మొదటి అడుగు
మొదటి అడుగు

మొదటి అడుగు

                “మొదటి అడుగు..”

అతనికి చచ్చిపోవాలని ఉంది. సరయిన సమయం, అనువైన ప్రదేశం కోసం చూస్తున్నాడు. ట్రైను ఎవరితో నాకు సంభంధం లేదు అన్నట్లు దాని దారిన అది పరగెడుతోంది, గమ్యం చేరడం చేర్చడం తన బాధ్యత అన్నట్లు. అతను సిగ్గుతో ఎప్పుడో మానసికంగా చచ్చిపోయాడు. శారీరకంగా ఇప్పుడు చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. తనలాంటి పిరికివాడు బ్రతికి ఎవరికి ఉపయోగం. చిన్నప్పటి నుంచి అంతే, తన చేతిలో తాయిలం లాక్కున్నా , తను ఆడుకునే ఆటవస్తువు లాక్కున్నా ఏడుస్తు ఇంటికి పరిగెత్తుకొచ్చి అమ్మకి చెప్పేవాడు. ‘పిరికి సన్నాసి, ఎదిరించాలి, ఏడుస్తారా?’ అనేది తల్లి. సరే అని అన్నా తరువాత ధైర్యం ఉండేది కాదు.

క్లాస్ రూముల్లో ఎవరు బెదిరించి తన పేపర్స్ చూసి పరీక్ష రాసినా వారించాలని ఉన్నా మౌనంగా ఉండిపోయేవాడు. ఎవరైనా స్లిప్పులు రాసి తనమీదకి విసిరేసినా భయంతో బిక్కచచ్చిపోయేవాడు. అలా ఓసారి డిబార్ కూడా చేసారు. తర్వాత ఆ పరీక్ష మళ్ళి రాసి పాసయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగంలో లంచం తిసుకోవడం సహజం అని వొత్తిడి చేసినా ‘పట్టుబడితే’ అనే భయంతో తీసుకోలేదు. తన తోటివాళ్ళు తన కళ్ళముందే ఎదిగిపోతున్నారని తెల్సినా పిరికితనంతో చూస్తుండడం తప్ప ఎమీ చేయలేని పిరికితనం. ‘చేతకానివాడు’ అనే ముద్ర మౌనంగా భరించాడు.

ఎలాగో పోగేసిన డబ్బుతో హైద్రాబాద్లో ఓ ఫ్లాటు కోన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాదాన్ని అమ్మాలనుకోలేదు. పిల్లలకి ఉపయోగపడుతుందని అలా అట్టిపెట్టి ఉంచాడు. ఏ మూలకి ట్రాన్స్ఫర్ అయినా అప్పుడప్పుడు ప్లాటు చూసుకుని వెళ్లేవాడు. రియల్ ఎస్టేట్ కి రెక్కలు వచ్చినట్లుగా ఖాళీ ప్లాటులకి రేట్లు బాగానే పెరుగుతున్నాయి. కూతురు బి.టెక్ పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయిపోయింది. సంబంధాలు వస్తున్నాయి. కొడుకు ఇంకా చదువుతున్నాడు. ‘ముందు డబ్బు చేతిలో పెట్టుకుని సంబంధాలు చూడండి’ అని భార్య సలహ ఇవ్వడంతో తన ఫ్రెండుకి ఫోన్ చేసాడు, ఫ్లాటు అమ్మిపెట్టమని. రెండు రోజుల తర్వత ఫ్రెండు ఫోను చేసాడు.

“జోక్ చేస్తున్నావా! నీ ఫ్లాటు ఎప్పుడో అమ్మేసావంట కదా! “ అని.

“నా ఫ్లాటు అమ్మడం ఏంటి? ఎవరికి? “ ఆశ్చర్యంగా అడిగాడతను.

“మహంకాళికి... అక్కడ చాలా ఫ్లాట్లు అతను కోనుక్కున్నాడు. రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందట. మర్చిపోయావేమో... గుర్తు తెచ్చుకొ..” నిష్ఠూరంగా అన్నాడు స్నేహితుడు..

“మర్చిపోవడానికి అదేమన్నా అప్పా! నా ఫ్లాటు .. కష్టార్జితం.. అసలు మహంకాళి ఎవరు? ఆడా ? మగా? ..” తను ఆ పేరు ఎప్పుడూ విన్నట్లు కుడా గుర్తురాలేదు.

“ఏమో తెలీదు. నేను పార్టీని తీసుకెళ్ళి చూపిస్తుంటే వొకాయన వచ్చి చెప్పాడు..” 

ఫ్రెండు చెప్పింది విని మ్రాన్పడిపోయాడు. తనకే తెలీకుండా తన ఫ్లాటు ఎవరు అమ్మారో అర్ధం కాలేదు. అసలు మహంకాళికి అమ్మడం ఏంటి? పైగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందట. అతని వాలకం చూసి భార్య సలహ ఇచ్చింది. ‘అసలు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీ ఫ్రెండు పొరపాట్న ఎవరి ఫ్లాటో చూసి ఉంటాడు. వాళ్ళు వీళ్ళు ఎందుకు మీరే వెళ్ళి చూడండి. ‘ అనడంతో అతను రెండు రోజులు సెలవు పెట్టి హైద్రాబాద్ వెళ్ళాడు.

ఫ్రెండ్ తో కలసి తన ఫ్లాటు చూడ్డానికి వెళ్ళాడు. ఫ్లాటుకు సంభంధించిన హద్దు రాళ్ళు లేవు. చాలా ఖాళీ స్ధలం చుట్టూతా ఫెన్సింగ్ వేసేసి వుంది. రోడ్డు వైపు బోర్డుపై ‘మహంకాళి ఎస్టేట్’ అని ఉంది.

“నేను చెప్పానా !” అన్నాడు స్నేహితుడు.

“ఇది అన్యాయం... ఐదు వందల గజాల స్ధలం నాది. ఇవిగో కాగితాలు, అసలు నేను ఎవరికి అమ్మలేదు. ఎవరో పొరపాట్న కంచె వేసేసి ఉంటారు. “ వాదించాడతను.

దారిన పోతున్నవాళ్ళని అడిగారు, ‘అసలు మహంకాళి ఎవరండి’ అని. అతను అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ మెల్లగా “ పెద్ద రౌడి..గుండాయిజం చేస్తడు. వాడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇది నాది అంటే అది అతనిదే.. ఈ స్ధలాలన్నీ అలాగే అతనివే... ఎవరు కాదన్నా ప్రాణాలు పోతాయని నోరు ముసకున్నారు. బతికి ఉంటే చాలని. మీరూ ఆ బాపతే అయితే ఈ స్ధలం అసలు మీది కాదనుకుని వెళ్ళిపోండి. “ చెప్పాల్సింది చెప్పేసి పనున్నట్టు పరిగెత్తాడు.

“విన్నావుగా.... ఇంకా ఈ ఫ్లాటు ఎవరికి అమ్మాలంటావు” అడిగాడు ఫ్రెండు.

“నా కూతురి పెళ్ళి... దీని మీదనే ఆశలు పెట్టుకున్నాను...” అతని కళ్ళలోకి నీళ్ళొచ్చేసాయి.

“మీకింకా అనుమానం ఆశ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు కెళ్ళి అడగండి... అంతా కంప్యూటర్లో ఫీడ్ అయి ఉండచ్చు. అమ్మిన వాళ్ళు ఎవరైంది తెలియచ్చు. అన్నీ సరిగ్గా చూసుకున్నాక నాకు ఫోన్ చెయ్యండి...” అంటూ మధ్యవర్తి వెళ్లిపోయాడు. 

“సిటీల్లో ఖాళీ స్ధలాల సంగతి ఇలాగే ఉంది. కాళీ జాగా ఉంటే చాలు కబ్జా చేసేస్తున్నారు. నువ్వు ఇంక ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అనిపిస్తోంది. “ అన్నాడు ఫ్రెండ్.

అతను ఆశ వొదులుకోలేదు.రిజిష్టర్ ఆఫీస్ లో కనుక్కున్నాడు. ఎవరో తన పేరుతోనే అమ్మేసారు. మహంకాళి పేరున పది ప్లాటులు రిజిష్టర్ అయ్యాయి. అతని ఫోటో చూస్తే ఆశ్చర్యం వేసింది. చీపురు పుల్లలా సన్నగా ఉంటాడులా ఉంది.. పీల ముఖం... ఇలాంటి వాడు కబ్జ ఎలా చెయ్యగలడు. అదే అడిగితే ఫ్రండ్ వేదాంతిలా నవ్వాడు. 

“ఎవరో పలుకుబడి ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి వెనుక ఉంటారు. మహంకాళి అనేవాడు బినామిలా ఉంటాడు. “ అన్నాడు.

చిన్నప్పుడు తన చేతిలో తాయిలం తమదన్నట్లు లాక్కోవడం గుర్తు వచ్చిందతనికి.

“నా స్ధలం ఎవరికి అమ్మలేదు సార్! నేను లేకుండా రిజిష్ట్రేషన్ ఎలా జరుగుతుంది... “ అని ఎంత వాపోయినా సమాధానం ఒక్కటే, ‘పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా ! రిజిస్ట్రేషన్ కి అనువైన స్ధలమా కాదా! అని మేము చూస్తాము కాని అతను నిజమైన స్ధలదారా కాదా అనేది మాకు అనవసరం. చట్టం పరిధిలో ఎలా ఉంటే అవే మేము పట్టించుకుంటాము. “ అని.

ఉసూరుమనిపిస్తోంది ప్రాణం. ఇంటికి ఫోన్ చేసి విషయం భార్యకి చెప్పాడు. 

“డబ్బు బేంకులో వేద్దాం అంటే విన్నారా? చేతకానివాళ్ళం ఇంకేం చేస్తాం... ఆ రౌడి వెధవల్తో ఏం పెట్టుకుంటాం... వెనక్కొచ్చి మూసుకుని కూర్చోండి. “ అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది.

“వొక్కసారి మహంకాళిని కలుద్దామా..! నా ప్రాబ్లం చెప్పుకుంటె నా స్ధలం ఇచ్చేస్తాడేమో..” ఆశ నిరాశ మధ్య ఊగులాడుతూ ఫ్రెండ్ తో అన్నాడతను.

“చెవిటివాడి ముందు శంఖం ఊదినా ప్రయోజనం ఉంటుందేమో కాని, ఓ రౌడితో నీ బాధ చెప్పుకుంటే ఏమవుతుందనుకుంటున్నావు!” వెర్రివాడా అన్నట్లు చూసాడు ఫ్రెండు.

“ఏదో ప్రయత్నం చేద్దాం.. వాడి కాళ్ళయినా పట్టుకుంటాను. నా కూతురి పెళ్ళి సమస్య చెప్పుకుంటాను. .. దయ చూపించమంటాను. నువ్వు నాకు తోడురా చాలు..” అన్నాడతను.

ఇద్దరూ వెళ్ళి కలిసారు. ఏ ఆర్భాటం లేని చోట ఉన్నాడతను. చిన్న డాబా ఇల్లు.. లాల్చి పైజామా, నుదుట బొట్టు.. చాలా సాదాసీదాగా ఉన్నాడు. కనికరిస్తాడు అనుకున్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు.

“ఆ జాగా గురించైతే మర్చిపోమ్మా!” అన్నాడు మహంకాళి నవ్వుతూ.

“అది నాది .. ఎలా మర్చిపోవాలన్నా! పోని, డబ్బు ఇచ్చి కొనుక్కోండి. “ అన్నాడతను ఆశగా

“కొనాల్నా..! వొక్క స్ధలం ఎన్ని సార్లు కొనాల్న.. ఇంటున్న గదాని ఎగస్ట్రాలు మాటాడుతున్నావ్.. పో..పోయి బతుకు.. లేదంటే చస్తావ్..” అన్నాడు అతన్ని చేత్తో పక్కకి తోసేస్తూ.

ఎంతసేపు మొత్తుకున్నా మహంకాళి స్ధలం ఇవ్వనన్నాడు... డబ్బూ ఇవ్వనన్నాడు. ‘లొల్లి చేస్తే పోలీసులొస్తారు..’ అన్నాడు. అతని కళ్ళల్లో ఏదో కృరత్వం అప్పుడు భయపెట్టింది.

 ఇద్దరూ బైటకి వచ్చారు. “పోలీస్టేషన్లో కంప్లెయింటు చేద్దాం ..” అన్నాడతను.

ఫ్రెండ్ అతన్ని జాలిగా చూసాడు.ఏ ధైర్యం లేకుండా మహంకాళి పోలీసులు అని బెదిరించడు.. పాపం వీడికి తెలీడం లేదు. ‘పోయింది’ అనే బాధ తప్ప ‘రాదు’ అనే నిజం తెలీడం లేదు. సక్రమంగా డ్యూటీలు చేసేవాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారో వేళ్ళ మీద లెఖ్ఖ పెట్టవచ్చు. సాయం వెళితె పోయేదేముంది అన్నట్లు కదిలాడు ఫ్రెండు. 

ఇద్దరూ ఇన్స్పెక్టర్ తో వివరంగా చెప్పారు. అతను తన దగ్గరున్న పక్కా కాగితాలు చూపించాడు. . న్యాయం చేయమన్నాడు. ‘రేపు మీరా స్ధలం దగ్గర ఉండండి. మేము వస్తాం.. ఎవరు మీకు అడ్డొచ్చినా ఊరుకోవద్దు.. మేము చూసుకుంటాం.” అని భరోసా ఇవ్వడంతో ధైర్యం వచ్చేసింది అతనికి. ‘పిచ్చివాడా’ అన్నట్లు ఫ్రెండు చూసినా పట్టించుకోలేదు.

మర్నాడు పార్టీకి ఫోన్ చేసి రమ్మని ఇద్దరూ స్ధలం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే మహంకాళి అక్కడున్నాడు. అతనెందుకు వచ్చాడో తెలీక భయపడ్డాడు. పోలీసులు వస్తారని చాలా సేపు ఎదురుచూసాడు. జాడ లేరు. మహంకాళి కూల్గా నవ్వుతున్నాడు. ఎవరో మహంకాళిని కొట్టబోతున్నట్లు అతన్ని తోసారు. అప్పుడొచ్చారు పోలీసులు. ‘దొమ్మీ కేసు’ అంటూ అతన్ని, అతనితో పాటున్న వాళ్ళని జీపు ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళారు.

“నేను అతనికి సాయం వచ్చానంతే.. నాకేం సంబంధం లేదు” అని తప్పించుకున్నాడు ఫ్రెండు. “మహంకాళిని ఇతనే కోట్టాడు..” అని పార్టి తప్పించుకున్నాడు. మిగిలింది అతనే..

‘స్ధలం నాది.. అన్నందుకు దొమ్మికేసు పెట్టారెందుకు..?’ అర్ధం కాలేదు అతనికి. అదే అడిగాడు. నవ్వారు వాళ్ళు. ‘న్యాయం ధర్మం’ అన్నప్పుడల్లా లాఠీలు గాల్లోకి లేచాయి. వొళ్ళంతా వొకటే నొప్పులు. పేపర్లొ సైన్ చేయించుకుని .. ‘మళ్ళి గొడవ చేసావంటే ప్రాణం మిగలదు.. బతికి పో..’ అని వొదిలేసారు.

భరించలేనంత అవమానంగా ఉంది. చచ్చిపోవాలన్నంత కసిగా ఉంది. ఎవరికీ చెప్పుకోలేనంత బాధ. అనకాపల్లి స్టేషన్. రెండు నిమిషాలే ఆగుతుంది ట్రైన్. ఆ కాసేపట్లోనే జనం తోసుకుంటూ పరుగెత్తుతున్నారు. అందినవాళ్ళు ఎక్కుతున్నారు. అందుకోలేని వాళ్ళు ఆగిపోతున్నారు. ఓ ఫ్యామిలి అతన్ని తోసుకుంటూ లోనికి జొరబడ్డారు. డోర్ పక్కనున్న అతను తప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. లగేజ్ చూసుకుంటున్నారు. ఓ పదేళ్ళ పాప కిందనే ఉండిపోయింది. ట్రైన్ కదులుతోంది. వెనకనుంచి వొకావిడ ‘అయ్యో! నా కూతురు.. తేజా..! తేజా..! ‘ అతన్ని నెట్టుకుని కిందికి దిగడానికి సిద్ధమైపోయింది. అప్పుడు తేరుకున్నాడతను. వొక చేత్తో రాడ్ ని పట్టుకుని మరో చేత్తో పాప చేయ్యి పట్టుకుని లోనికి గుంజాడు. వెనుక నుంచి ఆవిడ అతన్ని తోసేస్తోంది ఎడుస్తూ..అతను పడబోయి నిలదొక్కుకున్నాడు.

పాప తల్లిని అతుక్కుపోయింది. నొప్పిగా ఉన్న చేతిని విదిలించుకున్నాడతను. ‘అంత రిస్క్ చేసారు, పడిపోయేవారు..’ అన్నారు అతని పక్కన నిలబడ్డవాళ్ళు. అతను నవ్వాడు. ‘ఎలాగు చచ్చిపోవాలనే అనుకుంటున్నప్పుడు కిందపడితే ఏం జరిగేది..కాస్త ముందు అంతే. ‘ కంపార్ట్మెంట్లో కలకలం రేగింది. అంటే టీసీ వచ్చినట్టున్నాడు. అతను అప్పటికే రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కినందుకు ఫైన్ కట్టాడు. ఓ బెర్త్ ఖాళీగా ఉంటే వాళ్ళందరూ కూర్చున్నారు. జనరల్ టికెట్స్ చూపించినట్టున్నారు. టీ.సీ మొహంలో ఏదో భావం.. చిరాకో, మెరుపో..అర్ధం కాలేదు. వాళ్ళని ఫైన్ కట్టమన్నాడు. వాళ్ళల్లో ఒకావిడ రెండు వందలు ఇవ్వబోతే తీసుకోలేదు, మరో వంద కలిపినా తీసుకోలేదు. రాజమండ్రి వరకే అంటున్నారు. అయినా టీసీ ‘నో’ అన్నాడు. 

“మూడు వందలు ఫైన్ కి సరిపోవా!” ఉక్రోషంగా అడిగాడతను డోర్ దగ్గరనుంచి వచ్చి.

“రిజర్వేషన్ కంపార్ట్మెంటు ఇది..” లాజిక్ ఒకటి. 

“ఇస్తున్నారు కదా, ఈ దోపిడి ఏంటి అసలు... ఫైన్ అంటూ కట్టించుకుని పక్క జేబులోకి తోసేస్తారు. ఇదేనా మీ డ్యూటి..?”

“చూడండి మిష్టర్! ఎవరి డ్యూటి వాళ్ళు చెయ్యాలి. ముందు మీ టికెట్ చూపించండి.. “ అడిగాడు టీసీ. చూపించాడతను. 

“రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఇది. ఎక్కడ ఖాళి దొరికితే అక్కడ కూర్చుంటానంటే కుదర్దు..” అంటూనే వాళ్ళు అందించిన ఐదు వందలు తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు.

మొదటిసారి గొంతు విప్పినందుకు సంతోషంగా ఉంది అతనికి. మహంకాళి గుర్తొచ్చాడు. తన స్ధలం గుర్తొచ్చింది. పోలీసులు పెట్టిన హింస గుర్తొచ్చింది. ‘పోయి బతుకు’ అన్న ఉదారత గుర్తొచ్చింది. అమ్మ మాట గుర్తొచ్చింది. ‘పిరికి సన్నాసి! .. ఏడుస్తారా.. ఎదిరించాలి..’ ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. చావుని వాయిదా వేస్తూ దిగిపోయాడు. ఎటిఎమ్ లోంచి తనకి కావల్సిన డబ్బు తీసుకున్నాడు. 

తిరిగి హైద్రాబాద్ బయలుదేరాడు. మర్నాడు ‘మహంకాళి ఎస్టేట్ ‘ అన్న బోర్డు పక్కన మరో బోర్డుని అటుగా వెళుతున్న చాలా మంది నిలబడి అర్ధంకాక మళ్ళి మళ్ళి చదివారు. 

“ఈ స్ధలం నాది.. మహంకాళిది కాదు..”

చచ్చేవాడు చావొచ్చు కదా, ఇలా రాసి చావడం దేనికో అర్ధం కాలేదు ఎవరికి. మహంకాళి మనుషులు వచ్చి ఆ బోర్డు పీకేసారు. మూడో రోజు మరో నాలుగు బోర్డులు అక్కడ ప్రత్యక్షం అయ్యాయి. కాపు కాసారు, ఎవ్వరూ దొరకలేదు. మహంకాళి వచ్చి చుట్టు పక్కల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పోయాడు. మర్నాడు అక్కడ అలాంటివే చాలా బోర్డులు.. మహంకాళి చిందులేసాడు. కాపు కాసి అతన్ని పట్టుకుని కొట్టించాడు. పోలీసులు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతుంటే జనం లోంచి ఓ గొంతు లేచింది. ‘కొట్టిన వాళ్ళని వదిలేసి అతన్ని ఎందుకు పట్టుకున్నారు.?’ అని. అదే ప్రశ్న మరో నాలుగు గొంతులు అడిగేసరికి పబ్లిక్ ఇష్యు అవుతోందని అర్ధమై పోలీసులు మహంకాళి మనుషులని తీసుకుని వెళ్ళిపోయారు. 

అతన్ని హస్పిటల్ కి తీసుకెళ్ళారు. ‘వైధ్యం ఎందుకు, స్ధలం కావాలి అని అరిచాడు. అందరూ గుసగుసలాడారు. హస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అతను మళ్ళి అక్కడే కూర్చున్నాడు. అతని పక్కన అదే బోర్డు. చిత్రంగా ఒక్కొక్కళ్ళే పోగవుతున్నారు. అధికారంలో లేని పార్టీలు మేమున్నాం అంటూ మద్దతు ఇచ్చాయి. మీడియా వచ్చింది. మహంకాళి పోలీసుల్ని వొత్తిడి చేస్తున్నా చేసేదేం లేదన్నారు. మహంకాళి వెనకున్న పెద్దమనిషి ఫోన్ చేసాడు.

‘వొక్క గొంతుతో పోయేదానికి వంద గొంతుల వరకు తెచ్చుకున్నావు... కంచె తీయించి అతని స్ధలం అతనికి ఇచ్చెయ్యి. ‘ అన్నాడు కోపంతో. మిగిలిన స్ధలాల వాళ్లు అందరు ‘మా స్ధలాలు మాకు ఇచ్చెయ్యండి... లేదంటే మేమూ ఊరుకోము.. ఎక్కడి వరకైనా పోతాము. ‘అంటూ నినాదాలు చేసారు. పోలీసులు వచ్చి చెదరగొట్టే కొద్దీ చేరిపోతున్నారు ‘చెలమలో నీరు’ లా. ఆ పోరు అలా సాగదియ్యడం ఇష్టం లేక, ఇక చేసేది లేక, మహంకాళి తన బోర్డు ఎత్తేసాడు. ఎవరి ప్లాట్లు వాళ్ళకు తన ఖర్చుతో రిజిష్టర్ చేయించాడు. ఎవరి స్ధలాల్లో వాళ్ళు కొత్త హద్దు రాళ్ళను పాతుకున్నారు. మొదటి అడుగు తనదైనందుకు సంతోషంగా ఉందతనికి. మార్కెట్ రేటుకి తన ప్లాటుని అమ్మకానికి పెట్టి అడ్వాన్స్ తీసుకున్నాడు. 

“నువ్వెంత పిరికివాడివో నాకు తెలుసు.. ఎలా ఇంత ధైర్యం వచ్చేసింది..?” ఫ్రెండ్ అతన్ని కౌగిలించుకుని అడిగాడు.

“ఈ సమస్య నాది కాదు. నా కూతురి పెళ్ళి సమస్య. నేను చచ్చిపోవాలనే అనుకున్నాను. కాని దాని వల్ల నా ఫేమిలీ సఫరవుతుంది. నేనెందుకు చచ్చిపోయానో కనీసం నా వాళ్ళకైనా తెలియాలి కదా! అందుకే తెగించాను. మనం దేశం మీద గౌరవంతో పాలకులకు వోటు వేస్తే వాళ్ళు దేశాన్ని ఎలా దోచుకుతిందామా అని ఆలోచిస్తూ, అదే వాళ్ళ హక్కు అనుకుంటే సామాన్యుడు చూస్తూ ఎంత కాలం నోరు మూసుకుంటాడు. తన కష్టార్జితాన్ని లాక్కుపోతుంటే చూస్తూ ఎంతకాలం. న్యాయం ఎక్కడా జరక్కపోతే సగటు మనిషి కడుపుమంట ఎంత దూరానికైనా దావానలంగా పాక్కుంటూపోతుంది. చావు వొక్కాసారే కదా వస్తుంది.. మళ్ళి మళ్ళి కావాలన్నా రాదు. ఈ స్ధలం నా శ్రమ. దీనిపై నాకు మాత్రమే హక్కుంది.” 

ధీమాగా అంటున్న అతను విప్లవ వీరుడేం కాడు.. సాధారణ మధ్యతరగతి పిరికివాడు... అతని పేరు శివాజి.

  

                    ***********