గుండెలో కోత

గుండెలో కోత

 

        ట్రైన్ లో కూర్చుని కిటికీలోనుంచి వెనక్కి వేగంగా వెళ్తున్న చెట్లను, పొలాలను చూస్తూ సంతోషంగా ఉండాల్సిన నా మనసు గుబులుతో నిండిపోయి ఉంది. బయటకు చెప్పలేని బాధ ఏదో నా గుండెను పట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతించిన కాలం తోటే ఆ గుర్తులు కూడా మాయమవుతాయి మళ్ళీ వాటిని అనుభవించలేము అనే భావం కరకు కసాయిలా నా గొంతు నొక్కుతున్నట్లు అనిపించింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర, మొఖంపై పట్టిన చిరుచెమట చూసి నేను బాధపడుతున్నాను అని ఆమెకు సందేహం వచ్చింది.

        ’ఏం అలా ఉన్నావు?’ అంది.

        ’ప్చ్...’ అని చిన్నగా శబ్ధం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నా.

        తను లేచి వచ్చి, నా గుండెలపై మెల్లగా రాసింది. వారించాను!

        ’పోనీ కాసేపు అలా పడుకోరాదూ’ చిన్నగా అభ్యర్థించింది. నా ఆలోచనలను డిస్టర్బ్ చేస్తున్న ఆమెపై కోపం వచ్చింది. కాని పోట్లాడే ఓపిక లేదు. ఆమె మాట వింటేనన్నా నా జోలికి రావడం మానేస్తుందనుకుని బెర్త్ పైన పడుకున్నాను. ఫస్ట్ ఎసి కంపార్ట్‍మెంట్ కావడం వలనా మేము నలుగురం మాత్రమే ఆ కాబిన్ లో ఉండడం వల్లా ప్రైవసీ ఉంది. కళ్ళు మూసుకున్నాను.

        ’రేయ్, నాన్నకు కాళ్ళు పట్టండి’ అంది ఆమె.

        చిన్నోడు చెవిలోని ఇయర్ ఫోన్స్ లో వింటున్న మ్యూజిక్‍లో మునిగి ఉన్నాడు, అమ్మ మాట వాడికి వినబడిందో లేదో! పెద్దోడు వచ్చి కాళ్ళు కసాబిసా నొక్కేసాడు. వాడిని మెల్లగా వారించాను ’చాలు. గాడ్ బ్లెస్ యూ’ అంటూ.

        కళ్ళు మూసుకుని నిద్ర నటించాను. వేదనలొ ఉన్న నా మనసు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. చిన్ననాటి జ్ఞాపకాలను ఉప్పెనలా నా పైకి పంపి నన్ను అతలాకుతలం చేస్తూనే ఉంది.

        జ్ఞాపకాలు మనిషికి ప్రాణవాయువు లాంటివి. అవి అందక పోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు మానవుడు. తాను గాలిలో ఎగిరిపోయే ధూళికణం కాదని తనకు ఒక పుట్టుక ఒక చరిత్ర ఉన్నది అని అతను గర్వంగానో ధైర్యంగానో భావించుకోవడానికి ఆ జ్ఞాపకాలే ఆలంబన. ఏది కోల్పోయినా రాజీ పడగలుగుతాడు కాని జ్ఞాపకాలు కోల్పోతే మనిషి తట్టుకోలేడు. నడి సముద్రంలో మునిగిపోతే ప్రాణాలకోసం ఎంత తల్లడిల్లి పోతాడో అంతకంటే ఎక్కువగా ఆ కొల్పోయిన జ్ఞాపకాలను అందిపుచ్చుకోవడానికి ఆరాటపడతాడు. నీటిలో మునిగే వాడు ఏదో ఆధారం దొరికితే దాన్ని పట్టుకోవాలనుకుంటాడు. అలాగే కాలప్రవాహంలో కొట్టుకుపోయే మనిషి కూడా జ్ఞాపకాలే ఆధారంగా చేసుకుని జీవనయానాన్ని సుఖంగా సాగిస్తాడు. ఇవన్నీ ఎవరో చెప్తే వినో, ఎక్కడో చదివితే గుర్తుకి వచ్చో మీకు చెప్పడం లేదు. అచ్చంగా నేను అనుభవిస్తున్న ఆవేదనలో నాకు తెలిసిన జీవన సత్యం ఇది.

        చిన్నప్పుడు విశాఖపట్టణంలో చదువుకున్న రోజుల్లో మేము ఉండే ఇల్లు చూడాలని ఈ ప్రయాణం పెట్టుకున్నాను.

        కాని ప్రయాణాలంటే నాకు భలే చిరాకు!

        ట్రైన్‍లో రిజర్వేషన్లు చూసుకోవడం, సామాను సర్దుకోవడం, రోడ్ల మీది ట్రాఫిక్ జామ్ లను తప్పించుకుని సకాలంలో స్టేషన్ చేరడం, దాని కోసం ఇంటినుంచి ముందుగానే బయలదేరడం, ఇలా ఒకటేమిటి అనేక సమస్యలు ఎదుర్కోవాలి.

        రాత్రుళ్ళ ప్రయాణంలో నిద్ర పోవడానికి వీలులేకుండా ’సర్వాంతర్యామి’లా తయారయిన సెల్ ఫోన్లు ఒక చోట ఆగితే మరోచోట మోగి, రైతు బజార్‍లో కొత్తిమెర కట్టల బేరాల లాంటి సంభాషణలతో చెవులు తూట్లు పొడుస్తుంటాయి. ఇదే ఓ ఇరవై ఏళ్ళ క్రితం  ఎంతో మర్యాదగా మెలిగేవాళ్ళు ప్రయాణీకులు. గట్టిగా మాట్లాడుకోవడం ఉండేది కాదు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండేది. హాయిగా విశ్రాంతిగా ఉండేది ప్రయాణం. ఇప్పుడు ఏదీ ఆ ప్రశాంతత? ఎక్కడుందీ ఆ హాయి?

        అందుకే నాకు ప్రయాణం చేయాలంటే పరమ చిరాకు!!

        కాని నిజం చెప్పాలంటే ఈ ప్రయాణం కోసం మాత్రం నేను ఎన్నేళ్ళగానో ఎదురుచూసాను. పనుల ఒత్తిడిలో పడిపోయిన నాకు అచ్చంగా నా కోసమే కొంత సమయాన్ని కేటాయించుకోవడానికి ఇప్పటికి తీరింది. ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి నాలో చిన్నప్పటి జ్ఞాపకాలు ఉప్పెనలా పొంగాయి. నేను తిరిగిన ఆ ప్రాంతాలన్నీ నా కళ్ళ ముందు సినిమా రీళ్ళలా తిరిగాయి. అవన్నీ నిన్ననో, మొన్ననో జరిగినంత స్పష్టంగా నా మనోఫలకంపై ప్రతిఫలించాయి. నా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్నవాటన్నిటినీ తిరిగి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఉత్సుకతతో ఈ ప్రయాణం కోసం ఎదురు చూసాను. అదీగాక రైలు ప్రయాణం అంటే నాకు ఎన్నో తీపి గుర్తులు. నా చిన్నతనం రైలు ప్రయాణాలతో బాగా ముడిపడి ఉంది. ఆ విషయం మరోసారి చెప్తాలెండి!

        నాతోపాటు బయల్దేరిన నా భార్యా పిల్లలకు మాత్రం సరదాగా విశాఖపట్టణంలో తిరిగి ఎంజాయ్ చేయడానికే వెళ్తున్నాం అనే చెప్పాను. వాళ్ళకు నా సీక్రెట్ ఎజెండా ఏమిటన్నది తెలియదు. చెప్పొచ్చుగాని, నవ్వుతారేమో అని కాస్త అనుమానం కలిగి నాలోనే దాచుకున్నాను!

        విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం జరిగినప్పుడు నేను సెవెన్త్ చదువుతుండేవాడిని. ’విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ జరిగిన ఆ ఉద్యమంలో మా చదువులు అటకెక్కాయి. ప్రభుత్వం వారు ఆ ఏడాదికి ఏడవ తరగతి పరీక్షలను పబ్లిక్ పరీక్షలుగా పరిగణించకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించడం వలన ఒక ఏడాది చదువులో వెనకబడకుండా తప్పించుకున్నాను.

        నేను చదివినది సెయింట్ పీటర్స్ హైస్కూల్‍లో. అది ఒక మిషనరీ స్కూల్. ఆ స్కూల్ ఉండే ప్రాంతం విశాఖపట్టణం రైల్వే స్టేషన్‍కు అవతలి వైపు ఉన్న రైల్వే కోలనీని ఆనుకుని ఉన్న జ్ఞానాపురం అనే ప్రాంతంలో ఉండేది. ఎమ్ ఎస్ ఎమ్ కోలనీ లో ౧౦౪ బి. ఇది మా ఇంటి నెంబర్.

        మా స్కూల్‍ని ఆనుకుని ఒక కొండ కూడా ఉండేది. మధ్యాహ్నం భోజన విరామంలో  మేమంతా కొండపైకి ఎక్కి ఆడుకునే వాళ్ళం. పరుగులు పెడుతూ ఆ కొండ ఎక్కడం ఇంకా బాగా గుర్తు. ఆ కొండపై ఒక రకం ముళ్ళ చెట్లుండేవి. వాటిమీద చిన్న చిన్న పురుగులు ఉండేవి. ఆ పురుగుల తలలపై కొమ్ములు లాంటి బుడిపెలు ఉండేవి. ఆ పురుగులను పట్టుకుని వాటిని కొమ్ములపై నిలబెడితే గిరగిరా తిరిగేవి. ఆ కొమ్ములు చూస్తే అవి ఆవులులా అనిపించేవి. ఆ చెట్ల కొమ్మలపై చీమలు కూడా ఉండేవి. కొద్ది రోజులు పరిశీలించి చూస్తే ఆ చీమలు ఈ పురుగులను నిజంగా ’ఆవులు’ లాగానే చూస్తున్నాయేమో అనిపించేది.

        ఆ పురుగులు ఆకులను తినేవి. చీమలు వాటి వెంట తిరిగేవి. ఆ ’ఆవులను’ ఏదో విధంగా ప్రేరేపించేవి. అప్పుడు అవి తిన్న ఆకుల పసరుని కక్కేసేవి. చీమలు వాటిని తినేవి. ఇది ఏదో శాస్త్రీయ విచారణ అన్నంత ఉత్సాహంగా గమనించి ఒకరికొకరం చూపించుకుంటూ ఉండేవాళ్ళం.

        క్లాసులో ఫిజిక్స్ మాస్టారు మాకు పాఠం చెప్పి, ’అరే బడ్డూ, మీ జేబులో ఇప్పుడు అయిదు మార్కులు పెట్టేను’ అని చెప్పడం, హిందీ మాస్టరు, పాఠం చెప్తూ వేరే మాస్టార్లపై జోకులు చెప్పడం, ’కొడితే పాతాళంలోకి వెళ్ళిపోతారు’ అంటూ మొట్టికాయలు వేసే లెక్కల మాస్టారు అందరూ గుర్తుకి వచ్చారు. అప్పట్లో కొందరి మాస్టార్లంటే ఇష్టం మరికొందరంటే భయం ఉండేవి కాని, ఇప్పుడు అందరూ ఇష్టమే అనిపించింది. వాళ్ళంతా ఏమయిపోయి ఉంటారో అనుకుంటే చెప్పలేని దిగులు వేసింది.

        ’సఖీ ప్రియా, అలక మానవా’ అంటూ శ్రావ్యంగా పాడే ఆ పెద్ద కళ్ళ పిల్లవాడి పేరు ఎంత ఆలోచించినా గుర్తుకి రాదేం? బూరెల్లా బుగ్గల్లోకి గాలి నింపుకుని హనుమంతుడిలా తన మూతి పెట్టుకునే ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడొ! గోటితో బొమ్మలు వేసి నఖ చిత్రాలు అనే మాటను నేను పదో తరగతి చదువుతున్నప్పుడే నాకు పరిచయం చేసిన ఆ డ్రాయింగ్ మాస్టారు చిత్రకళలో ఎంత పేరు తెచ్చుకుని ఉంటారో!  ఎవరినీ ఇప్పుడు కలవలేను.

        మా స్కూల్‍కి దగ్గరలోనే చర్చ్ ఉండేది. దాని పక్కనే మిషనరీస్ నివసించడానికి ఒక భవనం ఉండేది. అందులోనే మా హెడ్‍మాస్టర్ కూడా ఉండేవారు. ఆయనతో పాటు ఇంకా కొందరు ఉండేవారు. వాళ్ళని బ్రదర్ అనీ మా హెడ్ మాస్టారుని ఫాదర్ అనీ పిలిచేవాళ్ళం.

        నాచురల్ సైన్స్ మాస్టారు క్లాసులోకి వచ్చి ఒక అరగంట పాటు ఏమీ మాట్లాడకుండా బోర్డు పైన బొమ్మ గీసేవారు. ఎంత క్లిష్టమైన బొమ్మ అయినా సరే చక్కగా అందంగా వేసేవారు. ఆ బొమ్మ పూర్తి చేసాకే ఆయన పాఠం చెప్పేవారు. అవి మనసుకి హత్తుకునేలా ఉండేవి. అప్పుడు నేను నేర్చుకున్న విషయాలు మూడు దశాబ్దాలు దాటినా ఇంకా మరచిపోలేదు అంటే ఆ క్రెడిట్ ఆ మాష్టారుదే! ఆ ఇంట్రెస్ట్ తోనే టెక్స్ట్ బుక్ మొత్తం చదివి వాటిల్లో నాకు ముఖ్యం అనిపించిన పాయింట్లను ఒక బిట్ కొశ్చెన్లలా రాసి చూపిస్తే అందులో కొన్ని బిట్సుని క్లాసులో చదివి వినిపించారు ఆ మాష్టారు. ఆ రోజు నాకు ఎంత సంతోషం అనిపించిందో మాటల్లో చెప్పలేను.

        ఒక రోజు ఫాదర్ వచ్చి ’స్కూల్‍కి దగ్గరలో ఉండేవాళ్ళు చేతులు ఎత్తండిరా?’ అంటే ఉత్సాహంగా చేతులెత్తిన మాకు ఫాదర్, సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆయన క్వార్టర్స్‍కి వచ్చి చదువుకోవాలి అని ఆర్డర్ వేసారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూల్‍కి రమ్మంటే ’అయ్యో అనవసరంగా చెయ్యెత్తి ఇరుక్కుపోయామే’ అనుకున్నాం.

        రాత్రిళ్ళు అప్పట్లో త్వరగానే నిద్రపోయేవారు జనాలు. అందరూ గుంపుగా వీధుల్లో నడుస్తూ వెళ్తుంటే నిశ్శబ్దంగా ఉండేది ఆ వీధుల్లో. మాలో కొందరు అల్లరి చేయడానికి ’దొంగా, దొంగా’ అని గట్టిగా అరిచేవారు. ఆ గోలకి ఎవరైనా పెద్ద వాళ్ళు వీధి గుమ్మాలు తెరుచుకుని వస్తే, ’రంగా, రంగా’ అని అరిచేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని తిట్టుకుని తలుపులు వేసుకుని పోయేవారు. కానీ ఒకరోజు, మా హిందీ మాష్టారు లేచి వచ్చారు. ఆయన్ని చూడగానే అందరికీ భయం వేసింది, ఫాదర్‍కి మాపైన కంప్లైంట్ చేస్తారేమో అని. ’రేయ్ ఏంట్రా మీ గోల?’ అని ఆయన గద్దించేసరికి మా నోట మాట రాలేదు. ఆయన నవ్వి ’మా ఇంటి దగ్గర అరవకండిరా’ అన్నారు. ’హమ్మయ్య!’ అనుకుని ’అలాగే సార్’ అనేసి పారిపోయాం.

        రాత్రి పూట క్వార్టర్స్ లో మేము చదువుకునేటపుడు మాపై కన్నేసి ఉంచే వారు మా ఫాదర్. ఆయన ఒక కుర్చీలో కూర్చుని బైబిల్ చదువుకుంటూ అప్పుడప్పుడు మేము కూర్చున్న వరండాలో పచార్లు కొట్టేవారు. భోజనం వేళకు వంటవాడు వచ్చి ఒక గంట కొట్టేవాడు. అప్పుడు బ్రదర్స్, ఫాదర్ అంతా తమతమ గదులలోనుంచి వచ్చి డైనింగ్ రూమ్‍కి వెళ్ళేవాళ్ళు. ఆ వంటవాడు పుట్టు మూగ. కాని ఏవో శబ్దాలు చేస్తూ సైగలు చేస్తూ మాతో ఏవో విషయాలు చెప్తూనే ఉండేవాడు ఖాళీ దొరికినప్పుడు. అతను ఇప్పుడు ఉండి ఉంటాడా? ఏమో?

        మేము ఉండే క్వార్టర్స్ కు ఎదురుగా ఒక స్టేజి ఉండేది. పండగల్లో దేవుడిని అక్కడ పెట్టి పూజలు చేసేవాళ్ళు. మామూలు రోజుల్లో ఆ స్టేజి దగ్గరే క్రికెట్ ఆడేవాళ్ళం. కొంచెం దూరంగా ఒక చిన్న ఫెన్సింగ్ తో కట్టిన పైడిమాంబ గుడి ఉండేది. విగ్రహం ఏమీ ఉండేది కాదు. ఒక శిలకు పసుపు కుంకుమ రాసి ఉండేవి. అందరూ అక్కడే కొబ్బరికాయలు కొట్టి అగరొత్తులు పెట్టి దణ్ణం పెట్టుకునేవాళ్ళం.

        మా క్వార్టర్ గుమ్మం దగ్గర నుంచుని చూస్తే దూరంగా ఒక కొండ కనిపించేది. విశాఖపట్టణం రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడికి వచ్చే ట్రైన్స్ మళ్ళీ ఇంజన్ మార్చుకుని కొంత వరకు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి అక్కడ రూట్ మార్చుకుని ముందుకి సాగిపోయేవి. దానివల్ల ఆ స్టేషన్ కి వచ్చి పోయే ప్రతి రైలు మా క్వార్టర్ గుమ్మంలో నుంచుని చూస్తే దూరంగా ఉన్న ఆ కొండ పక్కనే ఒంపు తిరిగి వయ్యారంగా వెళ్ళడం కనిపించేది.

        అలా రైలు రావడం కనిపించడం కోసం మేము కాచుకుని ఉండే వాళ్ళం ఎందుకంటే మా నాన్నగారు రైల్వేలో గార్డుగా పనిచేసేవారు. ఆయనకు కారేజి కట్టడం ఎప్పుడు ఆలస్యం చేస్తుండేది మా అమ్మ. లేటవుతున్నందుకు పాపం ఆయనకు ఒకటే కంగారు. అందుకని మా అమ్మ మమ్మలను రైలు వస్తుందో లేదో చూడండిరా అనేది. మేము స్కూలుకి వెళ్తే పాపం ఆ డ్యూటీ మా నాన్న చేసేవారు. ’రైలొచ్చేసింది’ అని మేము అరిస్తే అప్పటి వరకు అయిన వాటితోనే కారేజి కట్టేసి పంపేది. అది తీసుకుని ఆయన దగ్గర దారిలో స్టేషన్‍కు హడావుడిగా వెళ్ళేవారు. మళ్ళీ ఆయన అదే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ గుమ్మం దగ్గర నుంచుని చూసేవాళ్ళం. మాకోసం ఆయన జెండా ఊపి టాటా చెప్పేవారు.

        ఆ ఇల్లు, ఆ స్టేజి, ఆ గుడి, ఆ కొండ అన్నీ చూద్దామనుకున్నాను. వాటిని చూపించి ఆ వివరాలన్నీ నా పిల్లలతో చెప్పి మళ్ళీ ఆ కాలంలోకి ప్రయాణం చేసి ఆ ఆనందాన్ని మరోసారి అనుభవించాలనుకున్నాను. వెళ్ళిన రోజు బీచి, కైలాసగిరి, సింహాచలం అన్నీ చూసాం. కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళాం జగదంబ సెంటర్ కొత్తగా కనిపించింది. పూర్ణా మార్కెట్ ఆనవాలు కట్టలేకపోయాను. అయినా సిటీ పెరిగినప్పుడు ఇవన్నీ మామూలే అనుకున్నా. కాని పొదరిల్లు లాంటి మా ఇల్లు పదిలంగా ఉంటుందిలే, నా స్కూల్ కూడా అలానే ఉంటుంది అనుకున్నాను. మరుసటి రోజు అక్కడకి తీసుకువెళ్ళాను అందరినీ. నా కబుర్లతో మా వాళ్ళకు బోరు అయిపోయిందేమో కూడా. కాని నా ఎక్సైట్‍మెంట్‍లో అదేం పట్టించుకోలేదు. నా బాల్యంలోకి నా మనసులు పరిగెడుతూ ఉంటే నేను కూడా ఉరకలు వేస్తూ పోయాను నా తీపి గుర్తులన్నీ చూసుకోవాలని!

        కాని జరిగింది ఏమిటి? ఆ స్కూలు తప్ప ఇక నాకు గుర్తున్నవన్నీ మారిపోయాయి. మేము ఆడుకునే ఆ కొండ కూడా మారిపోయింది. పెద్ద పెద్ద మెట్లు, దారి పొడవునా విగ్రహాలతో అలంకరించి ఉంది. ఆ పెద్ద పెద్ద రాళ్ళు, ఆ ముళ్ళ చెట్లు, ఆ చీమలు, ఆవులు ఏవీ లేవు!

        పోనీ మా క్వార్టర్ దగ్గరకి వెళ్దాము, అవన్నా చూసి ఆనందిద్దాం అనుకున్నాను. అసలు ఆ కోలనీనే లేదు. దాని స్థానంలో విశాఖపట్టణం రైల్వే స్టేషన్ కి మరో ఎంట్రన్స్ బిల్డింగ్ కనిపించింది. మొత్తం మారిపోయింది. ఆ పైడిమాంబ గుడి ఒకటి తప్ప అక్కడ ఏవీ కనబడలేదు. కనీసం స్టేజి అన్నా కనిపిస్తుందా అని చాలా సేపు వెతికితే, పిచ్చి మొక్కలతో నేలబారుగా ఉన్న ఒక దిమ్మలాంటి ప్రాంతం కనిపించింది. మేము ఉండే ఇల్లు, ఆ చుట్టు పక్కల ఇల్లు ఒక్కటీ లేవు. మనసంతా శూన్యం నిండిపోయింది. పిల్లలతో అప్పటివరకు ఉత్సాహంగా నా చిన్నప్పటి విషయాలు చెప్పాను. వాళ్ళకు ’ఇదిగో ఈ ఇంట్లోనే మేం ఉండే వాళ్ళం’. ’ఇదిగో ఇక్కడ నుంచుని మా నాన్న వెళ్ళే రైలు ని చూస్తూ ఆయనకు టాటా చెప్పేవాళ్ళం’ అని ఎన్నో చెప్పాలనుకున్నా!’.

        అక్కడ నాకు ఒక్కసారిగా తగిలిన ఆశనిపాతం నన్ను స్తబ్దుడిని చేసింది. అప్పటినుంచి నా మనసులో అలజడి మొదలయింది. ఏవో చెప్పలేని భావాలు నన్ను శూన్యంలోకి నెట్టేసాయి. అనంతమైన చీకటి కాల సముద్రంలో నేనొంటరిగా ఆధారం లేకుండా కొట్టుకుపోతున్నట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయిపోయాను.

        ఆ రోజు తిరుగు ప్రయాణంలో కూడా నా పరిస్థితి అదే.

        అన్నీ మననం చేసుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్న నాకు నా వేదనకు సరైన కారణం కనిపించలేదు. ఎందుకు నా మనసు ఇంత బాధపడుతోంది. ఏం కోల్పోయిందని. నేను సంపాదించిన ఆస్తి అలాగే ఉంది, నా భార్యా పిల్లలు కూడా నాతోనే ఉన్నారు. నా వాళ్ళంతా బాగానే ఉన్నారు. మరి ఎందుకు నాకింత దిగులు? ఒక వంక బాధ అనుభవిస్తూనే మరోవంక నాలో నేను తర్కించుకుంటున్నా. నాన్న పోయినపుడు ఎంత బాధ పడ్డానో గుర్తుకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే బాధ. కాని అప్పుడు నేను కోల్పోయింది నాన్నను అని తెలుస్తూనే ఉంది కాబట్టి నా బాధను నాకే కాదు, అందరికీ అర్థమయింది. నేను ఒంటరి కాననని తామంతా నాకు తోడుగా ఉన్నామని నన్ను ఓదార్చారు అప్పుడు. కాని ఇప్పుడు నేను ఎందుకు అలా ఉన్నానో నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలుస్తుంది!?

        నా లో ఒక వంక ఈ ఆలోచనలు  మరో వంక అంతుపట్టని దిగులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు అనిపించింది. ప్రతి ప్రాణికి తన ఉనికి ఒక విశేషం అని. తనకు తానే ఒక అబ్బురం కాకపోతే ఆ ఉనికి కొనసాగడం ఎలా? మనుగడ ముందుకి వెళ్ళడం ఎలాగ? బహుశా అందుకే మనిషికి నాది, నేను అనే మమకారం ఇచ్చాడేమో భగవంతుడు అనిపించింది. ఈ భూమి పైన నాకు ఇష్టమైన గుర్తులు నా ఉనికిని పదిలపరుస్తూ నాకంటూ ఒక ప్రత్యేకతను కల్పించడం, అది ఎంత చిన్నదైనా సరే ముఖ్యం. అదే లోపిస్తే శూన్యం తప్పదు. ఒక మనిషికే కాదు, ఒక జాతికి, ఒక దేశానికి కూడా అలాంటిది అవసరమే!

        నాకు బాధను కలిగిస్తున్నదేదో కొద్ది కొద్దిగా అవగాహన లోకి వస్తున్నట్లున్నా ఆ బాధను తగ్గించుకునే మార్గం కనిపించలేదు. మనసు అలా బాధలో మునకలు వేస్తూనే ఉంది.

        నా బాధతో తనకు ఏమీ పట్టనట్లు నిర్వికారంగా సాగిపోతూనేఉంది రైలు. తమ తమ స్టేష్న్లు వస్తే దిగే వాళ్ళు దిగుతున్నారు, కొత్త వాళ్ళు ఎక్కుతున్నారు, రైలు మళ్ళీ సాగుతూ తన దారిన తాను వెళ్తూనే ఉంది.

        దుఃఖంలో ఉన్న మనసుకు స్వాంతన చేకూర్చడానికి మనిషికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఉదాసీనం మరోటి ఉత్సాహం. ఒకటి చీకటి మన జీవితంలో ఉండక తప్పదు అని సమాధానపడుతుంది. రెండోది ఆ చీకటిలో చిరుదివ్వెను వెలిగించి చీకటిని తరుముతుంది. మొదటిది ప్రరాజయ మార్గం రెండోది పరాక్రమ మార్గం.

        పరాక్రమించడానికి తగ్గ స్ఫూర్తి లేక నా మనసు పరాజయ మార్గం వేపుకి మళ్ళిపోయింది. ’ఇంతేలే ఈ జీవితం. మన చేతుల్లో ఏమీలేదు’ అని నిట్టూచాను.

        అంతలో ’ఒక నిముషం లేచి కూర్చో నీకు ఇష్ట,మైనది చూద్దువుగాని’ అంది ఆమె.

        నిస్సత్తువుగా ఉన్న నేను అలాగే లేచి ఆమె చూపించిన వైపుకి కిటికీలో నుంచి బయటకు చూసాను.

        రైలు అన్నవరం సమీపించినట్లుంది. అప్పటికి చీకటి పడడం వల్ల బయట దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. నేను నిద్రపోతున్నాననుకుని కాబిన్ లో లైట్లు ఆపివేసినట్లుంది. కాబిన్ కొంచెం చీకటిగా ఉంది. అందువల్ల బయట లైట్లు చక్కగా కనిపిస్తున్నాయి.

        దూరంగా చిన్న కొండ దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించింది. అప్రయత్నంగా చేతులు జోడించి ఆ కొండకు దానిపై స్వయంభువుగా వేంచేసిన సత్యనారాయణ స్వామికి నమస్కరించాను. మెరుపులా ఒక ఆలోచన నా మనసుని బలంగా తాకింది. నా చిన్నప్పటి నుంచీ నేను చూస్తున్నాను ఈ అన్నవరాన్ని, ఇక్కడి దేవుడిని. ఇంతకు ముందు ఎన్ని తరాలనుంచో ఆ దేవుడు అక్కడ ఉన్నాడు. ఇంకా ముందు ఎన్నో తరాల వరకు అలానే ఉంటాడు. శాశ్వతము, అశాశ్వతము మధ్య కొట్టొచ్చినట్లున్న బేధం అప్పుడు లీలగా బోధపడింది. అనిత్యాలు, అశాశ్వాతాలు అయిన వాటి గురించి వెంపర్లాడక పోతే శాశ్వతమైన వాటి గురించి మనిషి ఎందుకు ఆలోచించడు.

        చెరిపితే చెరిగిపోయే వాటి గురించి అంతగా మనసు పాడు చేసుకోవాలా. ఉన్నన్ని గుర్తులు ఉన్నాయి. లేనివి లేవు. అయినా శాశ్వతమైనవి అప్పుడు ఇపుడూ ఉన్నాయి. ఎప్పుడూ ఉంటాయి. భగవద్గీతలో భగవానుడు ’మా శుచ’ అని బోధిస్తున్నట్లు అనిపించింది. కళ్ళ వెంట రెండు కన్నీటి బొట్లు రాలి పడ్డాయి. మనసు తేలికయింది. నవ్వుతూ చూసాను.

*      *      *