ఆ స్ఫూర్తి !

ఆ స్ఫూర్తి !

స్ఫూర్తి !

                                                                             

                                                                                                9491974648

 

 

 

 

 

నల్లని పర్బాతీ నదీ జలాలు గుండ్రంగా నునుపు దేరిన బండరాళ్లను ఒరుసుకుంటూ వేగంగా ప్రవహిస్తోంటే రాపిడికి తెల్లగా ఏర్పడుతూన్న నురుగులు చూడ్డానికి ఎంతో బాగున్నాయి. గలగలా సంగీతపు ధ్వని చేసే నిర్మలమైన నీటి ప్రవాహం, దూరంగా నీలిమేఘపు పైట ధరించినట్టున్న ఎత్తైన రోటాంగ్ పర్వత శ్రేణులు, కమనీయంగా ఉంది అక్కడి దృశ్యం.

 

ఒక బండరాయి మీద కూర్చుని కాళ్ళు రెండూ వేగంగా ప్రవహించే నదీ జలాల్లో ఆడిస్తూ “ఎంత బాగుందిరా ఇక్కడ?” అన్నాడు వెంకట్. వీచే చల్లగాలిని హాయిగా ఆస్వాదిస్తున్నాడతను. అన్వర్, తన్మయ్ అవునన్నట్టు తలూపారు పరధ్యానంగానే. తెల్లదనం కలగలిసిన లేత నీలం రంగు కొండ శిఖరపు అందాలను చూసి ఆనందించడంలో వాళ్ళిద్దరూ నిమగ్నమయి ఉన్నారు.

 

ఒక్క రాజేష్ మాత్రమే ముఖం గంటు పెట్టుకుని గుర్రుగా చూసాడు. అతనికి ప్రాంతానికి రావడం ససేమిరా ఇష్టం లేదు. లష్కరే తోయిబా దళాలు ఎక్కువగా సంచరించే ప్రాంతం అని దారిలో ఎదురైన వాళ్ళెవరో చెపితే అప్పటినుంచీ వెనక్కి వెళ్ళిపోదామని ఒకటే గొడవ. అయితే ఇంతదూరం వచ్చి ఇక్కడి అందాల్ని చూడకుండా వెళ్ళిపోవడం ఏమిటి? అన్నది వెంకట్ ప్రశ్న.

 

“జోగినీ జలపాతం చూసి వచ్చాం, హంప్టా లోయలోకి దిగి వచ్చాము. హిడింబాదేవి గుడిలో దేవతని దర్శించుకుని వచ్చాము. ఇన్ని చోట్ల ఎదురు కాని ప్రమాదం ఇక్కడే ఎందుకుంటుంది? అర్ధం లేని భయం కాకపోతే!” అదీ వెంకట్ ధీమా…

 

తనివి తీరా అక్కడి దృశ్యాల్నిఆస్వాదించాకా “రండిరా పోదాం… ఇంకా రహాలా వాటర్ ఫాల్ ఒకటుంది. అది కూడా చూసేస్తే ఇక మనూరికి వెళ్ళి పోవచ్చు… నడవండి” అంటూ వెంకట్ ప్రవహించే నీటిలో ఎగుడు దిగుడుగా పేర్చబడినట్టు ఉన్న గుండ్రటి బండరాళ్ళని దాటుకుంటూ తీరం వైపు నడిచాడు. మిత్రులు ముగ్గురూ అతన్ని అనుసరించారు. అందరికన్నా వెనకగా రాజేష్ నడుస్తున్నాడు.

 

ఇంతలో ఉన్నట్టుండి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. క్షణాల వ్యవధిలోనే అవి భీకరమైన అరుపులుగా మారిపోయాయి. మెరుపు వేగంతో ఎవరో కొందరు పరిగెడుతున్నట్టు నేల మీద అడుగుల చప్పుడు. వెనకాల ఎవరో వెంట తరుముతున్నట్టు బూట్ల చప్పుడు. అప్పుడప్పుడూ తుపాకీ పేలుతున్న శబ్దాలు చెవుల్లో చిల్లులు పొడుస్తున్నాయి. ‘భాగ్ భాగ్ దుష్మనీ కా సైతాన్ ఆయా భాగ్’ అని కొందరు అరుస్తూ పారిపోతూంటే, ‘పకడో యార్ పకడో, మారో సాలే కో’ అని మరి కొందరు వెంట తరుముతూ అరుస్తున్నారు. వాళ్ళ అరుపులతో ప్రాంతమంతా దద్దరిల్లి పోయింది. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ప్రకృతి మాత బెంబేలెత్తి చూస్తున్నట్టు తోచింది.

 

 

మిత్రులు నలుగురూ నిశ్చేష్టులై చూస్తుండి పోయారు. ఏమి చేయడానికీ పాలుపోలేదు వాళ్ళకి. “అరే భాయ్ క్యా దేఖ్ రహే…. ఛలో ఛలో… వో సబ్ లష్కర్ కా మిలిటెంట్స్ హై…” తుపాకి పట్టుకుని పరిగెడుతూనే వాళ్ళని హెచ్చరించాడొక మిలిటరీ దుస్తులు ధరించిన వ్యక్తి.

 

నలుగురు మిత్రులకీ గుండెల్లో ఫిరంగులు మోగాయి. నిలువు గుడ్లేసుకుని చూస్తుండి పోయారు. వెంకట్ ముందుగా తెలివి తెచ్చుకుని రండిరా పోదాం అంటూ హడావుడిగా దౌడు తీసాడు. మిగిలిన ముగ్గురూ అదే దిక్కుకి అసంకల్పితంగా పరుగెత్తారు. ఇంతలో మరో సారి తుపాకీ పేలిన శబ్దం. ఈ సారి చాలా దగ్గరిగా. వెంటనే దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం. ఎక్కడినుంచో కాదు. వెనక నడుస్తున్న తమ మిత్రుడు రాజేష్ నోటి నుంచే.

* * *

 

మోణింగ్ స్టార్ డెవలప్ మెంట్ అనే పేరు గల నాన్ ప్రాఫిట్ సంస్థ నడుపుతున్న హాస్పిటల్ అది. ఆఫ్ఘనిస్తాన్ లో వైద్య సేవలందిస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్రస్తుతం తన కార్యకలాపాల్ని కులు మనాలి, సిమ్లా ప్రాంతాల్లో కూడా ప్రారంభించింది. టెర్రరిస్టుల బారిన పడి గాయాల పాలైన వారికి సేవలు అందించేందుకు నడపబడుతున్న హాస్పిటల్ అది. అక్కడ అందరూ వాలంటరీగా సేవా భావంతోనే పని చేస్తారు.  

 

ఒక బెడ్ మీద రాజేష్ పడుకుని ఉన్నాడు. బల్లమీద మిత్రులు ముగ్గురూ కూర్చుని ఏవో చర్చించుకుంటున్నారు. “మన రాజేష్ ఎంతయినా అదృష్టవంతుడురా. తుపాకీ గుండు భుజానికే తలిగింది. ఏ తలకో, గుండెకో తగిలి ఉంటే ఏమయ్యుండేదో ఊహించడానికే భయంగా ఉందిరా” అన్నాడు వెంకట్. మిత్రులు ఔనన్నట్టు తలాడించారు.

 

“ఒరేయ్…” ఉన్నట్టుండి బయటికి చూస్తూ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు వెంకట్. మిత్రులు ముగ్గురూ ఉలిక్కిపడ్డారు. మళ్ళీ ఏం ఉపద్రవం వచ్చిందో నని కంగారు పడ్డారు.

 

“అటు చూడండి…” అన్నాడు వెంకట్ దూరంనుంచి ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న ఒక యువకుడిని చూపిస్తూ. అన్వర్, తన్మయ్ ఏమిటన్నట్టు అటు తలతిప్పి చూసి ఆశ్చర్యంతో నోళ్ళు వెల్లబెట్టేసారు. రాజేష్ కూడా చూద్దామనుకున్నాడు కానీ నొప్పితో శరీరం సహకరించ లేదు.

 

“వాడు…. వాడు….. మన షణ్ముఖ్ లా లేడూ?”

 

“షణ్ముఖ్ లా ఏంట్రా? షణ్ముఖే…” అన్నాడు అన్వర్.

 

“అవును షణ్ముఖే. ఎంత మారిపోయాడు?”  అన్నాడు తన్మయ్ ఆశ్చర్యంగా చూస్తూ.

 

“ఏమిటి మన షణ్ముఖా…? వాడెప్పుడో చచ్చిపోయాడు కదరా?” నొప్పిని కూడా మరిచిపోయి ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్.

 

షణ్ముఖ్ కూడా దగ్గరికొచ్చాకా మిత్రులను చూసి అమితంగా ఆశ్చర్యపోయాడు. చిరునవ్వుతో పలకరించి ఫస్ట్ ఎయిడ్ సరంజామా తెచ్చిన సంచిలోంచి కాటన్ తీసి రాజేష్ చేతికి అయిన గాయం చుట్టూ శుభ్రంగా తుడిచి బేండేజ్ కట్టాడు.  

 

“నమ్మలేక పోతున్నాంరా.. నిన్ను మళ్ళీ చూస్తామనుకో లేదు. నువ్వు చనిపోయావనే అనుకుంటున్నారు మనూళ్ళో అందరూ” అన్నాడు వెంకట్.

 

“నాకు తెలుసు అలా అనుకుంటూ ఉంటారని. అయినా కావాలనే అజ్ఞాతంలో ఉంటున్నాను. మరో ఐదేళ్ళు ఇక్కడ ప్రమాదాల్లో గాయపడిన వారికి సేవ చేసి అప్పుడు మనూరు వద్దాం అనుకుంటున్నాను. ఈ లోగా మీరే నన్ను చూసేసారు” అన్నాడు షణ్ముఖ్.

 

“అసలు….” ఉత్సుకత ఆపుకోలేక ఏదో అడగబోయాడు అన్వర్… షణ్ముఖ్ అతన్ని వారించి “ఇక్కడెందుకులేరా అవన్నీ.. సాయంత్రం మా ఇంటికి రండి… భోంచేస్తూ మాట్లాడుకుందాం” అంటూ మరో వార్డ్ వైపు వెళ్ళిపోయాడు. మిత్రులు నలుగురూ అటే విభ్రమంగా చూస్తుండి పోయారు. 

 

“నమ్మలేక పోతున్నానురా” అన్నాడు తన్మయ్ అటే చూస్తూ. “నేను కూడా” అన్నాడు అన్వర్.

 

“రౌడీ వేషాలేస్తూ ఊరంతా బలాదూర్ తిరుగుతూ, ఎదురుపడిన అమ్మాయినల్లా ఆటపట్తిస్తూ ఏడిపించిన షణ్ముఖ్ ఎక్కడ?  పెద్దమనిషిలా మారిపోయిన వీడెక్కడ? ఆ మాట తీరు చూడండి… అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?” అన్నాడు వెంకట్.

 

ఏది ఏమైనా సాయంత్రం వాడి వివరాలన్నీ తెలుసుకోవలసిందే… అన్న నిర్ణయానికి వచ్చేసారు నలుగురూ.

 

ఐదు సంవత్సరాల క్రితం షణ్ముఖ్ ఉన్నట్టుండి ఊళ్ళో కనిపించడం మానేసాడు. అప్పటికే వాడు డబ్బు పడేస్తే వచ్చే అమ్మాయిల్తో కలిసి జులాయి వెధవలా తిరుగుతూ ఒకటి రెండు చోట్ల పట్టుబడినట్టు ఫ్రెండ్ సర్కిల్స్ లో కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మొరటు హాస్యం, కఠోరమైన కంఠస్వరం, ఎగతాళి చేసే మాటతీరు అతని పద్ధతి ఎవరికీ అంతగా నచ్చేది కాదు. ఫ్రెండ్ కాబట్టి తప్పక భరించే వాళ్ళందరూ. వాడు కనబడ్డం మానేసిన నాలుగు రోజుల తర్వాత వార్తాపత్రికల్లో హిమాచల్ ప్రదేశ్ లో టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల పేర్లు ప్రకటించారు. వాటిల్లో వీడి పేరూ చోటు చేసుకుంది. వీడు అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ ఎందుకు వెళ్ళాడో, ఎప్పుడు వెళ్ళాడో ఎవరికీ, ఆఖరికి వాడి ఇంట్లో వాళ్ళకి కూడా, తెలీదు. కానీ చనిపోయిన వార్త విని అందరూ బాధపడ్డారు. ఎంతయినా తెలిసిన వాడు, కలిసి చదువుకున్న వాడూ కద. అంతే. ఆ తర్వాత వాడి సంగతే అందరూ మరిచిపోయారు. మళ్ళీ ఇప్పుడే పునర్దర్శనం !

 

* * *

 

ట్రేతో టీ తీసుకు వచ్చిన ఒక అందమైన అమ్మాయిని చూపిస్తూ “నా భార్య, శుభాంగి” అని పరిచయం చేసాడు షణ్ముఖ్.

 

టీ అందుకో బోతూ నమస్కారం చేయబోయి ఆమె ముఖంలోకి చూసి ఉలిక్కి పడ్డాడు వెంకట్. ఉలికిపాటుని లోపలే దాచుకుని మర్యాద కోసం చిరునవ్వుతో పలకరించాడు. ఆమెని ఎక్కడ చూసాడో బాగా గుర్తుంది. ఆమె తమ ఊళ్ళో పేరు మోసిన వేశ్య కనకసుందరి కూతురు. తల్లి, కూతుళ్ళు రోడ్డు మీద నడుస్తుంటే అందరూ వింతగా చూస్తూ గుసగుసగా మాట్లాడుకునే వారు. ఆ అమ్మాయి ట్రేతో తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయాకా షణ్ముఖ్ ముఖంలోకి అనుమానంగా, జాలిగా తేరిపార చూసాడు వెంకట్.

 

“ఏమిటిరా అలా చూస్తున్నావు? దేశముదురు లాంటి వాడు వీడేమిటి ఇలా బుట్టలో పడ్డాడని ఆశ్చర్యపోతున్నావు కదూ?” అని అడిగాడు షణ్ముఖ్.

 

అన్వర్, తన్మయ్ టీ తాగుతూనే వాళ్ళ మాటలు వింటున్నారు.

 

“చెప్పాలంటే అదో పెద్ద కథ… అందుకే నిన్న చెప్పలేదు. ఇక్కడ తీరిగ్గా చెప్పొచ్చులే అని” అంటూ లేచి కిటీకీ కర్టెన్ లు జరిపి దూరంగా కనిపిస్తున్న మంచు పర్వతాల శిఖరాలని చూస్తూ నిలబడ్డాడు.

 

వెంకట్ కూడా లేచి టీ కప్పుతోనే నడిచి షణ్ముఖ్ దగ్గరగా వెళ్ళి వెనకగా నిలబడ్డాడు.

 

“నేనొక జులాయిని, తిరుగుబోతుని అని మీ అందరికీ తెలుసు. రెండు మూడు సార్లు రెడ్ హేండెడ్ గా పట్టుబడ్డానని కూడా తెలిసే ఉంటుంది. భయం భయంగా గడిపితే ఆశించిన థ్రిల్ ఉండడం లేదని అర్ధం చేసుకున్నాను. అందుకే కులూ-మనాలి ట్రిప్ వేసుకుని శుభాంగిని పదివేల రూపాయిలకి బేరమాడుకుని ఎవరికీ తెలీకుండా తీసుకుని వచ్చాను. ఖరీదైన లగ్జరీ హోటల్లో బస చేసాము. తప్పని తెలిసినా చేయకుండా ఉండలేని టెంపరితనం నాది. ఎవరేం అనుకుంటే నాకేం… నా జీవితం నా ఇష్టం … నా సుఖం నాది… ఇవే నా భావాలు అప్పట్లో.”

 

వెంకట్ తో పాటూ మిత్రులంతా శ్రద్ధగా వింటున్నారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           

 

“ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? నేను, శుభాంగి సైట్ సీయింగ్ కని సోలాంగ్ లోయలోకి వెళ్ళాము. అక్కడ పేరా గ్లైడింగ్ స్పోర్ట్ చాలా బాగుంటుందని విన్నాను. నాకు, శుభాంగికీ ఒక లాంగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఆకాశంలోకి ఎగిరి విహరించాము. ఆ క్షణంలో స్వర్గం ఎక్కడో లేదనిపించింది. అదిగో అక్కడ కనిపించే లోతైన అగాధాల నుంచి ఎత్తైన శిఖరాల వైపు నీలాకాశంలో చల్లగాలిలో పక్షుల్లా ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతూ లోయ అందాల్ని పైనుంచి చూస్తూంటే జీవితంలో ఇంతకన్నా ఆనందకర క్షణాలు ఉండవేమో అనిపించింది. ఇక నేను చచ్చిపోయినా ఫర్వాలేదు అన్న భావం క్షణంలో నాకెందుకు కలిగిందో తెలీదు కానీ సరిగ్గా అలాంటి క్షణమే మా కోసం ఎదురు చూస్తూ ఉందని ఊహించలేక పోయాను.

 

గ్లైడర్ ఫ్లైట్ టైమ్ అయిపోయాకా దిగి పోయి వచ్చేసాము. ప్రదేశాలు బాగున్నాయని మనుషులు సంచరించని ప్రాంతాల వైపు కాస్త దూరంగానే నడిచి వెళ్ళాము. కొంత దూరం నడిచాకా దూరంగా లోయ లోపలి వైపు కొంత దిగువన పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కలయికతో ఒక అందమైన గడ్డి పువ్వు శుభాంగి కళ్ళల్లో పడింది. చాలా అందంగా బాగుందది. మన వైపు దొరికే పువ్వు కాదది. “అది నాకు కావాలి” అని ముచ్చట పడి అడిగింది. ఇద్దరం వైపు నడిచాము. అయితే అది చేతికి అందేంత దగ్గరలో లేదు. నిలబడడానికి వీలైన రాతి అంచు మీద నిలబడి చేయి చాపితే అందీ అందనట్టు అంగుళం వ్యత్యాసంలో లోయ లోపలి వైపు ఉందది. మరీ ముందుకు వంగితే బేలెన్స్ తప్పి లోయలో పడిపోవడం ఖాయం.

 

శుభాంగి ముఖంలోకి చూసి “కావలసిందేనా?” అని అడిగాను. ఆమె మొహమాటం లేకుండా చెప్పింది, కావాల్సిందే అని. చుట్టూ చూసాను. నడిచి వెళ్ళడానికి ఒక పాదం పట్టేంత సన్నని మార్గం కనిపించింది. దాని వెంటే నడిచి ‘యూ’ ఆకారంలో దిగుతూ పోతే గడ్డిపువ్వు ఉన్న చోటుకు చేరుకోవచ్చనిపించింది. కానీ అది ప్రాణాలకే ప్రమాదం. చాలా లోతైన అగాథం అంచున ఉన్న సన్నని మార్గం అది. పట్టు కోసం మట్టి, రాళ్ళు కలిసిన నేల తప్ప మరేవీ లేవు. అయినా ఆడపిల్ల కోరిన పువ్వు ఇవ్వలేక పోతే అది మగతనానికే అవమానమని తోచి మొండిగా మార్గం వెంట నడిచాను.

 

అడుగులో అడుగు వేసుకుంటూ బేలెన్స్ కాసుకుంటూ ఎలాగో పువ్వు ఉన్న దగ్గరికి చేరుకున్నాను. కోసి పైకి విసురుదామనుకున్నాను. కానీ ఊపుకే నేను లోయలో పడిపోయినా పడిపోవచ్చు. అందుకే పువ్వుని జేబులో ఉంచుకుని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ పైకి రాసాగాను. ఒకచోట కాలికింది మట్టి జారి పట్టు తప్పబోయాను. గుండె ఝల్లుమంది. ఆ దెబ్బకి వళ్ళంతా చల్లబడిపోయింది. ఎలాగో తమాయించుకుని కష్టపడి పైకి వచ్చేసి పువ్వుని శుభాంగికి ఇచ్చాను. ఆమె కళ్ళు సంతోషంతో మెరిసాయి.

 

మెరుపు చూడగానే అంత వరకూ పడిన కష్టం అంతా మరిచిపోయాను. నచ్చిన ఆడదాని కళ్ళల్లో సంతోషపు మెరుపు కోసం ఎంతటి సాహసానికి పూనుకున్నా తప్పు లేదనిపించిందా క్షణంలో.

 

అయితే సంతోషం క్షణం సేపైనా నిలవలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వ్యక్తి పక్కనున్న పొదల మాటునుంచి మెరుపులా వచ్చి శుభాంగిని చుట్టుముట్టేసాడు. ఆమె కెవ్వుమని అరిచింది కానీ అరుపు నోరు దాటి బయటికి రాకముందే వ్యక్తి బలమైన చెయ్యి ఆమె నోటిని మూసేసింది. ఏం జరుగుతోందో నా మనసుకి అర్ధమయ్యేలోగానే పెద్ద శబ్దంతో నా తలమీద ఎవరో మోదారు. కళ్ళు బైర్లు కమ్మాయి. అంతవరకే గుర్తుంది నాకు.

 

మెలకు వచ్చేసరికి నేను ఒక పాడుబడిన ఇరుకు గదిలో గరుకు నేలమీద కూర్చుని, చేతులు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాను. ఆ గదిలో నలుగురు దున్నపోతుల్లాంటి భయంకరమైన వ్యక్తులు పొడవాటి గడ్డాలతో తెల్లని లాల్చీ పైజమాల్లో ఉన్నారు. నా సంగతి మీకు తెలుసుకదా? ఎవరితోనైనా కలబడితే పది మందిని ఒకే సారి అల్లంత దూరం ఈడ్చుకు పోగల సత్తా నాది. అలాంటిది వీళ్ళల్లో ఒక్కొకడూ నాలాంటి ఇరవై మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించేలా ఉన్నారు. కళ్ళల్లోకి చూస్తేనే జ్వరం వచ్చేంత కర్కశంగా ఉన్నారు. తలమీద తగిలిన దెబ్బకి భరించలేని నొప్పి వస్తోంది. నా ఎదురుగా శుభాంగిని కూడా పెడరెక్కలు విరిచి తాళ్ళతో కట్టేసి కూర్చో బెట్టారు. అందమైన ఆమె ముఖం వాడిపోయి దుఃఖంతో ఉంది. పెదాలు చిట్లి రక్తం కారుతుందంటే వాళ్ళామెను రేంజిలో హింసించి ఉంటారో అర్ధమైంది.

 

మాటల్లో నాకు తెలిసిందేమిటంటే వాళ్ళు లష్కరే తోయిబా మిలిటెంట్లనీ, ఢిల్లీలో బందీగా చిక్కిన తమ నాయకుడిని విడిపించడం కోసం మమ్మల్ని కిడ్నాప్ చేసారని. నాయకుడిని విడిచిపెట్టకపోతే మా యిద్దరినీ వాళ్ళు చంపేస్తారని. ప్రభుత్వాధికారులతో ఫోన్లో సంప్రదించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపేస్తామని బెదిరించడానికి తుపాకులు మా తలలకి తాకించి మరీ మాట్లాడుతుంటే  నాకు పై ప్రాణాలు పైనే పోతూ ఉండేవి. అనవరంగా వచ్చి చిక్కుకున్నామా అనిపించింది. శుభాంగి కోరిన పువ్వు వల్ల ట్రాప్ లో ఇరుక్కున్నాము. అయినా ఆమె ఎందుకో మీద కోపం కలగ లేదు.

 

రకరకాల ప్రశ్నలు నా మనసులో. ప్రభుత్వం టెర్రరిస్ట్ ని వదిలిపెట్టడానికి ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకోక పోతే? మా ఇద్దరికీ అవే ఆఖరి ఘడియలు కావచ్చేమో. జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు అనుభవించిన కొన్ని నిముషాల్లోనే అత్యంత భయంకరమైన అనుభవంలోకి వచ్చి పడ్డాము. జీవితం ఎంత చిత్రమైనది? ఎప్పుడూ గుర్తుకు రాని మా అమ్మ, నాన్న, అన్నయ, చెల్లి అందరూ గుర్తొచ్చారు. వాళ్ళ మధ్య పెరిగిన సురక్షితమైన, ఆనందకరమైన జీవితం గుర్తొచ్చింది. దొరక్కుండా పోయాకా కానీ  దేని విలువ ఏమిటో తెలిసి రాదేమో !

 

లష్కరే తోయిబా సంస్థ ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. అందుకే ప్రాణాల మీద ఆశ పూర్తిగా వదిలేసుకుని చనిపోడానికి మానసికంగా సిద్ధమైపోయాను. శుభాంగి మనసులో ఏమి ఆలోచనలు చెలరేగుతున్నాయో తెలియడం లేదు కానీ నిస్సత్తువగా కూర్చుని ఉంది.

 

ఇంతలో ఉన్నట్టుండి వాళ్ళలో ఒకడు బయటికి వెళ్ళి చూసి వచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు. దాంతో మిగిలిన ముగ్గురూ అలెర్ట్ అయిపోయారు. ఒకడు ద్వారం దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ గట్టిగా ఏదో చెప్పాడు. బయటి నుంచి కూడా ఏవో మాటలు వినిపించాయి. ఆర్మీ దళాలు చుట్టు ముట్టినట్టుగా అర్ధమయ్యింది. నాకు ధైర్యం తెచ్చుకోవాలో, భయపడాలో బోధపడలేదు. ఏదైనా తేడా జరిగితే మా శరీరాలు తుపాకీ తూటాలతో జల్లెడలుగా మారిపోవడం ఖాయం అని తెలుసు. గుండె వేగం హెచ్చవడం మొదలయింది.

 

ఇంతలో ఒకడేదో సూచన చేసాడు. దాంతో మరొకడు నా జబ్బ పట్టుకుని ఈడ్చుకెళుతూ విరిగిపోయినట్టున్న రాతి మెట్ల మార్గం గుండా టాప్ మీదకి కి తీసుకు పోయాడు. అడవి మధ్యలో మానవ సంచారం లేని ఒక కొండ మీద ఉన్న చిన్న గుహ అని అర్ధమైంది. చుట్టూ సుమారు ఇరవై మంది సైనికులు తుపాకులు గురిపెట్టి గుహ చుట్టూ రౌండప్ చేసి ఉన్నారు. వాళ్ళని ముందుకు రాకుండా ఉంచడానికే వాడు నన్ను పైకి తీసుకు వచ్చాడాని అర్ధమైంది.

 

“ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేసినా వీడిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను” అంటూ అరిచాడు నన్ను లాక్కొచ్చిన టెర్రరిస్ట్. తుపాకి చివరనున్న కత్తిని నా గొంతుకకి ఆనించి ఉంచాడు. నా ఊపిరి ఆగిపోయినట్టయింది. టెర్రరిస్ట్ లు వద్దని వారిస్తూ ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

 

దాదాపు పావుగంట సేపు వాళ్ళ మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఇంతలో నా భుజం మీద ఒక చేయి పడింది. ఆ స్పర్శ అంతకు ముందులా కాకుండా ఎంతో ఆత్మీయంగా ఉంది. గొంతుకకి ఆనించి ఉన్న కత్తి ఇప్పుడు లేదు. ఆశ్చర్యంతో పక్కకి తిరిగి చూసాను. మిలిటరీ దుస్తుల్లో ఆజాను బాహుడైన ఒక సైనికుడు నాకు చాలా దగ్గరగా నిలబడి నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆశ్చర్యంతో టెర్రరిస్ట్ కోసం వెదికాను. వాడు ఎప్పుడు పడిపోయాడో, నేల మీద స్పృహ తప్పి మాట, పలుకు లేకుండా బోర్లా పడి ఉన్నాడు. అంత బలవంతుణ్ణీ ఎలాంటి శబ్దం లేకుండా ఒకే ఒక్క దెబ్బతో పడగొట్టిన యోధుడి వీరత్వానికి మనసులోనే ప్రణామాలు అర్పించాను. ఆ సమయంలో అతను మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడిలా కనిపించాడు. అంత వరకూ ఉన్న ప్రాణ భయం పోయి స్థానంలో జీవితం మీద ఆశ మళ్ళీ చిగురించింది.

 

“భయపడకు మేన్. వీడు నిన్నిలా పైకి తీసుకు రావాలనే మేమలా రౌండప్ చేసాము” అన్నాడు. కింద ఉన్న సైనికులు ఇంకా తుపాకులు మా వైపే గురిపెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే పైన ఉన్న టెర్రరిస్ట్ కుప్పకూలి పోవడం కిందనున్న వాళ్ళకి తెలియకూడదని వాళ్ళ ఉద్దేశ్యం అని అర్ధమైంది. తెలిస్తే శుభాంగి ప్రాణాలు నిలువవు మరి. ఎంత గొప్ప స్ట్రాటజీ?

 

అతను మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. “వెనక వైపు లోయ ఉంది కాబట్టి అటు ఎవరూ రాలేరని అనుకుని ఉంటారు. కానీ ఇలాంటి లోయలు నాకో లెక్కా? సీల్ టీమ్ సిక్స్ లో నాలుగేళ్ళుగా గొప్ప గొప్ప ఆపరేషన్ లు నిర్వహించిన వాణ్ణి. నాకు ఇవన్నీ కొట్టిన పిండి” అన్నాడు. వెంట తెచ్చుకున్న తాడు నాతో కలుపుకుని తన నడుము చుట్టూ కట్టుకున్నాడు.  

 

* * *

 

“సీల్ టీమ్ సిక్సా? అంటే?” వెంకట్ అడిగాడు. షణ్ముఖ్ చెప్తున్న అనుభవం ఎంతో ఆసక్తి కరంగా ఉంది అతనికి.

 

“సీల్ అంటే స్పెషల్ అట. అతనే చెప్పాడు. స్పెషల్ టీమ్ సిక్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ కి చెందిన నేవల్ స్పెషన్ మిషన్ యూనిట్. రెస్క్యూ ఆపరేషన్స్ లో అందె వేసిన వీర యోధులు ఉండే టాస్క్ ఫోర్స్ టీమ్ అది. ప్రపంచం నలుమూలలకీ తమ సాహసిక సేవల్ని అందిస్తూ ఉంటారట. బిన్ లాడెన్ ని అంతమొందించింది కూడా టీమ్ లోని సభ్యులేనట.

 

* * *

 

తాడు సహాయంతో పాడు బడిన ఇంటి వెనుక వైపు లోయలోకి జారి నన్ను అక్కడ ఒక చెట్టు చాటున కూర్చో బెట్టాడు. తిరిగి అదే తాడు సహాయంతో మళ్ళీ పైకి ఎగబాకాడు. లోపల ముగ్గురు టెర్రరిస్టులకు బందీగా శుభాంగి ఉంది. ఆమెను తీసుకు రావడానికే అతను వెళుతున్నాడు. ఎంత సాహసం? కరడు గట్టిన ముగ్గురు సాయుధ టెర్రరిస్టుల్ని ఒంటరిగా ఎదుర్కోడానికి ఎంత దమ్ము కావాలి?

 

ఆమెని కాపాడడానికి ఏం స్ట్రాటజీ వేసాడో తెలీదు కానీ గంట సేపటి తర్వాత శుభాంగిని కూడా తాడు సహాయంతో కిందకి జారి తీసుకు వచ్చేసాడు. తాడు విడిపించి ఆమెని ఒక బండరాయి మీద కూర్చోబెట్టాడు.

 

“ఆ టెర్రరిస్టులు….” అంటూ అర్ధోక్తిలో అడిగాను.

 

“ఏం భయం లేదు మేన్. అందరినీ మట్టి కరిపించేసాను. మా వాళ్ళకి అప్ప జెప్పేసాను. వాళ్ళు తీసుకు పోతున్నారులే” అన్నాడతను విజయగర్వంతో నవ్వుతూ.

 

అప్పటికి నా మనసు కుదుట పడింది. ఎంత గొప్ప ప్రాణాపాయంనుంచి బయట పడ్డామో ఊహించుకుంటేనే ఇప్పటికీ వొళ్ళు జలదరిస్తుంది.

 

“మెనీ మెనీ థేంక్స్.… మీరెవరో కానీ దేవుడిలా వచ్చి మా ఇద్దరినీ కాపాడారు. మాకు ప్రాణభిక్ష పెట్టారు” అన్నాను కృతజ్ఞతగా.

 

“మరి… అంత పెద్ద సహాయం చేసిన నాకు చిన్న సహాయమైనా చేయలేవా?” అని అడిగాడు నవ్వుతూనే.

 

“మీకు సాయమా? చెప్పండి ఏం చేయాలి?” అన్నాను.

 

అప్పుడు అతను వెనక్కి తిరిగాడు. అది చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక పెద్ద కత్తి అతని వెన్నుపూసలోంచి గుండెలోకి గుచ్చుకుపోయి ఉంది. రక్తం చారికలు కట్టి యూనిఫామ్ మీద గడ్డకట్టుకు పోయి ఉంది. “కత్తి బలంగా దిగేసారు బ్లడీ స్కౌండ్రల్స్. కొద్దిగా సాయం పట్టి బయటికి తియ్యి మేన్. రక్తం చిమ్ముతుంది. ముందుగానే చొక్కా విప్పి రెడీగా ఉంచుకో కట్టు కట్టాల్సి వస్తుంది” అన్నాడు. నేను వొణికే చేత్తో కత్తి లాగడానికి ప్రయత్నించాను. ప్రయత్నించే కొద్దీ అతని బాధాకరమైన అరుపు వర్ణనాతీతమైంది. చివరికి ఎలాగో లాగేసి పడేసాను. విప్పి ఉంచిన నా చొక్కాని గాయం దగ్గర నుంచి చుట్టూ బిగించి కట్టాను. ఒక్క చొక్కాతో రక్తం ఆగక పోవడంతో నేను చెప్పకుండానే శుభాంగి తన పైట తీసి అందించింది.

 

“గుండెలోకి దిగబడినట్టుంది. ఊపిరి అందడం లేదు. బహుశా నేను బ్రతకనేమో. అయినా ఏం ఫర్లేదు. మీరిద్దరూ త్వరగా ఇక్కడినుంచి వెళ్ళిపోండి” అన్నాడు.

 

అతని అవస్థ చూసి నాకు కళ్ళ నీళ్ళు చిప్పిల్లాయి. “మా ప్రాణాలు కాపాడ్డం కోసం…. మీ ప్రాణాలు…” అన్నాను. ఆ తర్వాతి మాటలు గొంతు గాద్గదికమవడంతో బయటికి రాలేదు.

 

“నిజమే. చాలా టఫ్ ఫైట్ జరిగింది. … “ ఒక్కో మాటా కూడ బలుక్కుని చెపుతున్నాడు. “…ఈ అమ్మాయిని చూడగానే చిన్నప్పుడే చనిపోయిన మా చెల్లి పెరిగి పెద్దయి ఉంటే ఇలాగే ఉంటుందేమో అన్న ఆలోచన కలిగింది. ఎలాగైనా కాపాడాలను కున్నాను. ఆ ప్రాసెస్ లో…. వెనకనుంచి పొడిచే వాణ్ణి చూసుకోలేక పోయాను….” అన్నాడు బాధగా మూలుగుతూ.

 

ఎవరో ఛెళ్ళున చెంప పగలగొట్టిన అనుభూతి కలిగింది నాకు. ఒకే అమ్మాయిని నేను చూసినప్పుడు కలిగిన భావానికీ, అతను చూసినప్పుడు కలిగిన భావానికీ ఎంతటి వ్యత్యాసం? సిగ్గుతో చితికి పోయాను.

 

“అయినా నా ప్రాణాలదేముంది మేన్… ఒంటరి పక్షిని. అమ్మలేదు, నాన్నలేడు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరూ లేరు. పెళ్ళీ పెటాకులు లేని ఒంటరి వాణ్ణి. నాలాంటి వాడు ప్రాణాలు వదిలేసినా నష్టం లేదు. నీలాంటి వాడిని కాపాడితే ఉపయోగం ఉంటుంది. మీ కోసం మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. మీ రాక వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి నాకన్నా మీరు బ్రతికి ఉండడమే న్యాయం. వెళ్ళు మేన్… బ్రతికున్నంత కాలం స్నేహితుణ్ణి గుర్తు పెట్టుకో చాలు… మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. పిల్లా పాపలతో హాయిగా బ్రతకండి. మీకు అబ్బాయి పుడితే నా పేరే పెట్టుకోండి. అన్నట్టు నాపేరు చెప్పలేదు కదూ…. శ్యాం సుందర్…సీల్ టీం సిక్స్ లో రిక్రూట్ మెంట్ కి అర్హత సంపాదించుకున్న ఏకైక భారతీయుణ్ణి…” అంతే అలాగే తల వాల్చేసాడు. మా కళ్ళ ముందే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృత్యువుని స్వీకరించడంలో కూడా న్యాయాన్యాయాలు బేరీజు వేయ గలిగిన మహనీయుడు వీరసైనికుడి తుది శ్వాస అక్కడితో ఆగిపోయింది. అతని అతి మంచితనం భరించలేక ‘తుచ్ఛమైన కోరికతో వేశ్యని వెంటబెట్టుకుని వచ్చిన ఒక అల్పుడిని నేను’ అని అతనికి అరిచి చెప్పేయాలనిపించింది. కానీ అప్పటికే అతను లోకాన్ని విడిచి పెట్టేసాడు.

 

నిస్వార్ధంగా ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడంలోనూ, చావు బ్రతుకుల్లో ఉన్న వారి ప్రాణాలు కాపాడ్డం లోనూ ఎంతటి సంతృప్తి లేకపోతే అతనలా ముక్కు మొహం తెలియని మా యిద్దరినీ రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం వదిలేసి ఉంటాడు? అదే ఆలోచన నా మనసుని చాన్నాళ్ళు తొలిచింది. ఇన్నాళ్ళూ నేను బ్రతికిన బ్రతుకు పేలవంగా, అర్ధరహితంగా కనిపించింది.

 

అందుకే అవతారం ఎత్తాను. టెర్రరిస్టులతో తలపడి యుద్ధం చేసి రక్షించడానికి నేను అతనిలా యోధుడిని కాను. అందుకే నాకు చేతనైన సేవా వృత్తిని చేపట్టాను. ఎంతో గొప్ప నమ్మకంతో అమాయకంగా ఇచ్చిన అతని దీవెన వృధా పోకూడదని తర్వాతి నెలలోనే హిడింబాదేవి గుడిలో అమ్మవారి సాక్షిగా శుభాంగిని పెళ్ళి చేసుకున్నాను. కనీసం పదేళ్ళయినా మా కోసం అతను ప్రాణాలర్పించిన ప్రాంతంలో టెర్రరిస్టుల బారిన పడిన వారికి సేవలు చేస్తే కానీ మనూరికి రాకూడదని బలంగా నిశ్చయించుకున్నాను. అతని ఆత్మకి శాంతి చేకూరాలంటే అదే సరైన నిర్ణయం అనిపించింది. అందుకే మాయమైపోయిన నేను మీకు మళ్ళీ కనిపించనిది.

 

* * *

 

అతని కథ విన్నాకా నలుగురు మిత్రుల మనసులు బరువెక్కాయి.

 

మరునాడు బస్ లో సిమ్లాకి బయల్దేరారు, తమ ఊరికి పోయే ట్రైన్ పట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. బస్ బయల్దేరుతుంటే సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన షణ్ముఖ్ తో చెప్పాడు వెంకట్..  “త్వరగా మనూరు వచ్చేయ్ షణ్ముఖ్… ఒక మహనీయుడి రాక కోసం మేమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. అంత వరకూ నువ్విక్కడ ఉన్నావన్న రహస్యాన్ని మాలోనే దాచుకుంటాము. ఆ సర్ ప్ఫ్రైజ్ ఏదో నువ్వే ఇద్దువు గాని మనూరికి” అన్నాడు వెంకట్ చేయి ఊపుతూ.

 

“అలాగే. తప్పకుండా” అని నవ్వుతూ చేతులూపాడు షణ్ముఖ్.

 

 

-- సమాప్తం