుంచి ఆ మాటలు మయూరి జీర్ణించుకోలేక పోయింది. కారణం ఒకటే. శశిరేఖ ఆమెకి సమ ఉజ్జీ కావడమే. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ రోజు సాయంత్రమే ఊటీలోని టైగర్ హిల్ రిసార్ట్స్‍లో ఓ ఖరీదైన హోటల్లో పక్కపక్క హనీమూన్ సూట్లలో తాము మొదటి రాత్రి  పులకరింతల మధ్య యవ్వన సంరంభాల్లో మునిగి తేలవలసిన వాళ్ళు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు ఒక్క హనీమూన్ సూటే రిజర్వ్ అయిందా హోటల్లో. రెండోది రిజర్వ్‍ అయినా తర్వాత కాన్సిల్ చేయబడింది.

 

మళ్ళీ ఫోన్ మోగింది. చూస్తే శశిరేఖనుంచే. నిరాసక్తంగా అందుకుంది. మయూరీ. ఇక్కడ ఈ కొండల మధ్య పచ్చిక బయళ్ళతో కూడిన ఈ హోటల్ ఎంత బాగుందో తెలుసా? హానీమూన్ సూట్‍లో సదుపాయాలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. వారం రోజుల పాటూ ఇక్కడే పగలూ, రాత్రీ తేడా లేకుండా నిఖిల్, నేనూ ఓహ్. తలుచుకుంటుంటేనే గొప్ప థ్రిల్‍గా ఉంది. నువ్వూ, హరగోపాల్ కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అని మేమిద్దరం ఇప్పటికి నలభయ్ సార్లయినా …”

 

ష్ప్లీజ్.. నాతో కలిపి వాడి పేరును ఉచ్చరించవద్దు. ఇప్పుడు నేను వేరొక వ్యక్తికి భార్యనని గుర్తుంచుకోఅన్నది మయూరి.

 

ఆ పల్లెటూరి గబ్బిలాయితో పెళ్ళి కూడా ఒక పెళ్ళేనా? నీకు కూడా ఈ రోజే శోభనం కదా? జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే శోభనపు రాత్రిని నువ్వా  పల్లెటూళ్ళో, ఆ పాత ఇంట్లో అతి సాధారణంగా జరుపుకోవల్సి వస్తున్నందుకు చాలా అప్‍సెట్‍ అయ్యాము. నువ్వు చాలా మిస్సయి పోయావు మయూరి. బేడ్ లక్. ఐ పిటీ యూఅన్నది శశిరేఖ మళ్ళీ.

 

మిస్సవడం కాదు. అసలు తన జీవితమే సర్వనాశనమై పోయింది. కోట్లలో వ్యాపారం చేసే తండ్రి బిజినెస్ ఉన్నట్టుంది తల్లకిందులయ్యింది. అది తెలిసిన మరుక్షణమే ఏదో వంక పెట్టి నిశ్చితార్ధం అయిపోయిన పెళ్ళినే కేన్సిల్ చేసారు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు. ఊహించని దెబ్బ ఇది. అందుకే గతంలో తనని ప్రేమించానని చెప్పిన వెంకటాద్రితోనే అదే ముహూర్తానికి పెళ్ళి జరిపించారు. పరిస్థితులతో రాజీ పడాల్సి వస్తే పడాల్సిందే. మరో మార్గమేముంది?

 

వెంకటాద్రికి తన అంతస్తు తెలీనప్పుడు తనని ప్రేమించాడు. సహజంగానే తనకి అతని ప్రేమ ఆనలేదు. తన అంతస్తేమిటో తెలియగానే అతనే మర్యాదగా పక్కకి తప్పుకున్నాడు. అతను పల్లెటూరి గబ్బిలాయే కావచ్చు. నెలజీతం మీద బ్రతుకుతూ అరకొర జీవితాన్ని గడిపే మధ్యతరగతి వాడే కావచ్చు. కానీ తన తలరాత బాగోక అతన్ని చేసుకోవలసి వచ్చినప్పుడు అతని గురించి చులకనగా మాట్లాడడం ఎంతవరకూ న్యాయం? అందుకే శశిరేఖ మాటలకి మయూరి మనసు చివుక్కుమంది.

 

పోన్లే శశీ. ఎవరి అదృష్టం వారిది. నువ్వయినా నీ ఫస్ట్ నైట్‍ని, అందులోని ధ్రిల్‍నీ ఎంజాయ్ చెయ్యి. నా సంగతి మరిచిపోఅన్నది మయూరి. ఇంకోసారి ఐ పిటీ యూఅనే మాట వాడొద్దని ఇండైరెక్ట్‍గా చెపుతూ. .

 

ఒకసారి చుట్టూ పరికించి చూసింది. రెండు బెడ్‍రూమ్‍లు గల చిన్న ఇల్లది. ఇరుకే కానీ సరిపెట్టుకోక తప్పదు. అదికాదు ఆమె ఆలోచిస్తున్నది. సాయంత్రం శోభనం అని తెలుసు. కానీ ఆ ఏర్పట్లేవీ జరుగుతున్న జాడే లేదు. ఒక గదిలో డబుల్ కాట్ మంచం ఉంది. బహుశా ఆ గదిలోకి తననీ, వెంకటాద్రినీ బలవంతంగా తోసి ఇదే శోభనం గది, ఇవేళే మీ మొదటిరాత్రి అని చెపుతారేమో.

 

ఉదయం శశిరేఖ ఫోన్లో తనని ఊరిస్తూ చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. రాజుల కోటని తలపించేలాంటి పెద్ద హోటల్, ఆధునికమైన అన్ని సదుపాయాలతో ఏ.సి. సూట్, కిటికీలోంచి చూస్తే కనిపించే పచ్చని లాన్లు, వాటికవతల మహోన్నతంగా కనిపించే కొండలు, లోయలు, ప్రకృతి దృశ్యాలు, అడుగడుగునా పరిచర్యలకు సిద్ధంగా ఉండే సేవకులు, అందమైన పెయింటింగ్స్‍తో, ఖరీదైన ఏంటిక్ విగ్రహాలతో నీట్‍గా అలంకరించబడిన విశాలమైన బెడ్‍రూమ్, ఆహ్లాదం గొలిపే అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్స్‍, వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో అలంకరించబడిన హంసతూలికా తల్పంలాంటి బెడ్‍లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్విమ్మింగ్ పూల్, కేండిల్ లైట్ డిన్నర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ …!

 

దీర్ఘంగా నిట్టూర్చింది మయూరి. అవన్నీ లేవు సరే. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్ళి కొడుకేడి? కొత్తగా పెళ్ళయిన భార్యని వదిలి ఎక్కడికి పోయినట్టు? రాత్రినుంచీ కనిపించడం లేదు. అతని తల్లినడిగితే తనకీ తెలియదన్నది. కొంచెం కూడా టేస్ట్ లేని వాడిలా ఉన్నాడే? అనుకుంది. ఒకవేళ మొదట్లో తిరస్కరించి పరిస్థితి తారుమారు అయ్యాకా అతనితో పెళ్ళికి అంగీకరించినందుకు తన మీద కక్ష తీర్చుకోవడం లేదు కదా? ఏమో, అయినా అయ్యుండొచ్చు. ఫస్ట్ నైటే కాదు, వైవాహిక జీవితం మొత్తం అట్టర్ ఫ్లాప్ లాగుందిఅనుకుంది మనసులో.

 

నిఖిల్ నా కొంగు పట్టుకుని అసలు ఒక్క క్షణమైనా వదిలేట్టు కనిపించడంలేదనుకో. ఒకటే అల్లరి పనులు, చిలిపి మాటలు, స్వీట్ నథింగ్స్ వాటిల్లో కొన్ని ఎప్పటికీ ఎవరితోనూ చెప్పలేము తెలుసా?’ అంటూ చెప్పిన శశిరేఖ మాటలు గుర్తొచ్చాయి. 

 

డైమండ్ రింగ్ ప్రెజంట్ చేసాడు నా హస్బండ్. ఎంత బాగుందో తెలుసా?’ అని అడిగింది శశిరేఖ. నిజానికి ఆమె అడుగుదామని అనుకున్న ప్రశ్న అది కాదేమో. నా మొగుడు నాకు డైమండ్ రింగ్ ఇచ్చాడు. మరి నీ మొగుడు నీకేమిచ్చాడు?’ అని డైరెక్ట్‍గా అడగలేక అలా అడిగి ఉంటుంది.

 

ఐ పిటీ యూమళ్ళీ అదే మాట గుర్తొచ్చి ఆమె మనసు వ్యాకులతకి గురయింది. దుఃఖం కమ్ముకొచ్చేసింది. జరిగింది తలుచుకుంటుంటే ఇప్పటికీ నమ్మశక్యం కానట్టుగా అనిపిస్తోంది. పదిహేను రోజుల వ్యవధిలో పరిస్థితి ఎంతగా మారిపోయింది? నగరంలోకెల్లా పేరుమోసిన బిజినెస్ మేగ్నెట్ కొడుకు హరగోపాల్‍తో తనకి వివాహం నిశ్చయం అయ్యింది.  హరగోపాల్, నిఖిల్ ఇద్దరూ కవల పిల్లలు. ఒకేసారి ఇద్దరికీ పెళ్ళి చేసే ఉద్దేశ్యంతో నిఖిల్‍కి కూడా సంబంధాలు చూసారు. శశిరేఖతో అతనికి నిశ్చయం అయ్యింది. ఇద్దరికీ ఒకేరోజున నిశ్చితార్ధం జరిగింది. పెళ్ళి కొడుకుల తండ్రి అభ్యర్ధన మేరకు నిశ్చితార్ధం వాళ్ళింట్లోనే జరిగింది. అప్పుడే మొదటిసారి చూడ్డం శశిరేఖని.

 

ఏయ్.. ఇది చాలా పాత మోడల్.. మీ డాడీ స్టేటస్సేమిటి? ఇంకా నువ్విది వాడ్డమేమిటి?” అంటూ మయూరి మెడలో ఉన్న నక్లెస్‍ని పరిశీలనగా చూస్తూ అపహాస్యం చేసిందా రోజు.

 

ఇది పాత మోడలే. కానీ చిన్నతనంలో మా నానమ్మ నాకు ఎంతో ప్రేమతో ఇచ్చిన నక్లెస్ ఇది. ఇది ధరించడం నాకు సెంటిమెంట్. ఇది ధరించాకే నాకు అనారోగ్యం కుదుటపడిందట. ఇది వేసుకున్నాకే నాకు స్టడీస్‍లో ఫస్ట్ రేంకులు వచ్చాయట. అన్నీ కలిసి రావడం, అవరోధాలన్నీ తొలగిపోవడం లాంటివి జరిగాయట. అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కొత్త ఫేషన్లొచ్చినా దీన్ని మాత్రం నేను విడిచి పెట్టేది లేనుఅన్నది స్థిరంగా.

 

మరి హరగోపాల్ విడిచి పెట్టమంటే?”

 

హరగోపాల్‍నే విడిచి పెట్టేస్తానుఅన్నది జోక్‍ వేస్తున్నట్టు నవ్వుతూ. శశిరేఖ కూడా కిసుక్కున నవ్విందా జోక్‍కి.

 

విచిత్రమేమిటంటే ఆనాటి జోక్ ఈనాడు నిజమై కూర్చుంది ! అదికూడా చాలా గమ్మత్తుగా నానమ్మ ఇచ్చిన నక్లెస్‍ పోయిన తర్వాతే జరిగింది. నిశ్చితార్ధం అయిపోయాకా తల్లిదండ్రులతో కలిసి ట్రైన్‍లో తిరుగు ప్రయాణమయ్యింది. నిడదవోలు స్టేషన్‍ దాటగానే ముఖం కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. మెళ్ళో నక్లెస్ ముందుకు పడుతూ అడ్డం వస్తోందని తీసి చేతికి చుట్టుకుంది. తర్వాత తన సీట్‍లోకి వెళ్ళి కూర్చుంది. దాదాపు పావుగంట తర్వాత తల్లి గమనించి నక్లెస్ ఏదని అడిగే వరకూ ఆ సంగతే గుర్తు లేదామెకి. చేతివంక చూసుకుని కెవ్వున అరిచింది. అంటేనానమ్మ ఇచ్చిన నక్లెస్ వాష్ బేసిన్‍లోంచి రైలు పట్టాలమీద పడిపోయిందన్న మాట.

 

అంతే! అక్కడినుంచీ తన జాతకం మొత్తం మారిపోయింది. ఇంటికి చేరిన నాలుగో రోజే తండ్రి బిజినెస్‍ కోర్ట్‍ లిటిగేషన్‍లో ఇరుక్కున్న వార్త తెలిసింది. అవతల పార్టీ సాక్ష్య్ం బలంగా ఉండడంతో తండ్రి డీలా పడిపోయాడు. ఈ సంగతి ఎలా తెలిసిందో హరగోపాల్ తల్లిదండ్రులకి తెలిసింది. నక్షత్రమో, పాదమో కలవలేదని వంక పెట్టి పెళ్ళి కేన్సిల్అనేసారు. గుండె జబ్బుతో ఉన్న నానమ్మకి ఈ విషయం తెలియ కూడదు. అంటే అదే ముహూర్తానికి తన పెళ్ళి కూడా జరగాలి. ఆ విధంగా వెంకటాద్రితో తన పెళ్ళి అనుకోకుండా నిశ్చయమైంది.

 

ఏ సదుపాయాలు లేని పల్లెటూళ్ళో చడీ చప్పుడు లేని పెళ్ళి. ఏ అందచందాలు లేకుండా సాధారణమైన ఇంట్లో శోభనం. కోర్ట్‍ లో కేసు ఉందని రాలేకపోయిన తండ్రి. ఈ పల్లెటూళ్ళో ఉండడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఎవరికి వాళ్ళు చల్లగా జారుకున్న బంధువులు. రాత్రికి శోభనం పెట్టుకుని ఏమైపోయాడో తెలియని పెళ్ళికొడుకు. ఓహ్ఎంత గొప్ప సన్నివేశం? ఏ ఆడపిల్లకయినా ఇలాంటి చేదు అనుభవం ఎదురై ఉంటుందా?

 

ఐ పిటీ యూ!అవును. శశిరేఖ ఆ మాట అనడంలో ఆశ్చర్యమేముంది? కాకపోతే తాను కోల్పోయిన స్థానంలో ఉన్న తన సాటి వ్యక్తి నుంచి ఆ మాట రావడమే నరకప్రాయంగా ఉంది.

 

సాయంత్రం అత్తగారు ఇచ్చిన టీ తాగి ప్లాస్టిక్ కుర్చీలో నిరాసక్తంగా కూర్చుని ఉంది మయూరి. తల్లి వచ్చి ఎదురుగా కూర్చుంది. అలా ఉన్నావేమే? ఉత్సాహం తెచ్చుకో. మన బతుకు ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏం చేస్తాం? దేవుడు మన నుదుటన ఇలా రాసి పెట్టాడుఅంటూ ఓదార్చబోయింది.

 

అదేం లేదు మమ్మీ. నేను బాగానే ఉన్నాను. ఒక విధంగా మనకి మంచే జరిగిందని నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? డాడీ బిజినెస్ తారుమారవడం పెళ్ళికి ముందే జరిగింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళి అయ్యాకా జరిగుంటే ఎంత అనర్ధం జరిగేది? వాళ్ళు నన్నెంత హీనంగా చూసేవాళ్ళు? నరకం కన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేదేమో. దానికన్నా ఇదే వంద రెట్లు నయం కదా?”

 

అవునమ్మా. అదీ నిజమేఅన్నదామె తల్లి. కూతురా మాట సిన్సియర్‍గానే అన్నట్టు అనిపించిందామెకి. కేవలం తనని ఓదార్చడానికే అన్నట్టుగా ధ్వనించలేదు.

 

బయటేదో అలికిడయితే ఇద్దరూ అటు తిరిగి చూసారు. వెంకటాద్రి వచ్చినట్టున్నాడు. సరాసరి మయూరి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. మయూరి తల్లి లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఖాళీ చేసిన కుర్చీలో వెంకటాద్రి కూర్చున్నాడు. మయూరి అతని వైపు చూసి చిన్నగా వచ్చీ రాని నవ్వు నవ్వింది.

 

పైకి నవ్వుతున్నావు కానీ నా మీద నీకు పీకల దాకా కోపం ఉండి ఉంటుందని తెలుసుఅన్నాడు నవ్వుతూనే.

 

ఛ ఛ అలాంటిదేం లేదుఅన్నది మొహమాటంగా.

 

పెళ్ళయి రెండు రోజులు కాలేదు. నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన నా మీద నీకు కోపం లేదంటే ఎలా నమ్మమంటావు?” అని అడిగాడు.

 

కోపమేం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవచ్చా?” అని అడిగింది.

 

మనిషి పుట్టిన దగ్గరనుంచీ చివరి వరకూ నమ్మకంఅనే భావాన్ని ఆసరా చేసుకునే బ్రతుకుతాడు. ఆ నమ్మకమే పోతే బ్రతుకు దుర్భరమైపోతుంది. అలాంటి ఒక నమ్మకాన్ని తిరిగి తీసుకు వద్దామని వెళ్ళాను. నా ప్రయత్నం వ్యర్ధమవుతుందేమోనన్న భయం చాలా సేపు వెంటాడింది. కానీ అదృష్టం బాగుండి చివరికి ఫలించిందిఅన్నాడు.

 

మయూరికి అతను చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అర్ధం కాలేదు. ఆ భావం ఆమె ముఖంలోనే తెలిసిపోతోంది.

 

అతను చిన్నగా నవ్వి చెప్పాడు నువ్వు ఎంతో వైభవంగా ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగావు. నువ్వు అనుభవించిన సుఖాల్లో పదో  వంతయినా నేను సమకూర్చలేనని నాకు తెలుసు. అందుకే నీకు బాగా ఇష్టమైన, పోగొట్టుకున్న ఒక నమ్మకాన్ని తిరిగి తీసుకు వచ్చానుఅంటూ ఆమె ట్రైన్‍లో పోగొట్టుకున్న నెక్లెస్‍ని జేబులోంచి తీసి ఆమె కళ్ళముందు కనబడేలా పట్టుకున్నాడు.

 

దాన్ని చూడగానే మయూరి ముఖం వెలిగిపోయింది. ఆనందంతో కనుబొమలు ఎగరేసి చూసింది. ఆయ్అది నాదేఎక్కడ దొరికింది?” అని ఆడిగింది.

 

నువ్వు పోగొట్టుకున్న చోటేఅన్నాడు.

 

నిజమా? నేనెక్కడ పోగొట్టుకున్నానో నాకే తెలీదు…” మీకెలా తెలుసన్న భావం పలికేలా అర్ధోక్తిలో ఆగిపోయింది.

 

నీ మాటలని బట్టి తెలుసుకోగలిగాను. నిడదవోలు దాటిన తర్వాత మొహం కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళావు. దాదాపు పావుగంట తర్వాత నక్లెస్ పోయినట్టు గ్రహించావు. నువ్వు ప్రయాణించిన ట్రైన్ గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అంటే నిడదవోలు నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్లు లోపే నీ నక్లెస్ పడిపోయి ఉండాలి. ఎవరి కంటా పడకుండా ఉంటే అది ట్రాక్ మీదే ఉండి ఉంటుందన్న నమ్మకంతో బయల్దేరాను. నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో నాకే తెలీదు కాబట్టి ఎవరికీ చెప్పకుండానే వెళ్ళాను. అర్ధరాత్రి నుంచి ట్రాక్ వెంబడే టార్చ్ లైట్‍తో అంగుళం అంగుళం వెతుకుతూ వెళితే దాదాపు ఏడెనిమిది గంటల తర్వాత దొరికింది. నీకు ఎంతో ఇష్టమైనది, సెంటిమెంట్ అన్నావు కాబట్టి దానికోసం ఎంతయినా కష్టపడొచ్చనిపించింది. అదే చేసానుఅంటూ నక్లెస్‍ని ఆమె చేతికి అందించాడు.

 

మయూరి విస్మయంగా చూసిందతని వైపు. రాత్రినుంచీ పెళ్ళికొడుకు కనబడకపోతే బాధ్యతారాహిత్యంతో ఆవారాలా తిరుగుతున్నాడని అనుకుంది. తనకు నచ్చినది అన్న ఒకేఒక్క కారణం చేత అతనా అర్ధరాత్రి, ఒంటరిగా, కారు చీకటిలో, రైలు పట్టాల మీద, పదిహేను కిలోమీటర్లు అంగుళం అంగుళం గాలిస్తూచలిగాలిని లెక్క చేయకుండా, కుట్టే పురుగులని ఖాతరు చేయకుండా, పాములుంటాయేమోనని భయపడకుండా

 

డబ్బు పారేస్తే దొరికే డైమండ్ రింగ్ కన్నా ఇది ఎన్ని వేల రెట్లు విలువైనది?

 

క్షణంలోనే విస్మయం ప్రేమగా మారింది. మరుక్షణమే ప్రేమ ఆరాధనగా మారింది. నానమ్మ ఇచ్చిన గిఫ్ట్, ఇక దొరకదనుకున్న నక్లెస్ మళ్ళీ దొరికిందన్న ఆనందం వల్ల ఆమెలో గూడు కట్టుకున్న నిరాసక్తత అంతా చెల్లాచెదురయిపోయింది. భర్తకి తన పట్ల ఉన్న కన్‍సర్న్‍ కి కదిలిపోయింది.

 

మయూరి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. ఆమెకి తెలీకుండానే అమాంతం వెళ్ళి అతన్ని వాటేసుకోబోయింది. అతను చప్పున పక్కకి తప్పుకుని ఆ.. ఆ..  ఆగాగు. అసలే పల్లెటూరి బైతుని. అందులోనూ రాత్రంతా రైలు పట్టాల మీద తిరిగి, ఉదయాన్నే రైల్లో ప్రయాణం చేసి వచ్చిన వాణ్ణి. మన మొదటి సమాగమం ఇంత పేలవంగా ఉండడం నాకిష్టం లేదుఅయినా మరికొన్ని గంటల్లోనే కదా మనం ఒకటి కాబోయేది?” అంటూ కన్ను కొట్టాడు అంత తొందరెందుకన్న భావాన్ని ప్రకటిస్తూ. మయూరి సిగ్గుగా నవ్వింది. అతను స్నానాలగదికి వెళ్ళిపోయాడు నలుగు పెట్టుకుని తలంటు పోసుకోడానికి.

 

మయూరి ఉత్సాహంగా లేచి తిరగ సాగింది. ఏ ఆర్భాటాలు లేకుండానే తన శోభనం అతి సాధారణంగా జరగబోతోందన్న వెలితి ఇప్పుడామె మనసులో లేదు. శోభనం అతి సాధారణమైన ఇరుకు గదిలో జరగబోతోందన్న చింతకూడా చిత్రంగా మాయమైపోయింది. శోభనానికి కావలసినవి ఆర్భాటాలు కావు, మానసిక సంసిద్ధత అన్న సంగతి ఆమెకి అర్ధమైంది. ప్రేమ ఉండాలే కానీ ఎడారిలో కూడా శృంగారం వెల్లి విరుస్తుందన్న సత్యాన్ని క్రమంగా ఆమె మనసు అర్ధం చేసుకోసాగింది.

 

* * *

 

చీకటి పడింది. ఆ చీకటిని చెల్లాచెదురు చేస్తూ ఆకాశంలో చందమామ పండు వెన్నెలలు విరజిమ్ముతోంది. తెల్లని చీరలో మయూరి ముత్యంలా మెరిసిపోతోంది. మరికొన్ని క్షణాల్లో రతికేళికి సిద్ధంగా ఉన్న ఆమె సోయగం రతీదేవిని కూడా అబ్బురపరచేలా ఉంది. ధవళ వస్త్రాలతో, నిండైన విగ్రహంతో ఠీవిగా నడచి వచ్చిన వెంకటాద్రిని చూసి నవమన్మధుణ్ణి చూసినట్టుగా సిగ్గుపడింది.

 

రెడీగా ఉన్నావా?’ అన్నట్టు కన్ను గీటాడు మయూరి వైపు చూస్తూ. అప్రయత్నంగా ఆమె ముఖాన్ని అరచేతుల్లో దాచేసుకుంది.

 

ఎవరో లోపలికి వచ్చి చెప్పారు. బయట కారు రెడీగా ఉందని. వెంకటాద్రి చేయి ముందుకు చాపి రాఅన్నట్టు సైగ చేసాడు. మయూరి అయోమయంగా చూసింది. కారు రావడమేమిటో భర్త ఎక్కడికి రమ్మని అడుగుతున్నాడో అర్ధం చేసుకోలేక పోయింది. మంత్ర ముగ్ధలా చేయి అందించి లేచి బొమ్మలా నడిచింది.

 

పూలతో అలంకరించబడిన కారు, బహుశా అద్దెకు తెచ్చినది అయి ఉండొచ్చు, ఎక్కగానే రాజహంసలా ముందుకు కదిలింది. వెనుకే మరో కారు బయల్దేరింది. పక్కా పల్లెటూరు. దగ్గరలో స్టార్ హోటళ్ళు కాదుకదా, సాదాసీదా హోటళ్ళు కూడా లేవు. మరి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు వీళ్ళంతా? శోభనం ఎక్కడ జరగబోతోంది? అంతా సస్పెన్స్ గా ఉంది మయూరికి.

 

కార్లు దాదాపు ఇరవై నిముషాలు ప్రయాణం చేసిన తర్వాత ఒక పురాతన దేవాలయం ముందు ఆగాయి. శోభనం ముందు దైవ దర్శనం వీళ్ళ ఆచారం కాబోలు అనుకుంది మనసులో. పూజారికి ముందే చెప్పి ఉంచారేమో రాగానే అభిషేకం చేయడం మొదలు పెట్టాడు. పూజ పూర్తి అయ్యాకా కార్లు తిరిగి ప్రయాణమయ్యాయి. అయితే అవి ఇంటికి చేరకుండా దారిలో ఉన్న ఓ రేవు ఒడ్డుకు చేరి ఆగాయి. కృష్ణా నదినుంచి చీలిన ఒక పాయ తాలూకు రేవు అది.  రేవుకు అవతలివైపు రెండుకొండలు దగ్గర దగ్గరగా అమర్చినట్టున్నాయి. వెన్నెల్లో ఆ కొండల మధ్య నీళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉందా దృశ్యం.

 

మయూరి అలా మైమరచి చూస్తుండగానే ఎక్కడినుంచి వచ్చిందో కానీ నీళ్ళ మధ్య రాజహంసలా తేలుతూ వచ్చి ఆగిందో పడవ. పడవ మీద చిన్న గుడారం లాంటిది ఉంది. లోపలనుంచి చిన్న చిన్న విద్యుద్దీపాల కాంతి బయటికి కనిపిస్తోంది. గుడారం బయట పూల మాలలతోనూ, గుచ్చాలతోనూ ఎంతో అందంగా అలంకరించబడి చూడ ముచ్చటగా ఉంది. దాన్ని చూడగానే మయూరి మనసు ఆనందంతో కేరింతలు కొట్టింది. రాత్రికి శోభనం అన్న సంగతి కూడా మరిచిపోయి దాని మీద ఎక్కి కాసేపు తిరిగితే ఎంత బాగుంటుందిఅని ఆలోచించింది. అయితే అడగడానికి మొహమాటం అడ్డం వచ్చింది.

 

కారు దిగి అందరితో పాటు రేవు ఒడ్డుకి నడిచింది. వెంకటాద్రి పడవ మీదకి ఎక్కి మయూరి కూడా ఎక్కడానికి వీలుగా చేయి అందించాడు. ఆమె కళ్ళు దివిటీల్లా వెలిగాయి. సంతోషంగా ఎక్కింది. బంధువులందరూ కూడా ఎక్కుతారేమో అని చూసింది. కానీ వాళ్ళు ఎక్కలేదు. చేతులూపుతూ విష్ యూ ఎ రొమాంటిక్‍ ఫస్ట్ నైట్అని కొందరూ, “బాగా ఎంజాయ్ చేయండి పొద్దున్న వరకూఅని మరి కొందరూ విష్ చేసి కార్లు ఎక్కి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

 

మయూరి ప్రశ్నార్ధకంగా చూసింది వెంకటాద్రి వైపు.

 

అతను చిన్నగా మందహాసం చేసి పడవకి తెడ్లు వేయసాగాడు. చెక్కబల్ల మీద ఆమె కూర్చుంది. పడవ సాఫీగా ముందుకు సాగిపోతోంది. కాస్సేపటికి ఎటు చూసినా నీళ్ళు, కొండలు తప్ప మరేవీ కనిపించని ప్రాంతానికి చేరుకున్నారు.

 

మావాళ్ళు మీ తాహతుకు తగ్గట్టు పెద్దపెద్ద స్టార్ హోటళ్ళలోనో, గార్డెన్స్‍లోనో శోభనం ఏర్పాట్లు చేయలేరు మయూరి. అందుకే నేనే ఆలోచించి ఉన్నంతలో నీకు సంతోషం కలిగించడం కోసం ఈ చిన్న ఏర్పాటు చేసాను. ఈ నదీ పాయలో, ఈ కొండల మధ్య, ఆకాశం, నీళ్ళు తప్ప మరేవీ కనిపించని ఈ ఏకాంత ప్రదేశంలో చల్లని వెన్నెలలు వెదజల్లే ఆ చందమామ సాక్షిగా మన ఈ ఫస్ట్ నైట్ కలకాలం గుర్తుండి పోవాలని ఇలా ప్లాన్ చేసాను. నీకు నచ్చుతుందనే అనుకుంటానుఅన్నాడు వెంకటాద్రి తెడ్లు వేస్తూనే.

 

మయూరి మనసు పురివిప్పిన నెమలి అయ్యింది. లోలోపలే ఆనంద తాండవం చేసింది. వినూత్నమైన ఈ ఏర్పాటు ఎంతో థ్రిల్లింగ్‍గా అనిపించిందామెకు. మొదటిరాత్రి మధురానుభూతి ఇంతకన్నా గొప్పగా మరెక్కడా ఉండదేమో. కేవలం తన సంతోషమే పరమావధిగా అతను ఆలోచించే విధానం ఆమెకెంతో సంతృప్తినిస్తోంది.

 

వెంకటాద్రీఐ లవ్ యూ…” అనేసింది అప్రయత్నంగా.

 

అతను చిరుమందహాసం చేసి తెడ్లు వేయడం ఆపి లేచి నెమ్మదిగా ఆమె దగ్గరకు చేరుకున్నాడు. చేతులు సాచి రమ్మన్నట్టు సైగ చేసాడు. ఆమె రానంటూ తల అడ్డంగా ఊపింది సిగ్గుపడుతూ. అతనే ముందుకు జరిగి రెండు అరచేతులతో ఆమె చెంపల్ని అంది పుచ్చుకుని పెదాలమీద గాఢ చుంబనం చేసి కౌగిట్లో హత్తుకున్నాడు.  నరాల్లో విద్యుత్తు ప్రవహించినట్టు ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమన్నదామెకు. మైమరపించే పరిసరాల మధ్య ప్రియసమాగమం ఇంత మధురంగా ఉంటుందని ఆమె ఊహించలేదు.

 

తమకంతో అతను ఆమె వొళ్ళంతా తడిమేస్తోంటే ఆమెలో కోరిక రెక్కలు విప్పుకోసాగింది. బయటనుంచి చల్లని వెన్నెల, లోపలినుంచి వేడెక్కించే విరహాగ్ని వెరసి మోహావేశపు ఉత్తుంగ తరంగం ఎగసి ఎగసి పడుతోంది. మనసులు మమేకం అయితే తనువుల స్పర్శ అద్భుతంగా ఉంటుందని ఇద్దరికీ అనుభవ పూర్వకంగా అర్ధమైంది.

 

లోపల మెత్తటి పరుపుంది, బయట అందమైన ప్రకృతి ఉంది. ఏది కావాలిఅని అడిగాడు.

 

అతని ప్రశ్నలోని చిలిపితనానికి సిగ్గులమొగ్గ అయింది. ఎటూ తేల్చుకోలేక చివరికి మీ ఇష్టంఅని మాత్రం అనగలిగింది.

 

అలాగైతే మనమూ ప్రకృతిలో కలిసిపోదాంఅంటూ ఆతను ఆమెను వివస్త్రను చేసేసి తానూ వస్త్ర సన్యాసం చేసాడు. గాఢ పరిష్వంగంలో ఆమెను బంధించి ఉక్కిరిబిక్కిరి చేసాడు. ఎవరిదేదో తెలియనంతగా ఇద్దరి శరీరాలు పెనవేసుకు పోయాయి. ఒకరిని గెలవాలని మరొకరు చేసే ఆ యుద్ధం హోరాహోరీగా సాగింది. కాస్సేపటికి వారిద్దరి మధ్య చోటు చేసుకున్న విశృంఖలత్వాన్ని చూసి చందమామ కూడా సిగ్గుపడి తెలిమబ్బుల చాటుకి తప్పుకుంది.

 

పరవశం పరవళ్ళు తొక్కేవేళ అతను ఆమెను పొదివి పట్టుకుని గుడారంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ పూలతో అలంకరించబడిన బెడ్ మీదకి ఆమెను తోసాడు. ఆమె కౌగిట్లో బందీగా ఉండడం వల్ల అతనూ బెడ్ మీదకు వాలిపోయాడు. రతీ మన్మధులిద్దరూ రసావిష్కరణ తపోదీక్షలో నిమగ్నమయ్యారు. అలా ఎంతసేపు ఉన్నారో తెలియజెప్పడానికి  ఒక చిన్న గడియారమైనా లేకపోయిందక్కడ. అలసి, సొలసి, ఆనంద సారగరంలో మునిగి, తేలి, స్వర్గ ద్వారపు అంచుల వరకూ చేరి హాయిగామత్తుగాగమ్మత్తుగా

 

యుద్ధంలో ప్రత్యర్ధులిద్దరూ సమఉజ్జీలైతే సంధి అంత తొందరగా కుదరదు. అందుకే తెల్లవారు ఝాము వరకూ ఆ యుద్ధం ముగియలేదు. ముగిసే సమయానికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.

 

మొబైల్ రింగ్ టోన్ శబ్దానికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది మయూరి. వొళ్ళంతా హూనమై పోయి ఉండడం వల్ల వెంటనే లేవలేక పోయింది. అప్పుడప్పుడే తెలవారుతున్నట్టుంది. వెంకటాద్రి బయట పడవకి తెడ్లు వేస్తూ కనిపించాడు. ఫోన్ అందుకుని చూసింది. తండ్రి నుంచి. ఇంత ఉదయాన్నే ఎందుకు చేసారబ్బా అనుకుంటూ ఆన్సర్ చేసింది.

 

అమ్మా. డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు. అయినా ఆనందాన్ని తట్టుకోలేక వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను. లిటిగేషన్‍లో మనకు అనుకూలంగా ఉండే బలమైన పాయింట్ దొరికిందట. ఆల్మోస్ట్ కేస్ మనమే గెలుస్తామట. మన బిజినెస్‍కిప్పుడు ఢోకా లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లీఅన్నాడామె తండ్రి.

 

మయూరి ఆశ్చర్యంగా వింటుండి పోయింది. వొట్టి మూఢ నమ్మకమే కావచ్చు. కానీ ఎంత కో-ఇన్సిడెన్స్? నానమ్మ ఇచ్చిన నక్లెస్ తిరిగి తన మెళ్ళోకి రాగానే పరిస్థితిలో ఎంత మార్పు? అలాంటి అధ్బుతమైన గిఫ్ట్ బహూకరించిన వెంకటాద్రి వైపు ఆమె ప్రేమగా చూసింది.

 

మాట్లాడవేం తల్లీ. వింటున్నావా? ఇప్పుడు నీకా దిక్కుమాలిన సంబంధంతో పనిలేదు. మన స్టేటస్‍కి సరిపోయే వాడిని చూసి నీకు మళ్ళీ పెళ్ళి చేస్తాను. లాయర్‍తో మాట్లాడి డైవోర్స్‍ కి ఏర్పాటు చేస్తాను. నువ్వేం దిగులు పడకమ్మా…”

 

డాడీ..దాదాపు అరిచినట్టే అన్నది. ప్రవాహంలా సాగుతున్న తండ్రి మాటలకు టక్కున ఆనకట్ట పడింది. ఏం మాట్లాడుతున్నావు డాడీ? బిజినెస్ పోతే జీవితం పోయినట్టు కాదు. బిజినెస్ తిరిగి వస్తే జీవితం తిరిగి వచ్చినట్టూ కాదు. మీ అల్లుడి నుంచి అతి తక్కువ కాలంలో నేను నేర్చుకున్న పాఠం ఇది. నేనిప్పుడు స్వర్గంలో ఉన్నాను. తిరిగి నరకంలోకి లాగడానికి ప్రయత్నం చేయకండి. మీ బిజినెస్ తిరిగి మీకు వస్తున్నందుకు కంగ్రాట్స్…” అంటూ టక్కున ఫోన్ కట్టేసింది.

 

వెంటనే మరో ఫోన్. చూస్తే శశిరేఖనుంచి. అనాసక్తంగానే ఆన్సర్ చేసింది. తన శోభనం ఎంత గొప్పగా జరిగిందో ఏకరువు పెడుతూ       ఐ పిటీ యూఅనబోయే ఆమె సోది వినడానికి సిద్ధమైంది.

 

మయూరీ. అయామ్ సో అప్‍సెట్. నీ శోభనం లాగే నా శోభనం కూడా బెడిసి కొట్టింది. సో సాడ్అన్నది దిగులుగా.

 

ఆగాగు. నా శోభనం బెడిసి కొట్టిందని ఎవరన్నారు? వందేళ్ళు గుర్తుంచుకోడానికి సరిపడినన్ని మధురానుభూతులు మూటగట్టుకుంటూ అత్యంత శోభాయమానంగా జరిగింది. ఎలా జరిగిందో చెప్పమంటావా?” అంటూ రాత్రి జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పింది.

 

శశిరేఖ నోటమాట రాక అవాక్కైనట్టు ఫోన్‍లో కూడా తెలిసిపోతోంది. ఇంతకీ నీకేమైంది? అంత డల్‍గా మాట్లాడుతున్నావు? ఊటీలో శోభనం, ఏ.సి. సూట్‍, రూమ్ ఫ్రెషనర్స్, కేండిల్ లైట్ డిన్నర్స్ అయినా అప్‍సెట్ అవడమేమిటి?” అని అడిగింది.

 

ఎన్ని ఉంటే ఏం లాభం, ప్రేమ అనేది లేనప్పుడు? మేమిద్దరం ఒకటిగా ఉన్నప్పుడు ఆయన గాళ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. పెళ్ళికి రాలేకపోయినందుకు సారీ చెప్పి విషెష్ తెలియజేయడానికి చేసిందట. కనీసం ఆ సమయంలోనైనా కట్ చేయవచ్చుగా? ఊహు. ఒకవైపు నన్ను కౌగిట్లో నలిపేస్తూనే మరో వైపు దాంతో తియ్యగా మాట్లాడ్డం మొదలెట్టారు. దాంతో నాకు కోపం వచ్చి లేచిపోయాను. మాకసలు శోభనమే జరగలేదుఅన్నది విచారంగా.

 

పకపకా నవ్వాలన్న కోరికని అతికష్టం మీద తమాయించుకుంది మయూరి. లేని విచారాన్ని కంఠంలో పలికించడానికి ప్రయత్నిస్తూ అవునా? అయ్యో అలాగా? అరెరే. అయామ్ సో సారీ శశీ. నౌ ఐ పిటీ యూ…” అన్నది ఫోన్ కట్ చేస్తూ.

 

తెడ్లు వేస్తున్న వెంకటాద్రి దగ్గరకి వెళ్ళి వెనకనుంచి వాటేసుకుని రాత్రి అతను ఇచ్చిన సుఖానికి కృతజ్ఞతగా అతని చెంప మీద తియ్యని ముద్దు పెట్టింది. అతను చిరుమందహాసంతో ఆమె ముఖంలోకి చూసాడు. ఆ కళ్ళల్లో స్వచ్చమైన ప్రేమ ఉంది!

 

-  - -