ఆగిన రైలు

ఆగిన రైలు

 

        రైలు ప్రయాణం చేసేవారికి తాము స్టేషన్‍కు చేరుకునేసరికి తాము ఎక్కాల్సిన రైలు ఆగి వుంటే సుఖం. అలాగే తము దిగాల్సిన  స్టేషన్‍లో రైలు ఆగి, తమ సామాను దించుకునే వరకు కదలకుండా ఉంటే మరీ సంతోషం.

        రైలు కదిలితే ఒక్కోసారి ప్రమాదం జరగవచ్చు. కాని రైలు ఆగితే ప్రమాదం జరుగుతుందా?

        సింహాద్రి అప్పన్న ఎనిమేదేళ్ళ వాడు. వాడి నాన్న మిల్లులో పనిచేస్తాడు. అమ్మ ఇంటిపట్టునే వుంటుంది. వాళ్ళకు అప్పన్న ఒక్కడే సంతానం.

        అప్పన్నకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ తో పక్కనే వున్న ’జయలక్ష్మి’ సినిమా హాల్లో నూన్ షో కి సినిమాకి వెళ్ళడమంటే వాడికి ఇంకా ఇష్టం. వాళ్ళ అమ్మమ్మ ఇళ్ళు వాడి ఇంటికి దగ్గరలోనే వుంది. మధ్యలో వున్న రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ దాటి తే వాళ్ళ అమ్మమ్మ ఇళ్ళు పది అడుగుల దూరం, అంతే. ’జయలక్ష్మి’ సినిమా హాలు అమ్మమ్మ ఇంటికి పక్కనే రోడ్డు మీద వుంది.

        ఆ రోజు అప్పన్న ఇంట్లోనే వున్నాడు. వాడికి దసరా శలవులు ఇచ్చారు. తెల్లారిందగ్గర నుంచి ఒకటే గోల చేస్తున్నాడు. " అమ్మా, అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తానే" అంటూ.

        కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతూ అమ్మను ఏ పని చేసుకోనీయకుండా సతాయించాడు. వాడి బాధ పడలేక " సరే వెళ్ళరా బాబూ, ఓ తినేస్తున్నావు గాని", అని విసుక్కుంది. ఉత్సాహంగా గంతులు వేసుకుంటూ బయలుదేరిన అప్పన్నను చూసి నవ్వుకుంది, ’వీడికి అమ్మమ్మ మీద ప్రేమా, సినిమా మీద ప్రేమా’ అనుకుంటూ.

        వీధి లోకి పరిగెడుతున్న అప్పన్నను చూస్తూ, " గేటు దగ్గర రైలు బండి ఆగి వుంటే కిందనుంచి దూరబాకు, ప్రమాదం" అని అరిచి చెప్పింది. అమ్మ ఎప్పుడూ చెప్పే మాటలే గనుక ’సరే’ అని కూడా చెప్పకుండా వీధిలోకి ఒక్క గంతు వేసాడు, అప్పన్న.

        జారిపోతున్న లాగూని మొలతాడు కింద దోపుకుని వీధి దాటి రోడ్డు పైకి వచ్చాడు. అల్లంత దూరంలొ రైల్వే గేటు కనిపిస్తోంది. ఆ దారిలో ఎన్నోసార్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందుకే ఎటువంటి భయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళాడు.

        ’కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి’, తనకిష్టమైన పాటను కూని రాగం తీస్తూ ఉషారుగా నడవసాగాడు. దూరంగా ఉన్న లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర ఒక రైలు ఆగి వుంది. తను వెళ్ళేసరికి అది అక్కడ నుంచి వెళ్ళిపోతుందిలే, దాని కింద నుంచి దూరనవసరం లేదనుకున్నాడు అప్పన్న. అయినా బండి కింద నుంచి దూరడం అంటే వాడికి కాస్త సరదాగానే వుంటుంది. చాలాసార్లు వేరే వాళ్ళతో పాటు వాడు కూడా లెవెల్ క్రాసింగ్ దగ్గర రైలు ఆగి వున్నప్పుడు బండి కింద దూరి వెళ్ళేవాడు. వాడి చిన్న శరీరం చాలా సులువుగా బండి కింద నుంచి దూరడానికి అనువుగా వుంటుంది. పెద్దవాళ్ళు కష్టపడి దూరి వెళ్ళేవాళ్ళు. అవతలి వైపుకు వెళ్ళేసరికి పాపం, వాళ్ళకు  ఎక్కడొ ఒక చోట గ్రీజు అంటుకునేది. తిట్టుకుంటూ పోయేవాళ్ళు. అప్పన్న మాత్రం కాస్త మట్టి కూడా అంటుకోకుండా అవతలికి వెళ్ళగలిగేవాడు.

        వాడి అదృష్టమో, దురదృష్టమో వాడు వెళ్ళేసరికి రైలు ఇంకా అక్కడే వుంది. ఎప్పటి లాగే బండి కింద నుంచి దూరడానికి సిద్ధపడ్డ అప్పన్న ను ఒక పెద్దాయన గదమాయించాడు, "ఏరా, బతకాలని లేదా" అంటూ. భయంతో అప్పన్న బిక్కచచ్చిపోయాడు . కాని కొంతమంది కుర్రాళ్ళు బండి లొకి ఎక్కి అవతలకు దిగుతుంటే వాళ్ళతో పాటు వాడు కూడ బండి ఎక్కాడు. పెద్దాయన తిట్టినందుకు దెబ్బతిన్న వాడి అహం కొంత శాంతించింది.

        అయితే వాడికి తెలియదు, ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయిందని, మరొక పెద్ద ప్రమాదం లోనికి అడుగుపెట్టానని.

        అప్పన్న ఎక్కిన కంపార్ట్‍మెంట్ జనరల్‍ది. జనాలతో అది కిటకిట లాడుతోంది. అప్పన్న కంటే ముందు ఎక్కిన కుర్రాళ్ళు దారికి అడ్డుగా వున్న జనాలను తోసుకుంటూ ముందుకి వెళ్ళిపోయారు.  వాళ్ళు సగం దూరం వెళ్ళేసరికి రైలు పెద్ద కూత పెట్టి బయలుదేరింది. ఆ కూత విని కుర్రాళ్ళు గబగబా దారి చేసుకుని కదులుతున్న బండి లోనుంచి దిగిపోయారు. వాళ్ళ లాగ దారి చేసుకోలేని అప్పన్న జనం మధ్య ఇరుక్కు పోయాడు. ముందుకి వెళ్ళలేడు, వెనకకు వెళ్ళలేడు.

        అప్పన్నకు చాలా భయం వేసింది. వాడు పుట్టి బుద్ధెరిగాక అంత భయం వాడెరగడు. వెంటనే పెద్దగా ఏడుపు లంకించున్నాడు.

        అక్కడి జనం గాబరాపడి ఏమైందో తెలుసుకునేలొపలే ఆ సూపర్‍ఫాస్ట్ రైలు వేగం పుంజుకుంది. చాలా సేపు గేటు దగ్గరే ఆగి వుండటం వలన డ్రైవరు లేటు కవర్ చేయటంకోసమేమొ వెంటనే వేగం పెంచాడు.

        తలుపుకి అడ్డంగా ఉన్న జనం అప్పన్న కు దారి ఇచ్చారు. కాని అంత వేగంగా కదులుతున్న బండి లోనుంచి దిగటమంటే ప్రాణాపాయం అని తలుపు దగ్గర నుంచున్న వాళ్ళు అప్పన్నను దిగకుండా ఆపేసారు.

        కళ్ళ ముందు తమ ఊరు వేగంగా వెనకకు వెళ్ళిపోతుంటే ఏమి చేయాలో తెలియని అప్పన్నకు భయంతో ఒళ్ళంతా కంపించిపోయింది. బండి ఔటరు దగ్గర స్లో అవుతే అక్కడ దింపుతాము ఏడవకని అక్కడి వాళ్ళు ఓదార్చాలని చూసారు.

        ఆ బండి ఎక్కడా ఆగలేదు.

        ఏడ్చి, ఏడ్చి అప్పన్న సొమ్మసిల్లి పడిపోయాడు.

        కంపార్ట్‍మెంట్‍లోని జనం ఒక్కొక్కరు ఒక్కో మాటా అన్నారు. బండి వచ్చే స్టేషన్‍లో ఆగిన తరువాత రైల్వే పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే వాడిని ఇళ్ళు చేరుస్తారని అనుకున్నారు.

        ఆ సూపర్ ఫాస్ట్ రైలు చిన్నచిన్న స్టేషన్‍లలో ఆగలేదు. ఒక గంటకు పైగా ప్రయాణించి ఒక పెద్ద స్టేషనులో ఆగింది. అది మధ్యాహ్న సమయం. భోజనాల వేళ కావటం మూలాన బండి ఆగేసరికి ఎవరికి వారు పక్క వాళ్ళు అప్పన్నను రైల్వే పోలీసుల దగ్గరకు తీసుకుని వెళతారు అనుకున్నారు. వాళ్ళు భోజనాలు తెచ్చుకుని బండి ఎక్కేసరికి బండి కదిలింది. అప్పన్న అలా ఓ పక్కన టాయిలెట్‍ల దగ్గర పడి అలానే వున్నాడు.

        అప్పన్న అక్కడే వుండటం గమనించిన ఆ కంపార్ట్‍మెంట్ జనం ’అయ్యో, అయ్యో ఈ పిల్లాడు ఇక్కడే వున్నాడే. ఎవరూ తీసుకెళ్ళి పోలీసులకు అప్పజెప్పలేదే’ అని బాధ పడ్డారు. బాగా జాలిగల ఒకాయన తమ కోసం తీసుకున్న భోజనం పొట్లాలలో ఒకటి అప్పన్న దగ్గర పెట్టి అప్పన్న మొఖం పై నీళ్ళు జల్లి లేపాడు. కూర్చుని మళ్ళీ నీరసంగా ఏడుస్తున్న అప్పన్నను ’అన్నం తిను. వచ్చే స్టేషన్‍లో మీ నాన్న వచ్చి తీసుకెళతాడు’ అని ఓదార్చాడు. నాన్న వస్తాడనే ఆశకు అప్పన్న కాస్త శాంతించాడు. పాకెట్‍లో వున్న అన్నం కాస్త తిన్నాడు. బెక్కుతూ అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు.

        వాడిని మాట్లాడించాలని చూసిన జనానికి ఏమీ సమాధానం చెప్పలేదు. అలా బెక్కుతూనే వున్నాడు. వాడి కళ్ళు వచ్చే స్టేషన్ కోసం, అక్కడ వాడిని ఇంటికి తీసుకెళ్ళడానికి వేచి వుండే వాళ్ళ నాన్న కోసం వెతుకుతున్నాయి.

        సాయంత్రం అయేటప్పటికి బండి మళ్ళీ ఆగింది. అప్పన్నను తీసుకుని వెళ్ళి ఇద్దరు ప్రయాణీకులు ప్లాట్‍ఫారం పై లాఠీ పట్టుకుని నించున్న రైల్వే పోలీసుకి అప్పగించారు. స్టేషన్ కు వచ్చి రిపోర్టు రాసి ఇమ్మంటే ’మా కేమి తెలియదు’ అని చెప్పి వెళ్ళిపోయారు. 

        అప్పన్న చేయి పట్టుకుని, రిపోర్టు ఇవ్వకుండా వెళ్ళిపోయిన ప్రయాణీకులను తిట్టుకుంటూ " ఏరా, నా లాఠీ అంత లేవు, ఇంటినుంచి పారిపోతావా" అంటూ వాడి జేబులు వెతికి మెడలో గొలుసులు చేతి వేళ్ళకు ఉంగరాలు వున్నాయేమొ అని చూసాడు. ఏమీ కనబడక ’ దొంగ రాస్కెల్స్, ఈడి వొంటి మీదయన్నీ ఒలిచేసి పండు తినేసి తొక్క పడేసినట్లు ఈడిని నా మీద పడేసిపోయారు’ అని మళ్ళీ తిట్టుకున్నాడు. వాళ్ళ మీద వచ్చిన కోపాన్ని అప్పన్న మీద చూపిస్తూ "పదరా" అంటూ బరబరా లాక్కుని స్టేషన్ కి తీసుకెళ్ళాడు. ఆ పోలీసు మొరటి ప్రవర్తనకు నాన్న కనబడక పోవటం తోడై అప్పన్న మళ్ళీ బిగ్గరగా ఏడవసాగాడు.

        అప్పన్న ఏడుపు విని స్టేషన్‍లో నుంచి హెడ్డు కానిస్టేబులు డేవిడ్ వచ్చాడు. మల్లయ్య చేతినుంచి తన చేతిని విడిపించుకోవడనికి గింజుకుంటున్న అప్పన్నను చూడగానే పరిస్తితి అర్ధమయింది. ’ఈ మల్లయ్య కి ఈ రోజు కిట్టుబాటు అయినట్లు లేదు. ఆ ఘోష అంతా ఈ పిల్లాడి మీద చూపిస్తున్నాడు’ అనుకున్నాడు.

         "మల్లయ్యా, ఆ అబ్బాయిని ఇటు తే" అని గట్టిగా చెప్పి, అప్పన్నను తనతో లోపలికి తీసుకెళ్ళాడు. అతనిని ఒక బల్ల మీద కూర్చోపెట్టి ఒక టవల్ తో మొఖాన్ని తుడిచి " ఏడవకు బాబూ, నీకేమి కాదు" అని అనునయంగా చెప్పాడు. పక్కన వున్న వేరే కానిస్టేబుల్ తో చాక్లెట్లు తెమ్మని చెప్పాడు. మల్లయ్య మొరటుతనంతో బెంబేలెత్తిపోయిన అప్పన్నకు డేవిడ్ ప్రేమగా పలకరించే సరికి కాస్త భయం తగ్గింది.

        వాడిని బుజ్జగించి, లాలించి డేవిడ్ అసలు విషయం తెలుసుకున్నాడు. తన పేరు అప్పన్న అని, నాన్న పేరు నాన్న అని , అమ్మ పేరు అమ్మ అని తప్ప ఇక ఎవరి పేరు తెలియని వాడిని ఏ ఊరి వాడో ఎవరికి చెందిన వాడో ఎలా కనుక్కోవడం. డేవిడ్ కి ఏమీ పాలుపోలేదు.

        అటువంటి సమయాల్లో ఎప్పుడూ తను చేసే పనే అప్పుడూ చేసాడు. శరత్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. శరత్ ప్లాట్‍ఫారం పిల్లల కోసం ఒక ఆశ్రమం నడుపుతున్నాడు. అది మామూలు ఆశ్రమాల కంటే భిన్నంగా వుంటుంది. శరత్ తన ఆశ్రమాన్ని అందులోని పిల్లల ఆధ్వర్యంలోనే నడిపిస్తాడు. తనను తాను ఆశ్రమ సేవకుడిగా భావించుకుంటాడు. ఆశ్రమంలో పిల్లలు తమకు శరత్ ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని భాధ్యత గా తీసుకుని అవసరమైనప్పుడు శరత్ సూచనలను పాటిస్తూ ఎంతో సమర్ధవంతంగా నడుపుతున్నారు.

        శరత్ తన ఆశ్రమం లో చేరిన పిల్లలను వారి వారి ఇళ్ళకి చేర్చటం పై ప్రత్యేక శ్రద్ద చూపుతాడు. అందుకే శరత్‍ని రమ్మని అప్పన్నను అతనికి అప్పగించాడు.

        శరత్ వెంట వెళ్ళిన రెండు రోజుల వరకు అప్పన్న ఏడుస్తూనే ఉన్నాడు. శరత్ ఎంత ప్రయత్నించినా వాడి పేరు తప్ప మరే వివరాలు కనుక్కోలేకపోయాడు.

        ఒక వారం గడిచాక అప్పన్న ఆశ్రమ వాతావరణానికి కాస్త అలవాటు పడ్డాడు. తక్కిన పిల్లలతో ఆట పాటలలో కలవనారంభించాడు. అటువంటి సమయంలో ఒక సారి శరత్ అప్పన్నను గమనించి దగ్గరకు చేరబిలిచి అప్పన్న పాడే సినిమా పాటను మళ్ళీ పాడించుకుని కాసేపు మాట్లాడి వెళ్ళాడు.

        తర్వాత డేవిడ్‍కి ఫోన్ చేసి అప్పన్నను ఇంటికి చేర్చడానికి తనకు అవసరమైన సమాచారం రైల్వే పోలీసుల ద్వారా తెలుసుకొని చెప్పమని అర్ధించాడు. డేవిడ్ తన వంతు సాయం చేసాడు.

        శరత్ ఒక రోజు ఉదయాన్నే ఆశ్రమం నుంచి అప్పన్నను తీసుకుని బయలుదేరాడు. అమ్మానాన్నల దగ్గరకు తీసుకుని వెళతానని అప్పన్నకు చెప్పాడు. అప్పన్న సంతోషానికి అవధులు లేవు. ఆశ్రమంలోని పిల్లలంతా కూడ ఎంతో సంతోషంతొ అప్పన్నకు వీడ్కోలు ఇచ్చారు. వాళ్ళ ఉత్సాహం చూసి శరత్ తన ప్రయత్నం ఫలించాలని ఆ సర్వాంతర్యామిని మనసారా ప్రార్ధించాడు.

        అప్పన్నను రైల్వే స్టేషన్ కు తీసుకునివెళ్ళి తనతో పాటు రైలు ఎక్కించాడు. డేవిడ్ రైలు దగ్గరకు వచ్చి అప్పన్నకు చాక్లెట్లు ఇచ్చాడు. ఆశ్చర్యం ఏమంటే అప్పన్న కు వీడ్కోలు ఇవ్వడానికి చాక్లెట్లు తీసుకుని మల్లయ్య కూడా వచ్చాడు.  

        రైలు బయలుదేరాక ప్రతి స్టేషన్‍ను వింతగా చూడసాగాడు అప్పన్న. కాలం చాలా మెల్లగా నడిచింది ఇద్దరికి.

        చివరకు శరత్ ఒక స్టేషన్‍లో అప్పన్నను దించాడు.

        స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో మాట్లాడి అప్పన్నను ఎక్కించి  తను కూడా కూర్చుని "అప్పన్నా ఇదే మీ ఊరు. ఇక మీ ఇల్లు ఎక్కడ వుందో గుర్తుపట్టడం నీ వంతు. సరేనా" అని చెప్పాడు. ఆటో బయలుదేరింది.

        అప్పన్నకు ఒళ్ళంతా కళ్ళు అయిపోయాయి. ప్రాణమంతా కళ్ళలోకి తెచ్చుకుని ఆటో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. శరత్ కూడ ఎంతో ఉద్విగ్నతను అనుభవిస్తున్నాడు.

        అప్పటికే చీకటి పడిపోయింది.

        ఆ ఊరు మరీ అంత పెద్దది కాదు. వీధి దీపాలు అక్కడక్కడ వెలుగుతున్నాయి. దారి పొడుగునా రోడ్డు పై చీకటి వెలుగులు అప్పన్న జీవితంతో దోబూచులాడుతున్నట్లు ఉన్నాయి.

        ఆటో శరత్ చెప్పిన చోటు చేరుకుని ఆగింది. శరత్ కిందకు దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి అప్పన్నను కూడా దిగమన్నాడు. అప్పన్న కిందకు దిగి ఒక సారి చుట్టూ చూసాడు. ఆ పరిసరాలు చూడగానే వాడి కళ్ళు మెరిసాయి. మొఖం నిండు చందమామలా వెలిగింది. శరత్ చేయి పట్టి లాగుతూ వడి వడిగా నడిచాడు.

         ఎదురుగా ’జయలక్ష్మి’ సినిమా హాలు వాడిని చిరకాల మిత్రుడిలా చేతులు చాచి పిలుస్తున్నట్లుంది.

        గబగబా నడుస్తూ ఒక ఇంటి ముందుకి వెళ్ళి " అమ్మమ్మా", అని పిలిచాడు. ఒక మధ్యవయస్కురాలు బయటకు వచ్చి చూసి అప్పన్న కనబడగానే ఆనందం పట్టలేక పరుగున వచ్చి వాడిని కావలించుకుని శోకాలు పెట్టడం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వాళ్ళు అప్పన్న తల్లిదండ్రులకు సమాచారం చేరవేసారు. చూస్తుండగానే పెద్ద గుంపు తయారయిపోయింది అక్కడ. అప్పన్న తల్లిదండ్రులు కూడ వచ్చారు. అప్పన్నను ముద్దులాడారు. తర్వాత ఇద్దరూ శరత్ కాళ్ళపై పడ్డారు. " ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మా ప్రాణాలు కాపాడాడు. మీ ఋణం ఎలా తీర్చుకోగలం" అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

        శరత్‍కి అప్పన్నను వాడి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చగలిగానని ఎంతో తృప్తి కలిగింది.

                                        *      *      *     

        "శరత్ కి అప్పన్న వాళ్ళ ఊరిపేరు ఎలా తెలిసింది" అడిగాడు మల్లయ్య.

        "పోలీసువయిండి ఆ మాత్రం  తెలుసుకోలేవా? అప్పన్నకి వాడిపేరు కాకుండా మరొక్క పేరు మాత్రం తెలుసు. అది వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి సినిమా చూసే సినిమా హాలు ’జయలక్ష్మి’ పేరు. ఆ విషయం వాడు సినిమా పాటలు పాడుతుంటే చూసిన శరత్, మాటల్లో పెట్టి వాడి నుంచి గ్రహించాడు.  అది రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర వుందనే విషయం తెలిసాక సమస్య పరిష్కారం తేలికయింది. ఏ స్టేషన్ దగ్గరి లెవెల్ క్రాసింగ్ పక్కనే ’జయలక్ష్మి’ అనే సినిమా హాలు వుందో కనుక్కోవడమే మేము వెదికిన పరిష్కారం" వివరంగా చెప్పాడు డేవిడ్.

        " ఎంతయినా అప్పన్న అదృష్టవంతుడు. తిరిగి తన తల్లిదండ్రులను చేరుకోగలిగాడు" అన్నాడు మల్లయ్య కళ్ళు తుడుచుకుంటూ.

                                        *      *      *